
న్యూఢిల్లీ: ఎంపీగా అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. నెల రోజుల్లోపు దాన్ని ఖాళీ చేయాలన్న లోక్‌సభ సచివాలయం నోటీసుపై ఆయన మంగళవారం స్పందించారు. ‘‘12, తుగ్లక్ లేన్‌లో నాకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలంటూ మీరు పంపిన లేఖకు ధన్యవాదాలు. నాలుగుసార్లు ఎంపీగా ఆ బంగ్లాలో చాలా ఏళ్లు గడిపాను. నాకక్కడ ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నా హక్కులకు భంగం కలగని రీతిలో వ్యవహరిస్తా’’ అంటూ నోటీసుకు బదులిచ్చారు. సదరు బంగ్లాలో రాహుల్ 2005 నుంచీ ఉంటున్నారు.
దాన్ని ఖాళీ చేయాలన్న తాఖీదులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ సర్కారు తాలూకు ‘బెదిరించి, భయపెట్టి, అవమానించే’ వైఖరికి ఇది పరాకాష్ట అంటూ దుయ్యబట్టారు. రాహుల్‌ను బలహీనపరిచేందుకు మున్ముందు కూడా ఎంత చేయాలో అంతా చేస్తారని అభిప్రాయపడ్డారు. ‘‘రాహుల్‌కంటూ సొంతిల్లు లేదు. అధికారిక బంగ్లా వీడాక తన తల్లి సోనియాతో 10, జన్‌పథ్ నివాసంలో ఉంటారు. లేదంటే నా ఇంటిని ఖాళీ చేసి ఆయనకిస్తా’’ అని ఖర్గే చెప్పుకొచ్చారు. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆర్నెల్ల తర్వాత గానీ నాకు అధికారిక బంగ్లా కేటాయించలేదు. ఇలాంటివి బీజేపీకి అలవాటే’’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment