కిచిడీని అందలం ఎక్కిస్తే నా డిమాండ్ ఒకటుంది– తెలుగువాడిగా గురజాడ కాలం నుంచీ అనాదిగా వస్తున్న నికార్సయిన తెలుగు వంటకం– నాకు అత్యంత ప్రియమైనది– దిబ్బరొట్టె.
నాకు రాజకీయాలలో అపా రమైన అనుభవం ఉంది. 2019 ఎన్నికలకు ముందు గానే బీజేపీ, కాంగ్రెస్, హిందూ, ముస్లిం, సిక్కులు, కశ్మీర్–భారతదేశం– ఇలా రకరకాల వర్గాల మధ్య భయంకరమైన రాజకీయ సంక్షోభం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయని బల్లగుద్ది చెప్పగలను. దీనికి ఒకే ఒక కారణం– కిచిడీ. అదిగో, తమరి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. కానీ ఇది నవ్వి మరిచిపోయే విషయం కాదనీ, ముందు ముందు ముదిరి కొంపలు ముంచ గలదని నిరూపించడానికే ఈ కాలమ్.
ముందుగా కిచిడీ తయారీకి మా వంటావిడ చెప్పిన విధి విధానమిది:
మొదట– బంగాళాదుంప, క్యారెట్, ఆకుపచ్చ బఠాణీలు, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి, వేరే చిప్పలో ఉల్లిపాయ, పచ్చిమిరప కాయ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తరిగి పెట్టుకోండి. ఈ ముక్కల్ని జీలకర్ర, జీడిపప్పు, వేరుశనగ పప్పుతో కలిపి– నూనె, నెయ్యి – ఇదీ రహస్యం – రెండింటితో కలిపి వేయించాలి. ఇప్పుడు కుక్కర్‌లో బియ్యం, పెసరపప్పు, ఈ వేగిన ముక్కల్ని వేయాలి. ఒకటికి రెండు న్నర గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు, చిటికెడు పసుపు వేసి– స్టౌ వెలి గించాలి. రెండు విజిల్స్ వచ్చాక ఆపి, తయారైన పదార్థం మీద అరచెంచా నెయ్యి చిలకరించి– ప్లేట్‌లో ఉంచుకుని తినాలి. ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో చలామణికి వచ్చిన ‘జాతీయ కిచిడీ’ జన్మ రహస్యం. ఒక్క విషయం మరిచిపోకూడదు. ఇది భారతదేశపు ‘జాతీయ కిచిడీ’ కాదు. ప్రపంచ ఆహార జాబితాలో భారతదేశానికి ప్రాధాన్యం వహించే వంటకంగా దీనిని ఎంపిక చేశారు.
నవంబర్ 4న ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆహార దినోత్సవంలో దేశ ప్రఖ్యాత వంటగాడు సంజీవ్ కపూర్ కిచిడీని తయారు చేశారు. 7 అడుగుల విస్తీర్ణం గల వెయ్యి లీటర్ల నీరు పట్టే గుండిగలో 918 కేజీల కిచిడీని తయారుచేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. దీనిని 60 వేలమంది అనాధ పిల్లలకు పెట్టారు. వీరు కాక ఈ ఉత్సవాలకు వచ్చిన అతిథులకి, మన దేశంలో ఉన్న వివిధ విదేశీ కార్యాలయాలకు పంపారు. అయితే ఇది జాతీయ వంటకం కాదు. ఆహార ప్రొసెసింగ్ శాఖ మంత్రి హర్‌శిమ్రాట్ కౌర్ బాదల్ మాటల్లో ‘‘ఈ కిచిడీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వా’’నికి ప్రతీకగా నిలుస్తుందని ఈ వంటకాన్ని ఈ ఉత్సవంలో చేర్చామని పేర్కొన్నారు.
వెంటనే జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒంటికాలుమీద లేచారు.
‘‘ఈ కిచిడీ తినడం చూసినప్పుడల్లా మనం లేచి నిలబడాలా? ప్రతీ సినీమా చూడటానికి ముందు కిచిడీ తినడం విధాయకమా? దీనిని నచ్చకపోవడం జాతీయ వ్యతిరేక చర్య అవుతుందా?’’ ఇవీ వారి మాటలు. వారి మనసులో ఇంకా జాతీయ గీతం ప్రతిధ్వనిస్తోంది. వందేమాతరానికీ, కిచిడీకీ తేడా వారి మనస్సుదాకా రాలేదు. వారి చెవుల్లో ‘కిచిడీ’ అంటే ‘వందే...’ అని ప్రతిధ్వనిస్తోంది. వారు అర్జంటుగా చెవి, ముక్కు, నాలుక నిపుణుడిని సంప్రదించాలి.
ఇక కిరణ్ మన్రాల్ అనే రచయిత ‘‘నేను తీవ్రంగా దీనిని ప్రతిఘటిస్తున్నాను. బొత్తిగా జబ్బు చేశాక పత్యం పెట్టే వంటకాన్ని జాతీయ వంటకం అంటారేమిటి?’’ అని కోపం తెచ్చుకున్నారు. ఆ వరు సలోనే వారు ‘పులావ్’ని గుర్తు చేశారు. మరొకరు ఒక పాయింట్ లేవదీశారు: ‘‘అసలు యునెస్కో దీనిని జాతీయ వంటకంగా అనుమతించిందా?’’ అన్నారు.
రన్వీర్ బ్రార్ అనే దేశ ప్రఖ్యాత వంటగాడు: ‘‘కిచిడీ అంటే నాకు ఇష్టమే. కానీ జాతీయ వంటకంగా ఆ ఒక్క వంట కాన్నే ఎంపిక చేయడం అన్యాయం. మన దేçశంలో ఎన్నో ప్రాంతాలున్నాయి. ఎన్నో రుచులున్నాయి. ఎన్నో వంటకా లున్నాయి. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందుకి ఒక్క కిచిడీతో చావ మంటే ఎలాగ?’’ అని వాపోయాడు.
తమరు ఈ స్పందనలో రాజ కీయ దుమారాన్ని గుర్తుపట్టాలి. ఇందులో సిక్కులు, ముస్లింలు, కశ్మీరీలు, పులావ్‌లూ, యునెస్కోలూ– ఇన్ని చోటు చేసుకున్నాయని గ్రహించాలి.
ముందు ముందు తమిళనాడు ఎడపాడి పళని స్వామి ‘కారపు పొంగల్’ని ప్రతిపాదిస్తారు. కర్ణాటక సిద్దరామయ్య– కాంగ్రెస్ కనుక – తప్పనిసరిగా ‘బిసి బెళ బాత్’ని ప్రతిపాదిస్తారు. మహారాష్ట్ర నుంచి రాజ్‌థాకరేగారు ‘పాఠోళీ’ అంటారు. పంజాబీ మిత్రులు– ‘సార్సోంకా సాగ్’ అనవచ్చు. బెంగాలీ సోదరులు ‘చిత్తర్ మశ్చేర్ ముయితా’ అనవచ్చు. గుజరాతీ సోదరులు డొక్లా అని కానీ తెప్లా అని కానీ అనవచ్చు.
ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, డోక్లాం తలనొప్పు లతోపాటు ‘కిచిడీ’ సమస్య పెంచుకోవడం– రాజకీయ మేధావుల లక్షణం కాదు. ఏతావాతా– కిచిడీని అందలం ఎక్కిస్తే నా డిమాండ్ ఒకటుంది– తెలుగు వాడిగా అలనాడు – అంటే 129 సంవత్సరాల కిందటి నుంచీ – అంటే గురజాడ కాలం నుంచీ అనాదిగా వస్తున్న నికార్సయిన తెలుగు వంటకం– నాకు అత్యంత ప్రియమైనది– దిబ్బరొట్టె.
- గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment