'వరల్డ్ సూపర్ సిరీస్' పై సైనా దృష్టి
బెంగళూరు: మూడేళ్ల సుదీర్ఘ విరామం తరువాత గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ చేరిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. ఇప్పుడు వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ పై దృష్టి సారించారు. గతేడాది ఈ టోర్నీకి క్వాలిఫై కాలేకపోయిన సైనా.. ఈసారి మాత్రం కచ్చితంగా అర్హత సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 'నేను గతం గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో నా శిక్షణపైన మాత్రమే దృష్టి పెట్టా. రాబోవు టోర్నీల్లో సత్తా చాటుకుని ర్యాంకును మెరుగుపరుచుకోవడమే నా ముందున్న లక్ష్యం. నా శక్తి వంచన లేకుండా శిక్షణ తీసుకుని రాటుదేలతాననే నమ్ముతున్నా. ఈ సీజన్ ముగింపు బ్యాడ్మింటన్ టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు అర్హత సాధించడం కోసం తీవ్రంగా శ్రమిస్తా' అని సైనా పేర్కొన్నారు.
గతేడాది తొమ్మిదో స్థానంలో నిలవడంతో దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సైనా అర్హత సాధించలేకపోయారు. కాగా, అదే సమయంలో ఎనిమిదో స్థానంలో నిలిచిన పీవీ సింధు క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతం కాలి నొప్పితో బాధపడుతున్న సైనా.. సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి హైదరాబాద్ లో పూర్తిస్థాయి శిక్షణకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.