నైంటీస్‌ జమానా దుకాణం..! ఆ తరం మధుర జ్ఞాపకాలు.. | 90s Mittai kadai Shop: 90s Kids Sweet Memories | Sakshi
Sakshi News home page

నైంటీస్‌ జమానా దుకాణం..! ఆ తరం మధుర జ్ఞాపకాలు..

Published Sun, Oct 6 2024 2:47 PM | Last Updated on Sun, Oct 6 2024 3:30 PM

90s Mittai kadai Shop: 90s Kids Sweet Memories

ముయ్యేళ్ల కిందట– అంటే..నైంటీస్‌ జమానాలో ఇప్పుడున్నస్మార్ట్‌ఫోన్‌లు లేవు, ఆన్‌లైన్‌ గేమ్స్‌ లేవు. అప్పటి పిల్లలకు గోలీలు, బొంగరాలువంటి ఆరుబయటి ఆటలే కాలక్షేపం. అప్పట్లో పిజ్జాలు, బర్గర్‌లు లేవు. నారింజ మిఠాయిలు, అంకెలు, అక్షరాల ఆకారంలో ఉండే బిస్కట్లు వంటివే పిల్లల జిహ్వచాపల్యాన్ని తీర్చే చిరుతిళ్లు. అప్పటి పిల్లలు ఇప్పుడు యువకులైపోయారు. పిల్లలకు తల్లిదండ్రులైపోయారు. తమ పిల్లలకు తమచిన్ననాటి కాలక్షేపాలను, చిరుతిళ్లను పరిచయం చేయాలని ఉన్నా, బజారులో అవేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. 

ఆ లోటును తీర్చడానికే చెన్నైలోని తెలుగు సంతతికి చెందిన ఆర్‌.జయంతన్‌ చెన్నై క్రోంపేటలో ‘నైంటీస్‌ మిఠాయి కడై’ పేరుతో ఆనాటి జ్ఞాపకాలను కొలువుతీర్చి దుకాణం ఏర్పాటు చేశారు. ఇందులోని వస్తువులను ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఇప్పటి తరానికి కూడా అందుబాటులోకి తెచ్చేఉద్దేశంతో జయంతన్‌ ప్రారంభించిన ఈ దుకాణం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టి కడత్తూరు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబానికి చెందిన యువకుడు ఆర్‌.జయంతన్‌ చెన్నైలోని ఓ కళాశాలలో ఎంటెక్‌ పూర్తి చేశారు. ఎంబీఏ పట్టభద్రురాలైన తన భార్య విద్య ఇచ్చిన సలహాతో విలక్షణంగా ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఉద్యోగం చూసుకునే బదులు వ్యాపార రంగంలోకిఅడుగుపెట్టి, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి గుర్తు చేసేలా చెన్నై క్రోంపేటలో దుకాణం ఏర్పాటు చేశాడు. ఎనభై, తొంభై దశకాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్న వివిధ రకాల ఆట వస్తువులు, పెన్నులు, పుస్తకాలు, బ్యాగ్‌లు, బిస్కట్లు, చాక్లెట్లు వంటివి సేకరించి, తన దుకాణంలో కొలువుదీర్చారు. అలాగే ఆన్‌లైన్‌లోనూ వీటి అమ్మకాలను సాగించేందుకు'www.90smittaikadai.com' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ దుకాణంలోకి అడుగుపెడితే చాలు, నైంటీస్‌ నాటివారు తమ బాల్యజ్ఞాపకాల్లో తేలిపోతారు.

వారి కళ్లలో ఆనందాన్ని చూస్తున్నా: ఆర్‌.జయంతన్‌
మా దుకాణానికి వచ్చే నైంటీస్‌ తరంవారు తమ పిల్లలకు ఇక్కడి వస్తువులను ఒక్కొక్కటే చూపిస్తూ, వాటిని తాము ఎలా ఉపయోగించేవారో, ఎలా ఆటలాడే వారో వివరిస్తుంటే ఎనలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడికొచ్చే కస్టమర్ల కళ్లలో బాల్య స్మృతుల ఆనందాన్ని చూస్తున్నా. అప్పట్లో ఇలాంటివి కొనేందుకు డబ్బులు లేకున్నా, చూసి ఆనందంతో గంతులేసే వాళ్లం. ఇప్పుడు
చేతిలో డబ్బులు ఉన్నా, ఈ వస్తువులు దొరకడం అరుదైపోయింది. అందుకే ఈ అరుదైన వస్తువులను వెతికి, ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మా దుకాణంలో విక్రయాలకు పెట్టాం. ఈ వస్తువులను నైంటీస్‌ తరంవారు తమ పిల్లలకు కొనివ్వడమే కాకుండా, నాటి జ్ఞాపకాలను నెమరు
వేసుకుంటుండటం సంతోషం కలిగిస్తోంది. ఇవి మరింత విస్తృతం కావాలన్న కాంక్షతోనే ఆన్‌లైన్‌లోనూ విక్రయాలను ప్రారంభించా. ఇందులో లాభాపేక్ష కన్నా, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి చేరవేయాలనేదే మా లక్ష్యం. దేశంలో ఏ మూలకైనా సరే ఈ వస్తువులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్నప్పుడు నేను ఆడుకున్న వస్తువులు సైతం ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కొందరు కస్టమర్లు తమకు కావాల్సిన కొన్ని వస్తువులను సూచిస్తుంటారు. వారి ఆర్డర్‌కు తగినట్లుగా, వాటిని కొంత సమయం పట్టినా సరే సేకరించి లేదా తయారు చేయించి కొరియర్‌ ద్వారా
పంపిస్తున్నాం. 

కనుమరుగైన వస్తువులు కూడా 
ఈ నైంటీస్‌ జమానా దుకాణంలో కనుమరుగైపోయిన పాతకాలం వస్తువులను కూడా కొలువుదీర్చారు. గ్రామఫోన్, కిరోసిన్‌ లాంతరు వంటి వస్తువులతో పాటు ఆనాటి గేమ్‌ కిట్స్, బొంగరాలు, కర్రా బిళ్ల, గోలీలు, నారింజ మిఠాయి, ఐస్‌ట్యూబ్, పాపిన్స్, ఫాంటమ్‌ స్వీట్‌ సిగరెట్లు, బొంబాయి మిఠాయి, టిట్‌ బిట్స్, అక్షరాలు, అంకెలతో కూడిన బిస్కట్లు, కిస్‌మీ బార్, చాక్లెట్లు, ట్రంప్‌ కార్డులు, కొయ్య బొమ్మలు, ఫ్రిజ్‌ మేగ్నెట్లు, రెండు నిబ్బుల ఫౌంటెన్‌ పెన్నులు, కాప్సూ్యల్‌పెన్నులు, కొయ్య పెన్నులు, హీరో పెన్నులు, కామ్లిన్‌ పెన్నులు, ఇన్విజిబుల్‌ పెన్నులు, ఇంక్‌ ఇరేజర్లు వంటి వస్తువులు, బొమ్మ కార్లు, బొమ్మ బైకులు, సైకిల్‌ హారన్లు, విసనకర్రలు, మౌతార్గాన్‌ వంటి సంగీత పరికరాలు, ఆనాటి సినిమా పాటల పుస్తకాలు వంటి ఎన్నో
వస్తువులు ఈ దుకాణంలో ఐదు రూపాయలు మొదలుకొని పదిహేనువందల రూపాయల
వరకు వివిధ ధరల్లో అందుబాటులోఉంటాయి. 
 అస్మతీన్‌ మైదిన్‌, బ్యూరో ఇన్‌చార్జ్‌, చెన్నై 

(చదవండి: డ్యూటీకి.. టిక్‌.. టిక్‌..కానీ బాడీ క్లాక్‌ బీట్‌ వినండి ప్లీజ్‌..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement