గురువుకు గుడ్‌బై!
గోపీచంద్‌తో సైనా నెహ్వాల్‌కు విభేదాలు
అకాడమీని వదిలిన స్టార్ షట్లర్
ఆసియా క్రీడల కోసం విమల్ కుమార్ వద్ద శిక్షణ
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌కు కొత్త దశ, దిశను చూపించిన గురు శిష్య ద్వయం మధ్య మరో సారి విభేదాలు బయటపడ్డాయి. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌లు ఇకపై కలిసి పని చేసే అవకాశం కనిపించడం లేదు. సుదీర్ఘ కాలంగా కోచ్‌గా ఉన్న గోపీచంద్‌ను వదిలి... ఆసియా క్రీడల కోసం సైనా వేరుగా సాధన చేయాలని నిర్ణయించుకుంది. మాజీ ఆటగాడు విమల్ కుమార్ వద్ద ఆమె రెండు వారాల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో ఆమె సాధన చేయనుంది. ఈ క్రమంలో ప్రకాశ్ కూడా ఆమెకు మెంటర్‌గా సహకారం అందించనున్నారు. గత కొంత కాలంగా సైనా నెహ్వాల్ తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చడం లేదు.
దాదాపు 20 నెలల విరామం తర్వాత ఇటీవల జూన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ నెగ్గి ఆమె తన ఫామ్‌ను అందిపుచ్చుకుంది. అయితే కామన్వెల్త్ క్రీడలకు దూరంగా ఉన్న ఈ అగ్రశ్రేణి షట్లర్ తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్‌లో తనను అగ్రశ్రేణి క్రీడాకారిణిగా నిలబెట్టిన గోపీచంద్‌ను వదిలి మరో కోచ్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
కారణమేంటి?
‘మార్పు’ కోసమే తాను గోపి అకాడమీని వదిలానని సైనా చెబుతున్నా అదే కారణంగా కనిపించడం లేదు. బ్యాడ్మింటన్ వర్గాలు చెప్పినదాని ప్రకారం ఇటీవలి కాలంలో గోపీచంద్ తన ఆటపై వ్యక్తిగత శ్రద్ధ కనబర్చడం లేదని సైనా అసంతృప్తిగా ఉంది. సింధులాంటి కొత్త ప్లేయర్ల రాకతో తనకు తగిన సమయం కేటాయించడం లేదని ఆమె భావిస్తోంది.
పైగా కొన్నాళ్లుగా తన వైఫల్యాల సమయంలో ఆశించిన మార్గదర్శనం కరువైందని కూడా సైనా అనుకుంటోందని సమాచారం. ఆసియా క్రీడల కోసమే అని ఒక వైపు సైనా చెబుతున్నా... దానిని గోపీచంద్ నిర్ధారించకపోవడం, ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరిస్తుండటం చూస్తే బయటికి కనిపించని కారణమేదో సైనా తప్పుకునేట్లు చేసిందని తెలుస్తోంది.
గతంలోనూ జరిగింది
లండన్ ఒలింపిక్స్‌కు ముందు 2011లో కూడా సరిగ్గా ఇదే తరహాలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ‘సాయ్’ కోచ్ భాస్కర్‌బాబు వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు సైనా ఆసక్తి చూపించింది. దాదాపు మూడు నెలల పాటు ఆమె అక్కడే సాధన చేసింది. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సైనా రాజీ పడింది. ‘సారీ సర్’ అంటూ మళ్లీ గోపి గూటికే చేరింది. అయితే ఈ సారి సైనా మళ్లీ వెనక్కి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే భారత క్రీడా చరిత్రలో కోచ్-ప్లేయర్‌గా అత్యుత్తమ జోడీలలో ఒకటిగా నిలిచిన గోపీచంద్-సైనా అనుబంధం ముగిసినట్లే.
వెళితే తప్పేముంది...
‘ఇన్నేళ్లుగా ఒకే చోట శిక్షణ తీసుకున్నాను. కాస్త భిన్నంగా, కొత్తగా ప్రయత్నిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయనేది నా ఆలోచన. అందుకే మార్పు కోరుకున్నాను. విమల్ కుమార్ నాకు ఉబెర్ కప్ సమయంలో మంచి సూచనలిచ్చారు. ఆయన సహకారంతో ఆసియా క్రీడల్లో పతకం గెలవగలనని భావిస్తున్నా.
అందుకే ఈ రెండు వారాల పాటు శిక్షణకు సిద్ధమయ్యాను. ఇందులో తప్పేముంది. ఈ విషయం వరల్డ్ చాంపియన్‌షిప్ సమయంలోనే గోపి సర్‌తో చర్చించాను. ఆయన అనుమతి తీసుకునే వెళ్లాను. నాకు గోపీచంద్‌తో ఎలాంటి విభేదాలు లేవు. ఆసియా క్రీడల తర్వాత మళ్లీ అకాడమీకే వస్తాను’
- ‘సాక్షి’తో సైనా నెహ్వాల్
కోచ్ మౌనం
‘పదేళ్లుగా సైనా నా వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఇప్పుడు జరిగినదాని గురించి చర్చ అనవసరం. ఆసియా క్రీడలకు మరో 15 రోజుల సమయమే ఉంది. ఇలాంటి స్థితిలో తాజా పరిణామాలపై నేను స్పందించదల్చుకోలేదు. అందుకే ఎలాంటి వ్యాఖ్యా చేయడం లేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం’
- పుల్లెల గోపీచంద్