1996-97 10th Class Batch Students Meet After 26 Years in Pedtapelli District - Sakshi
Sakshi News home page

రెండున్నర దశాబ్దాల తరువాత.. మళ్లీ ఒకే గూటికి..

Published Mon, Jul 31 2023 2:30 PM | Last Updated on Tue, Aug 1 2023 1:17 PM

Even After Two And A Half Decades.. SSC Batch  - Sakshi

కరీంనగర్‌: ప్రతీ ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు… చేసే అల్లరి… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్లు… అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 26  సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ ప్రగతి  ఉన్నత పాఠశాల పదవ తరగతి 1996-97 పూర్వ విద్యార్థులు.

తిరిగి ఒకే గూటికి చేరిన జ్ఞాపకాలు.. 

ప్రగతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 26 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో.. అదే తరగతి గదిలో.. అదే బెంచ్ పై కూర్చుని, వారు ఒకరినొకరు పలకరించుకుంటూ.. కలుసుకోవడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను  నెమరు వేసుకున్నారు.

ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి అధ్యక్షతన జ్యోతి ప్రజల్వను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారి జీవితంలో సాధించిన విజయాలు, కష్టాల గురించి చర్చించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ మాట్లాడుతూ.. వారు చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకొని మరపురాని మధురమైన సంఘటనలను, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకున్నారు.

గుర్తుకొస్తున్నాయి..

ఉన్నది కొద్ది గంటలైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ.. ఆనందభాష్పాలతో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నాడు పాఠశాలలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా గుర్తుకు తెచ్చుకొని సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన గురువులకు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో ప్రధానం చేశారు.

పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కరీంనగర్‌లో స్థిరపడిన అబు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. 26 సంవత్సరాల తర్వాత మనమందరం ఈ విధంగా మనం చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. గడిచిపోయిన కాలాన్ని ఎలాగూ మనం తెచ్చుకోలేమని ఇప్పటినుండి అయినా ఒకరినొకరు మొబైల్ ద్వారా మాట్లాడుకుంటూ.. వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ.. తమ తమ బాగోగుల గురించి మాట్లాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు.

పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చిన ప్రతీ  ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. మనకు చదువు చెప్పిన  గురువులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశానికి మనమందరం ఈ విధంగా కలుసుకోవడం మనకు చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల  ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి, విద్యార్థులు అబు సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు రెడ్డి, శ్రీనివాస్, అంజనీ ప్రసాద్, కుమార్, సురేష్, వనజ, కళాజ్యోతి, శ్రావణి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement