SSC batch of students
-
'అర్ధ శతాబ్దం' తరువాత.. మళ్లీ కలుసుకున్న మా జ్ఞాపకాలు !
ఖమ్మం: చిన్నతనంలో కలిసి చదువుకున్నారు... ఆతర్వాత ఉన్నత చదువులు, ఆపై ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారందరూ మళ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకుని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సమ్మేళనంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి సైతం పాల్గొని మాట్లాడారు. తల్లాడలోని జెడ్పీహెచ్ఎస్లో 1973–74 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు యాభై ఏళ్ల తర్వాత ఖమ్మంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ బ్యాచ్‌కు పాఠాలు బోధించిన సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకుని ఇక్కడే గురువుగా పాఠాలు బోధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇన్నాళ్లకు కలుసుకున్న పూర్వ విద్యార్థులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని.. చదువుకున్న పాఠశాల అభ్యున్నతికి తోడ్పాటునందించాలని సూచించారు. పూర్వ సమాజం పూనుకుంటేనే విద్యారంగం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అనంతరం గురువులు రామచంద్రమూర్తితో పాటు చిమ్మపూడి శ్రీరామమూర్తి, కె.శ్రీనివాసరావు, జె.సత్యనారాయణ, నారాయణరెడ్డి తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దామోదర్ ప్రసాద్, పూర్వ విద్యార్థులు అనుమోలు బుద్దిసాగర్, బేబి శంకర్, ఎన్.సత్యనారాయణ, మంగపతిరావు, జి.సునంద, పూనాటి పిచ్చయ్య, భాస్కర్‌రావు, శంకర్రావు, నంబూరు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
రెండున్నర దశాబ్దాలైనా.. వీడని ఎస్ఎస్సి బంధం
కరీంనగర్: ప్రతీ ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు… చేసే అల్లరి… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్‌లు… అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 26 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ ప్రగతి ఉన్నత పాఠశాల పదవ తరగతి 1996-97 పూర్వ విద్యార్థులు. తిరిగి ఒకే గూటికి చేరిన జ్ఞాపకాలు.. ప్రగతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 26 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో.. అదే తరగతి గదిలో.. అదే బెంచ్ పై కూర్చుని, వారు ఒకరినొకరు పలకరించుకుంటూ.. కలుసుకోవడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి అధ్యక్షతన జ్యోతి ప్రజల్వను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారి జీవితంలో సాధించిన విజయాలు, కష్టాల గురించి చర్చించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ మాట్లాడుతూ.. వారు చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకొని మరపురాని మధురమైన సంఘటనలను, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకున్నారు. గుర్తుకొస్తున్నాయి.. ఉన్నది కొద్ది గంటలైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ.. ఆనందభాష్పాలతో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నాడు పాఠశాలలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా గుర్తుకు తెచ్చుకొని సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన గురువులకు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో ప్రధానం చేశారు. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కరీంనగర్లో స్థిరపడిన అబు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. 26 సంవత్సరాల తర్వాత మనమందరం ఈ విధంగా మనం చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. గడిచిపోయిన కాలాన్ని ఎలాగూ మనం తెచ్చుకోలేమని ఇప్పటినుండి అయినా ఒకరినొకరు మొబైల్ ద్వారా మాట్లాడుకుంటూ.. వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ.. తమ తమ బాగోగుల గురించి మాట్లాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. మనకు చదువు చెప్పిన గురువులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశానికి మనమందరం ఈ విధంగా కలుసుకోవడం మనకు చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి, విద్యార్థులు అబు సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు రెడ్డి, శ్రీనివాస్, అంజనీ ప్రసాద్, కుమార్, సురేష్, వనజ, కళాజ్యోతి, శ్రావణి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
- ఏఈఎస్ 1991 బ్యాచ్ - విద్యార్థుల కలయిక - 25 మంది టీచర్లకు సన్మానం - ఆ‘పాత’ మధురాలను - నెమరేసుకున్న నిర్వాహకులు సాక్షి, ముంబై: ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఎస్) 1991 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం అద్వితీయంగా జరిగింది. పాఠశాల విద్య పూర్తయ్యి 25 ఏళ్లు గడిచిన సందర్భంగా వారు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని దాదర్‌లోని కోహినూర్ హాల్లో నిర్వహించారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన 25 మంది గురువులను సుమారు 150 మంది ఏఈఎస్ పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పూర్వ ఉపాధ్యాయులు దశరథ్ సుబ్బలక్ష్మి, శాలినీలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ‘జయతు దేవి జన్మభూమి’ అనే దేశభక్తి గీతాలాపన చేశారు. పూర్వ విద్యార్థి డాక్టర్ అనిత ప్రసంగిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తాము ఈ స్థితికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు నింపిన స్ఫూర్తి, నేర్పిన విద్య కారణమని పేర్కొన్నారు. తర్వాత పూర్వ విద్యార్థులంతా ప్రస్తుతం ఏయే రంగాల్లో పనిచేస్తున్నారో వివరిస్తూ ఒక స్లయిడ్ షో నిర్వహించారు. పూర్వ ఉపాధ్యాయులు దశరథ్, సుబ్బలక్ష్మి, శాలిని, మచ్చ ప్రభాకర్, కే.సుజాత, సోమల్ జ్యోతి, జయంతి తదితరులను విద్యార్థులు సన్మానించారు. విద్యార్థులు ఇలాంటి మంచి స్థితికి ఎదిగాక కూడా తమను గుర్తుంచుకుని సన్మానించడం చాలా ఆనందంగా ఉందని సన్మానం అనంతరం ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. విద్యార్థులందరూ వివిధ రంగాల్లో స్థిరపడి సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా పని చేస్తుండడం తమకు అసలైన గురుదక్షిణ అని వారన్నారు. వీరంతా భవిష్యత్తులో మరింత వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో డీజే డ్యాన్స్, ఫ్యాషన్ షో, ఆటపాటలతో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు సరదాగా గడిపారు. ఈ సమ్మేళనాన్ని చింతకింది శ్రీనివాస్ పర్యవేక్షించారు. వ్యాఖ్యాతగా కాచర్ల మోహన్, వందన సమర్పణ బాలె శివ, బోగ అరుణ్ చేశారు. ఏఈఎస్ మేనేజ్మెంట్కు సన్మానం.. 1991 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లి మేనేజ్మెంట్ను కూడా సన్మానించారు. తాము ఒకప్పుడు కూర్చొని చదువుకున్న తరగతి గదులను సందర్శించి మరోసారి పాత విద్యార్థులుగా మారిపోయారు. చిన్నతనంలో తినుబండారాలు ఆరగించిన క్యాంటీన్‌కు వెళ్లి మరోసారి అక్కడి స్నాక్స్ తిని సరదాగా గడిపారు. సాయంత్రం వరకు తమ చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.