కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నిజంగానే ఇవాళ ఊరట ఇచ్చింది. పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా.. ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లోనూ ఆయన మళ్లీ పోటీ చేసేందుకు వీలు కల్పిచింది. అయితే.. రాహుల్ గాంధీ ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే సభలో అడుగుపెడతారా? కేంద్రంపై అవిశ్వాస చర్చలో పాల్గొంటారా?.. లోక్‌సభ సెక్రటేరియెట్ ఏం చేయబోతుంది.. అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు.
లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరగాలంటే.. సుప్రీం కోర్టు తన శిక్షను నిలుపుదల చేసిందని, కాబట్టి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరుతూ లోక్‌సభ కార్యదర్శికి రాహుల్ గాంధీ ఒక విజ్ఞప్తిని సమర్పించాలి. పనిలో పనిగా సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని సైతం జత చేయాల్సి ఉంటుంది. ఆ కాపీల ఆధారంగానే రాహుల్‌గాంధీ అనర్హత వేటును లోక్‌సభ ఎత్తేస్తుంది. ఆపై అధికారిక ప్రకటనచేస్తుంది. అయితే ఇది జరిగినా.. రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్ధరణ కావడానికి కాస్త సమయం పట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే..
గతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఫైజల్(లక్షద్వీప్) విషయంలోనూ ఇలాగే జరిగింది. హత్యాయత్నం కేసులో శిక్ష పడిన ఆయన సభ్యత్వం కోల్పోగా.. కేరళ హైకోర్టు ఆయన శిక్షపై స్టే విధించింది. అయితే రెండున్నర నెలల తర్వాతే లోక్‌సభ సెక్రటేరియెట్ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాహుల్ విషయంలోనూ అదే జరగొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు.
అయితే ఫైజల్ కేసులో మరో ఆసక్తికరమైన పరిణామం ఉంది. ఆయన తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ మరికొద్ది గంటల్లో విచారణ జరగాల్సి ఉండగా.. లోక్‌సభ సెక్రటేరియెట్ హడావిడిగా ఆయన సభ్యత్వ పునరుద్ధరణ ప్రకటన చేసింది.
ఇక రాహుల్ విషయంలో మాత్రం ఎలాంటి జాప్యం జరగొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఇవాళ సుప్రీం కోర్టు స్టే ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీతో లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి. వీలైనంత త్వరగా రాహుల్‌పై అనర్హత వేటు ఎత్తేసేలా లోక్‌సభ కార్యదర్శిపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
మోదీ ఇంటి పేరు కేసు.. రాహుల్‌కు శిక్ష.. టైం లైన్..
ఏప్రిల్ 13, 2019.. కోలార్(కర్ణాటక) ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ.. ఇలా దొంగలందరికీ ఒకే ఇంటిపేరు (మోదీ) ఎందుకు ఉంటుంది..?’ అని వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 15, 2019: రాహుల్ వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్ ఎమ్మెల్యే, భాజపా నేత పూర్ణేశ్ మోదీ క్రిమినల్ పరువునష్టం దావా వేశారు.
జులై 7, 2019: ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సూరత్ మెట్రోపాలిటన్ కోర్టుకు రాహుల్ గాంధీ తొలిసారి హాజరయ్యారు.
మార్చి 23, 2023: మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
మార్చి 24, 2023: రెండేళ్ల శిక్ష పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.
ఏప్రిల్ 2, 2023: మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సూరత్ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు.
ఏప్రిల్ 20, 2023: రాహుల్ అభ్యర్థనను పరిశీలించిన సూరత్ సెషన్స్ కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ, తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది.
ఏప్రిల్ 25, 2023: సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
జులై 7, 2023: రాహుల్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. తీర్పుపై స్టే విధించాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.
జులై 15, 2023: గుజరాత్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ స్టే విధించకుంటే భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు.
జులై 21, 2023: హైకోర్టు ఆదేశాలను సవాలు చేసిన కేసులో గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతోపాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆగస్టు 4, 2023: రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సూరత్ కోర్టు కచ్చితంగా రెండేళ్లపాటు శిక్ష విధించడానికి కారణాలేంటో తెలియదని, దాని మూలంగానే రాహుల్‌పై అనర్హత వేటు పడిందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక్క రోజు తక్కువ శిక్ష వేసినా.. లోక్‌సభలో అనర్హత వేటు నుంచి ఆయన బయటపడేవారని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment