వెళ్లొద్దన్నా... వెళ్లిపోయింది | Pullela Gopichand Reveals Story Behind Saina Nehwal | Sakshi
Sakshi News home page

వెళ్లొద్దన్నా... వెళ్లిపోయింది

Published Mon, Jan 13 2020 3:21 AM | Last Updated on Mon, Jan 13 2020 8:01 AM

Pullela Gopichand Reveals Story Behind Saina Nehwal - Sakshi

న్యూఢిల్లీ: శిష్యులు గొప్ప విజయాలు సాధించిన ప్పుడు తెగ సంబరపడిపోడు! అలాగే విమర్శలొచ్చినా పట్టించుకోడు! ఎప్పుడైనా సరే తన పని తను చూసుకొనే మనస్తత్వం పుల్లెల గోపీచంద్‌ది. అలాంటి గోపీ అప్పుడెప్పుడో సైనా నెహ్వాల్‌తో వచ్చిన మనస్పర్థలపై తాజాగా స్పందించాడు. త్వరలో విడుదల కానున్న ‘డ్రీమ్స్‌ ఆఫ్‌ ఎ బిలియన్‌: ఇండియా అండ్‌ ద ఒలింపిక్‌ గేమ్స్‌’ అనే పుస్తకంలో భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌... దిగ్గజ బ్యాడ్మింటన్‌ సూపర్‌స్టార్‌ ప్రకాశ్‌ పదుకొనేపై కూడా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు. ‘నా అకాడమీ నుంచి సైనా వెళ్లిపోవడం నాకిష్టం లేదు. నా ప్రియమైన శిష్యురాలు నా నుంచి దూరమవుతోందనిపించింది. అందుకే ఆమెను అకాడమీ నుంచి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాను. కానీ ఆమె అప్పటికే ఇతరుల మాటల్ని చెవికెక్కించుకుంది. నా మాట వినలేదు. ఆమె ఆట ప్రగతి కోసం తపించినప్పటికీ నా అకాడమీలోనే ఉండే విధంగా ఒప్పించలేకపోయాను. అది మా ఇద్దరికి మంచిది కాదని తెలుసు. కానీ ఏం చేస్తాం. ఓ కోచ్‌గా సింధు ప్రదర్శనపై కూడా నమ్మకంతో ఉన్నాను.

ఇది నిజమే. ఆమెకూ శిక్షణ ఇచ్చాను. అయితే అదే సమయం (2012–2014)లో సైనాకిచ్చే శిక్షణలో, ప్రాధాన్యంలో నిర్లక్ష్యమేమీ చూపలేదు. అయితే ఈ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో’ అని అప్పటి గతాన్ని ఆ పుస్తకంలోని ‘బిట్టర్‌ రైవలరీ’ అనే అధ్యాయంలో క్లుప్తంగా వివరించాడు గోపీచంద్‌. ఈ విషయంలో ఒలింపిక్స్‌ గోల్డ్‌క్వెస్ట్‌ (ఓజీక్యూ) సభ్యులైన ప్రకాశ్‌ పదుకొనే, విమల్‌ కుమార్, వీరేన్‌ రస్కినాలెవరూ చొరవ చూపించలేదని, తన శిక్షణలోనే ఆమెకు మంచి జరుగుతుందని వాళ్లెవరూ ఆమెతో చెప్పలేపోయారని గోపీచంద్‌ అన్నాడు. ‘వీళ్లంతా సైనాతో మాట్లాడి ఒప్పించవచ్చు. కానీ వాళ్లెందుకు అలా చేయలేదో తెలియదు. పైగా హైదరాబాద్‌ వీడేందుకు ఆమెను ప్రోత్సాహించారు కూడా! నా రోల్‌ మోడల్‌ అయిన ప్రకాశ్‌ సర్‌ను ఎంతగానో అభిమానిస్తాను. కానీ ఆయన మాత్రం బ్యాడ్మింటన్‌కు ఇంతచేసినా నా సేవల గురించి ఎక్కడా, ఎప్పుడూ ఒక్క మంచి మాటగానీ చెప్పలేదు. ప్రశంసలుగానీ కురిపించలేదు. ఇది నాకు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీయే’ అని గోపీచంద్‌ తెలిపాడు.

ప్రముఖ క్రీడా పాత్రికేయులు బొరియా మజుందార్, నళిన్‌ మెహతా రచించిన ఈ పుస్తకం ఈనెల 20న విడుదలవుతుంది. ఈ పుస్తకంలో సైనా భర్త, షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ కూడా తన అభిప్రాయాల్ని వెల్లడించాడు. ‘గోపీచంద్‌ తనకు మాత్రమే కోచ్‌గా ఉండాలని సైనా భావించింది. అయితే ఒక్కసారిగా సింధు మంచి ఫలితాలు సాధించడంతో గోపీచంద్‌ కేవలం సైనాపైనే దృష్టి పెట్టకుండా ఇతరులకు కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అయితే ఈ అంశాన్ని సైనా పాజిటివ్‌గా తీసుకోకుండా నెగెటివ్‌గా తీసుకుంది. నా వంతుగా సైనాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె నా మాటలు పట్టించుకోలేదు. 2016 రియో ఒలింపిక్స్‌లో సైనా గాయంతోనే ఆడింది. లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. నిజంగా సైనాకు అది గడ్డుపరిస్థితి. గోపీ అకాడమీ నుంచి నిష్క్రమించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ హరియాణా వాసి ఎలా ప్రవర్తిస్తుందో అలాగే చేసింది. వాళ్లంతే! తాము అనుకున్నదే కరెక్ట్‌ అనుకుంటారు. దాన్నే తలదాకా ఎక్కించుకుంటారు.

ఆ గర్వమే సైనాకు నష్టం కలిగించింది’ అని చెప్పుకొచ్చాడు.   2014 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధు కాంస్యం సాధించడం... సైనా క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఈ మెగా ఈవెంట్‌ తర్వాత గోపీచంద్‌ అకాడమీ వీడాలని సైనా నిర్ణయించుకొని బెంగళూరులో విమల్‌ కుమార్‌ వద్ద శిక్షణకు వెళ్లిపోయింది. రెండేళ్లపాటు విమల్‌ వద్ద శిక్షణ తీసుకున్న సైనా ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సాధించడంతోపాటు మూడు టైటిల్స్‌ను గెలిచింది. 2015 ఆల్‌ ఇంగ్లండ్, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రన్నరప్‌గా నిలిచింది. అయితే 2016లో గాయాల బారిన పడ్డ ఆమె పూర్తి ఫిట్‌నెస్‌ లేకుండానే రియో ఒలింపిక్స్‌లో పాల్గొంది. లీగ్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. గాయాలు తిరగబెట్టడం... ఆటతీరు గాడి తప్పడం... బెంగళూరులో తనకు స్నేహితులు లేకపోవడంతో సైనాకు ఏమి చేయాలో తోచలేదు. సన్నిహితులతో చర్చించి, కెరీర్‌ గాడిలో పడాలంటే ఏం చేయాలో ఆలోచించి 2017 ప్రపంచ చాంపియన్‌ప్‌ ముగిశాక గోపీచంద్‌ గూటికే మళ్లీ చేరాలని సైనా నిర్ణయం తీసుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement