టాప్ ర్యాంక్‌లోనే ఉండేందుకు ప్రణాళికలు
సైనా నెహ్వాల్ వ్యాఖ్య
బెంగళూరు: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదని... అయితే పక్కా ప్రణాళికతో తీవ్ర సాధన చేస్తే సుదీర్ఘ కాలంపాటు తాను టాప్ ర్యాంక్‌లో ఉండే అవకాశం ఉందని భారత బ్యాడ్మిం టన్ స్టార్ సైనా నెహ్వాల్ తెలిపింది. గురువారం రెండోసారి నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన నేపథ్యంలో పలు అంశాలపై సైనా వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
కష్టపడితే కష్టమేమీ కాదు: అన్నీ అనుకున్నట్లు జరిగితే... సుదీర్ఘ కాలంపాటు నేను నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతాననే విశ్వాసం ఉంది. అయితే ఇది నిజం కావాలంటే నేను తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. భారత్ తరఫున సాధ్యమైనన్ని ఎక్కువ టైటిల్స్ నెగ్గేందుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. టాప్ ర్యాంక్ విషయంలో చైనా ప్లేయర్ లీ జురుయ్ నుంచే నాకు ఎక్కువ పోటీ ఉంది.
అంతా బాగుంది: టోర్నమెంట్‌ల సమయంలో తప్పించి మాజీ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో ప్రత్యేకంగా మాట్లాడేందుకు వీలుకాదు. చాలా ఏళ్లపాటు నాకు కోచ్‌గా ఉన్న గోపీచంద్ నాకు ఎన్నో మంచి విషయాలు నేర్పించారు. అయితే శిక్షణకోసం వేరే చోటికి వెళితే పరిస్థితుల్లోనూ తేడా వస్తుంది. ప్రస్తుతం ఆయన తన పని చేసుకుంటున్నారు. నేను నా పని చేసుకుంటున్నాను. అంతా మంచే జరుగుతోందనేది ఇక్కడ కీలకం. కోచ్ విమల్ కుమార్ పుణ్యమే: ప్రతి కోచ్ పరిపూర్ణుడు కాదు. ఒక దశ నుంచి మరో దశకు చేరుకోవాలంటే ఏం చేయాలో కోచ్‌లందరికీ తెలిసే అవకాశాలు తక్కువ. ఒక దశ చేరుకున్నాక నా ఆటతీరులో పురోగతి కనిపించలేదు. ఈ దశలో కోచ్ విమల్ కుమార్ నా ఆటతీరును మెరుగుపరిచారు. ఆయనతో కలిసి సాధన చేశాక వచ్చిన ఫలితాలు మీరే చూశారు. నాలో నంబర్‌వన్ కాదగ్గ ప్రతిభ ఉందని ఆయన గుర్తించి, దానిని నిజం చేసి చూపించారు.
అవార్డులపై ప్రభుత్వమే నిర్ణయించాలి: భవిష్యత్‌లో నాకు ‘పద్మ’ పురస్కారం ఇవ్వాలా వద్దా అనే విషయం ప్రభుత్వానికే వదిలేస్తున్నాను. ఒకసారి ఈ అంశంపై నా అభిప్రాయం చెప్పాను. దీనిపై వందసార్లు మాట్లాడాల్సిన అవసరంలేదు. అదంతా గతం.