
మరో గూండా కథ
జీవన కాలమ్
ఈ దేశానికి హఫీద్ సయీద్, మసూద్ అజర్‌ల కంటే ఇలాంటి గూండాల వల్ల జరిగే హాని భయంకరమైనది. దౌర్జన్యకారుల శత్రుత్వం–మన చొక్కాకు పట్టే చెదలాంటిది. ఇలాంటి నాయకమ్మన్యులు–శరీరంలో క్యాన్సర్ లాంటివారు.
ఒక సంఘటన. 1990లో జరిగింది. ఒక మహిళ మాటల్లో చెప్తాను: రైల్వే సర్వీసు ప్రొబేషనర్స్‌గా లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో నేనూ, నా మిత్రురాలూ ఎక్కాం. ఇద్దరు పార్లమెంట్ సభ్యులూ, మరో 12 మంది వారి సహ చరులూ ఎక్కారు. వాళ్లకి రిజ ర్వేషన్లు లేవు. మా బెర్తులు ఖాళీ చేయించి, మా సామాన్ల మీద కూర్చుని, అసభ్యంగా మాటలూ, అల్లరీ ప్రారం భించారు. కోపం వచ్చినా భరిస్తూ నిస్సహాయంగా రాత్రంతా గడిపాం. మర్నాటి ఉదయం ఢిల్లీ చేరాం, బతుకు జీవుడా అనుకుంటూ. మా స్నేహితురాలు ఎంత భయపడిపోయిందంటే–తర్వాత మేం ట్రైనింగ్‌కి వెళ్లా ల్సిన అహమ్మదాబాద్ ప్రయాణం మానుకుని ఢిల్లీలో ఆగిపోయింది. నేను మాత్రం రైల్వే సర్వీసులో ఉన్న మరో సహచరురాలితో రైలెక్కాను. ఢిల్లీ నుంచి అహమ్మ దాబాద్‌కి ఒక రాత్రి ప్రయాణం. మా రిజర్వేషన్లు వెయి ట్‌లిస్ట్‌లో ఉన్నాయి.
టికెట్ కలెక్టరు మమ్మల్ని మొదటి తరగతి కూపేలో కూర్చోపెట్టాడు–రైలంతా రద్దీగా ఉందంటూ. అక్కడ మళ్లీ ఇద్దరు రాజకీయ నాయకులున్నారు. ఒకాయన ఎంపీ. మరొకాయన కేవలం సహచరుడు. మళ్లీ మేం బెదిరిపోయాం. మరేం ఫరవాలేదని టీటీయీ ధైర్యం చెప్పారు. వాళ్లు మాకు చోటిచ్చి ఒక మూలకి ఒదిగి కూర్చున్నారు.
భోజనం వచ్చింది. నలుగురికీ శాకాహార భోజనమే ఆర్డరిచ్చి– వారిలో చిన్నాయన డబ్బు చెల్లించాడు అంద రికీ. ఈలోగా టీటీయీ వచ్చి ట్రైన్‌లో బొత్తిగా ఖాళీలేద న్నాడు. ఇద్దరు లేచి నిలబడ్డారు, ‘మరేం ఫర్వాలే ద’ంటూ. రెండు బెర్తులకీ మధ్యన ఒక గుడ్డ పరుచుకుని నిద్రపోయారు. మర్నాటి ఉదయం అహమ్మదాబాద్ దగ్గరికి వస్తుండగా ‘పట్నంలో ఏమైనా సమస్య ఉంటే మా ఇంటికి నిస్సందేహంగా రావచ్చు’నని పెద్దాయన ఆహ్వానించారు. చిన్నతను సిగ్గుపడుతూ ‘నేనొక ద్రిమ్మ రిని. ఇబ్బంది ఉంటే వీరి ఆతిథ్యం పుచ్చుకోండి’ అన్నారు. అవసరం లేదంటూ థాంక్స్ చెప్పాం.
రాజకీయ నాయకుల మీద నా దురభిప్రాయాన్ని పోగొట్టిన వీరి పేర్లు మరచిపోకూడదనుకున్నాను. అహమ్మదాబాద్ రాగానే ఇద్దరి పేర్లూ హడావుడిగా రాసుకున్నాను– శంకర్‌సింగ్ వాఘేలా, నరేంద్ర మోదీ.
ఈ సంఘటనని వ్రాసిన వ్యక్తి–లీనా శర్మ. భార తీయ రైల్వే సమాచార సంస్థ జనరల్ మేనేజర్ అయ్యారు. ఆనాటి ఆమె సహచరురాలు–ఉత్పలపర్ణ హజారికా. రైల్వే బోర్డ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు.
ఇక ఇప్పటి కథ. రవీంద్ర గైక్వాడ్ మహారాష్ట్ర శివసేన పార్లమెంట్ సభ్యులు. మామూలు టీచరు. ఢిల్లీ వెళ్లడానికి బిజినెస్ క్లాసు టిక్కెట్ ఉంది. మరచిపోవద్దు –అది ప్రజల సొమ్ముతో కొన్నదే. కానీ ఆనాటి విమానం బిజినెస్ క్లాసు లేని చిన్న విమానం. ఆయన ఎక్కారు–ఆ విమానంలో బిజినెస్ క్లాసు ఏర్పాటు లేదని తెలిసీ. విమానం ఆగాక గొళ్లెం పెట్టుకున్నాడు. ఎయిర్‌లైన్స్ ఆఫీసర్, 60 ఏళ్ల సుకుమార్ వచ్చి ఆయన్ని విమానం దిగమని కోరారు. ఆయన ఫలానా గైక్వాడ్‌ని తిట్టాడట. దురుసుగా ప్రవర్తించాడట. కోపంతో గైక్వాడ్ అనే ఎంపీ తన కాలి శాండల్ తీసి సుకుమార్‌ని 25సార్లు కొట్టాడు.
కెమెరా ముందు గర్వంగా తను కొట్టిన విషయాన్ని వివరిస్తూ–‘‘నేను కొట్టింది చెప్పుతో కాదు, శాండల్‌తో’’ అంటూ పత్రికా విలేకరుల కథనాన్ని సవరించారు ఈ నాయకులు. మళ్లీ లెక్క తప్పుతుందేమోనని ‘25సార్లు కొట్టాను’ అని చెప్పారు.
ప్రజలకు సేవ చేస్తానని వేదికలెక్కి హామీలిచ్చి ఎన్నికైన ఇలాంటి ‘గూండాలు’ విచక్షణా రహితంగా ఒక ప్రభుత్వోద్యోగిని బహిరంగంగా కొట్టి, గర్వపడడం– ఈ జాతికి పట్టిన చీడ. నిజంగా సుకుమార్ అనే ఆఫీసరు ఒక ఎంపీతో దురుసుగా మాట్లాడి, తిట్టి ఉంటే ఈయన ఫిర్యాదు చాలు అతన్ని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయ డానికి. ఇద్దరు మహిళలను–23 సంవత్సరాల కిందట గౌరవించిన ఆనాటి అనామకులైన నాయకులు– ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. ఒకాయన ప్రధాని అయ్యారు. ఈ కుసంస్కారిని నెత్తిన పెట్టుకున్నది–గూండా సంస్కృ తికి ఆలవాలమైన పార్టీ.
ఈ దేశానికి హఫీద్ సయీద్, మసూద్ అజర్‌ల కంటే ఇలాంటి గూండాల వల్ల జరిగే హాని భయంకర మైనది. దౌర్జన్యకారుల శత్రుత్వం–మనం తొడుక్కున్న చొక్కాకు పట్టే చెదలాంటిది. కానీ మన వ్యవస్థలో మనల్ని నాశనం చేసే ఇలాంటి నాయకమ్మన్యులు– శరీ రంలో క్యాన్సర్ లాంటివారు.
ఇలాంటి గూండాలని జైలుకి పంపించడానికి, కోర్టులో బోను ఎక్కించడానికి ఈ దేశంలో ఉద్యమాలు జరగాలి. ‘నిర్భయ’ విషయంలో జరిగినంత ఉధృతంగా ప్రదర్శనలు జరగాలి. వ్యవస్థలో సంస్కార పతనం, సంక్షేమ పతనం కంటే అనర్థదాయకం. హానికరం. అరిష్టం.
- గొల్లపూడి మారుతీరావు