ఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్ తగిలింది. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను తక్షణమే ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీకాగా.. సంబంధిత అధికారులు నేడో, రేపో రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.
లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ నేత మహువా మొయిత్రా పై డిసెంబర్ 8వ తేదీన బహిష్కరణ వేటు పడింది. ఆ వెంటనే ఆమె అధికారిక బంగ్లా కేటాయింపు సైతం రద్దైంది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ మహువాకు కిందటి నెలలోనే నోటీసు వెళ్లింది. జనవరి 7వ తేదీ లోపు బంగ్లా ఖాళీ చేయాలన్నది ఆ నోటీసుల సారాంశం.
ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(DOE)కు విజ్ఞప్తి చేయాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈలోపు గడువు ముగియడంతో డీవోఈ జనవరి 8వ తేదీన.. బంగ్లాలో ఎందుకు కొనసాగనివ్వాలో చెప్పాలంటూ ఆమెకు నోటీసులు పంపింది. మూడు రోజులు గడిచినా ఆమె నుంచి సమాధానం లేకపోవడంతో.. 12వ తేదీన మరోసారి నోటీసులు పంపింది. దీంతో ఆమె డీవోఈ ముందు హాజరై వివరణ ఇచ్చారు.
అయితే ఆమె వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో.. మంగళవారం నాడు తక్షణమే బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు పంపింది డీవోఈ. అంతేకాదు.. ఆలస్యం చేయకుండా ఆమెతో బంగ్లా ఖాళీ చేయించేందుకు అధికారుల బృందాన్ని రంగంలోకి దింపనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment