official bungalow
-
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. ఢిల్లీలో కొత్త బంగ్లా
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. సునేహ్రీ బాగ్ రోడ్‌లోని నెంబర్ 5 బంగ్లాను రాహుల్‌కు హౌస్ కమిటీ ఆఫర్ కల్పించినట్లు సమాచారం. ఈ మేరకు రాహుల్ సోదారి ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లినట్లు వినికిడి. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.కాగా పరువునష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం దిల్లీలోని 12-తుగ్లక్ లేన్‌లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని పార్లమెంటరీ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఆ ఇంటిని ఖాళీ చేసి.. 10 జన్‌పథ్‌లోని తన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ నివాసానికి మారారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు.ఇదిలా ఉండగా 2004లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి గతేడాది ఏప్రిల్ వరకు రాహుల్.. 12- తుగ్లక్ లేన్ బంగ్లాలోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. దీంతో ఆయన కేబినెట్ హోదాను కలిగి ఉన్నందున టైప్ 8 బంగ్లాకు రాహుల్ అర్హుడు. -
మహువా మొయిత్రాకు మరో షాక్
ఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్ తగిలింది. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను తక్షణమే ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీకాగా.. సంబంధిత అధికారులు నేడో, రేపో రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ నేత మహువా మొయిత్రా పై డిసెంబర్ 8వ తేదీన బహిష్కరణ వేటు పడింది. ఆ వెంటనే ఆమె అధికారిక బంగ్లా కేటాయింపు సైతం రద్దైంది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ మహువాకు కిందటి నెలలోనే నోటీసు వెళ్లింది. జనవరి 7వ తేదీ లోపు బంగ్లా ఖాళీ చేయాలన్నది ఆ నోటీసుల సారాంశం. ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(DOE)కు విజ్ఞప్తి చేయాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈలోపు గడువు ముగియడంతో డీవోఈ జనవరి 8వ తేదీన.. బంగ్లాలో ఎందుకు కొనసాగనివ్వాలో చెప్పాలంటూ ఆమెకు నోటీసులు పంపింది. మూడు రోజులు గడిచినా ఆమె నుంచి సమాధానం లేకపోవడంతో.. 12వ తేదీన మరోసారి నోటీసులు పంపింది. దీంతో ఆమె డీవోఈ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆమె వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో.. మంగళవారం నాడు తక్షణమే బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు పంపింది డీవోఈ. అంతేకాదు.. ఆలస్యం చేయకుండా ఆమెతో బంగ్లా ఖాళీ చేయించేందుకు అధికారుల బృందాన్ని రంగంలోకి దింపనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
రాహుల్ గాంధీ దరఖాస్తు చేసుకోవాల్సిందే!
ఢిల్లీ: జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే తీర్పుతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యింది. ఇవాళ(సోమవారం) సభకు లోక్‌సభకు హాజరైన ఆయన హుషారుగా కనిపించారు కూడా. రేపు పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ ఉండనుంది. మణిపూర్ అంశం కావడం.. పైగా అక్కడ ఆయన పర్యటించి ఉండడంతో.. వాస్తవాల ఆధారంగా కేంద్రాన్ని ఆయన నిలదీస్తారంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. అనర్హత వేటు తర్వాత తుగ్లక్ లేన్‌లోని తన అధికారిక బంగ్లాను ఆయన ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు ఆయనకు అండగా నిలిచి.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. అయితే రాహుల్ మాత్రం నిబంధనలకు అనుగుణంగా బంగ్లా ఖాళీ చేసి అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత 10 జన్‌పథ్ రోడ్‌లోని తల్లి సోనియా గాంధీ నివాసానికి మారిపోయారాయన. అయితే దానిని మరొకరికి ఇంకా కేటాయించలేదు. దీంతో ఇప్పుడు తన బంగ్లాను తానే చేజిక్కుంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారాయన. ఈ క్రమంలో.. ఇవాళ ఉదయం లోక్ సభ హౌసింగ్ కమిటీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి. రాహుల్ తరపున తాను దరఖాస్తు చేస్తానని చెప్పారు. అయితే నిబంధనల ప్రకారం అలా కుదరదని హౌజింగ్కమిటీ తేల్చి చెప్పింది. రాహుల్ గాంధీ స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో రేపు రాహుల్ గాంధీ తన బంగ్లాను తనకు కేటాయించాలని కోరే అవకాశం ఉంది. -
అనర్హత వేటు.. ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తనపై అనర్హత వేటు కారణంగా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ గతంలోనే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ తన బంగ్లాను ఈరోజు ఖాళీ చేశారు. దీంతో, ఢిల్లీ 12 తుగ్లక్ లైన్‌లోని ప్రభుత్వ బంగ్లాలో ఉన్న ఆయన సామాన్లను ట్రక్కుల్లో తరలించారు. అయితే, పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి జైలు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో, వెంటనే రాహుల్‌పై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడింది. ఇదిలా ఉండగా.. రెండేళ్ల జైలుశిక్ష తీర్పును నిలిపేయాలని కోరుతూ దాఖలైన అప్పీలుపై సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక, రాహుల్ గాంధీ లోక్‌సభకు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో రాహుల్ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో, ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు. #WATCH | Trucks at the premises of Delhi residence of Congress leader Rahul Gandhi. He is vacating his residence after being disqualified as Lok Sabha MP. pic.twitter.com/BZBpesy339 — ANI (@ANI) April 14, 2023 -
ఆ బంగ్లాతో ఎన్నో జ్ఞాపకాలు
న్యూఢిల్లీ: ఎంపీగా అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. నెల రోజుల్లోపు దాన్ని ఖాళీ చేయాలన్న లోక్‌సభ సచివాలయం నోటీసుపై ఆయన మంగళవారం స్పందించారు. ‘‘12, తుగ్లక్ లేన్‌లో నాకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలంటూ మీరు పంపిన లేఖకు ధన్యవాదాలు. నాలుగుసార్లు ఎంపీగా ఆ బంగ్లాలో చాలా ఏళ్లు గడిపాను. నాకక్కడ ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నా హక్కులకు భంగం కలగని రీతిలో వ్యవహరిస్తా’’ అంటూ నోటీసుకు బదులిచ్చారు. సదరు బంగ్లాలో రాహుల్ 2005 నుంచీ ఉంటున్నారు. దాన్ని ఖాళీ చేయాలన్న తాఖీదులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ సర్కారు తాలూకు ‘బెదిరించి, భయపెట్టి, అవమానించే’ వైఖరికి ఇది పరాకాష్ట అంటూ దుయ్యబట్టారు. రాహుల్‌ను బలహీనపరిచేందుకు మున్ముందు కూడా ఎంత చేయాలో అంతా చేస్తారని అభిప్రాయపడ్డారు. ‘‘రాహుల్కంటూ సొంతిల్లు లేదు. అధికారిక బంగ్లా వీడాక తన తల్లి సోనియాతో 10, జన్‌పథ్ నివాసంలో ఉంటారు. లేదంటే నా ఇంటిని ఖాళీ చేసి ఆయనకిస్తా’’ అని ఖర్గే చెప్పుకొచ్చారు. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆర్నెల్ల తర్వాత గానీ నాకు అధికారిక బంగ్లా కేటాయించలేదు. ఇలాంటివి బీజేపీకి అలవాటే’’ అని విమర్శించారు. -
ముఖ్యమంత్రి నివాసంలో 31 ఏసీల
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షీలాదీక్షిత్ అధికారిక నివాసంలో మొత్తం 31 ఏసీలు ఉన్నాయి. దీంతోపాటు 25 హీటర్లు కూడా ఉన్నాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేయడంతో వెలుగులోకి వచ్చింది. షీలా అధికారిక నివాసం 3-మోతీలాల్ నెహ్రూమార్గ్లో ఉంది. దీనిని ప్రస్తుతం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించింది. ఇందులో 31 ఏసీలు, 15 డెసర్ట్ కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీసర్లు ఉన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి అవసరాలకు అనుగుణంగా ఈ భవనంలోని విద్యు త్ పరికరాలు, సామగ్రిని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూ) రూ. 16.81 కోట్లు వెచ్చించింది. కేరళ గవర్నర్‌గా నియమితురాలైన షీలా ఈ నివాసం ఖాళీ చేసి వె ళ్లిపోయిన తర్వాతఅందులో బిగించిన పరికరాల వివరాలను సీపీడబ్ల్యూ వెల్లడిస్తూ... ఇందులో కొన్నింటిని అవసరాలనుబట్టి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చామని పేర్కొంది. ఈ విషయాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త సుభాష్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీకి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్‌కు అప్పట్లో ప్రభుత్వం నాలుగు పడక గదులు కలిగిన బంగ్లాను కేటాయించింది. ఈ భవనం 1920లో నిర్మితమైంది. దీనిని అప్పట్లో 3.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపాలవడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి షీలాదీక్షిత్ తప్పుకోవడం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి యూ పీఏ ప్రభుత్వం షీలాదీక్షిత్‌కు కేరళ గవర్నర్ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆమె తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి మధ్యఢిల్లీలోని ఫిరోజ్షారోడ్డు ప్రాంతంలోగల భారీ ఓ ప్రైవేటు భవనాన్ని కిరాయికి తీసుకున్నారు. -
ప్రభుత్వ బంగ్లా కూడా అక్కర్లేదు: కేజ్రీవాల్
ఢిల్లీ సీఎంగా త్వరలో పాలన పగ్గాలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కల్పించే సదుపాయాలను వరుసగా తిరస్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి కోసం ప్రభుత్వం కల్పించే అధికార బంగ్లా సదుపాయం తనకు అక్కరలేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్‌తో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సపోలియా మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సీఎం కేజ్రీవాల్‌కు ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తున్నట్లు కేజ్రీవాల్‌కు సపోలియా ప్రతిపాదించారు. అందుకు ప్రభుత్వ బంగ్లా వద్దని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి కోసం ప్రభుత్వం కల్పించే భద్రత కూడా తనకు అవసరం లేదని, దేవుడే తన భద్రతను పర్యవేక్షిస్తాడని సోమవారం కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో విఐపి సంస్కృతిని కట్టడి చేయడమే తన ప్రధాన లక్ష్యం అంటూ కేజ్రీవాల్ గతంలో చెప్పిన మాట్లాలను అనుసరిస్తున్నారు.