ఢిల్లీ: జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే తీర్పుతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యింది. ఇవాళ(సోమవారం) సభకు లోక్‌సభకు హాజరైన ఆయన హుషారుగా కనిపించారు కూడా. రేపు పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ ఉండనుంది. మణిపూర్ అంశం కావడం.. పైగా అక్కడ ఆయన పర్యటించి ఉండడంతో.. వాస్తవాల ఆధారంగా కేంద్రాన్ని ఆయన నిలదీస్తారంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది.
అనర్హత వేటు తర్వాత తుగ్లక్ లేన్‌లోని తన అధికారిక బంగ్లాను ఆయన ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు ఆయనకు అండగా నిలిచి.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. అయితే రాహుల్ మాత్రం నిబంధనలకు అనుగుణంగా బంగ్లా ఖాళీ చేసి అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత 10 జన్‌పథ్ రోడ్‌లోని తల్లి సోనియా గాంధీ నివాసానికి మారిపోయారాయన. అయితే దానిని మరొకరికి ఇంకా కేటాయించలేదు. దీంతో ఇప్పుడు తన బంగ్లాను తానే చేజిక్కుంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారాయన.
ఈ క్రమంలో.. ఇవాళ ఉదయం లోక్ సభ హౌసింగ్ కమిటీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి. రాహుల్ తరపున తాను దరఖాస్తు చేస్తానని చెప్పారు. అయితే నిబంధనల ప్రకారం అలా కుదరదని హౌజింగ్‌కమిటీ తేల్చి చెప్పింది. రాహుల్ గాంధీ స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో రేపు రాహుల్ గాంధీ తన బంగ్లాను తనకు కేటాయించాలని కోరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment