
తులసి మొక్కలు
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గొప్ప విషయమే. నిజమే... 70 ఏళ్ల అవినీతిని పెళ్లగించడానికి భయంకరమైన ఆయుధాలు కావాలి.
జీవన కాలమ్
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గొప్ప విషయమే. నిజమే... 70 ఏళ్ల అవినీతిని పెళ్లగించడానికి భయంకరమైన ఆయుధాలు కావాలి. కానీ కలుపుమొక్కలతో పాటు తులసి మొక్కల పునాదులు కదిలిపోకుండా కాపాడాలి.
భారతదేశంలో నోట్ల రద్దు చాలా విధాలుగా చరిత్ర. ఆర్థిక వ్యవస్థ దుస్థితిలో ఉన్నప్పుడు ఆయా సంస్కరణలు రష్యా, జర్మనీ, నైజీరియా, ఘనా, పాకిస్తాన్ వంటి దేశాలలో జరిగాయి. ప్రపంచంలోకెల్లా విస్తృతమైన దేశంలో - ఇంకా రోజుకి రెండుపూటలా అన్నం కరువైన ప్రజలున్న దేశంలో-బ్యాంకు, కరెన్సీ అంటే ఏమిటో, అదెక్కడుంటుందో తెలియనివారున్న దేశంలో -70 సంవత్సరాలు పేదవాడి నోటి కూడు దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో-గుండె ధైర్యం ఉన్న ఒక వ్యవ స్థను మేలుకొలపడానికి-అనూహ్యమైన పని చేశాడు. అసలు దీని పరమార్థం ఏమిటో కూడా తలకెక్కని- రోజువారీ జీవితాన్ని గడిపే కోట్లాదిమంది జీవితాలు అతలాకుత లమయ్యాయి. ఒక పక్క డబ్బున్న జాగిలాలు వినా యకుడి బొడ్డులో వేలుకి తేలుకుట్టినట్టు వేళ్లను కొరు క్కుంటున్నారు. లక్షల కోట్లు గంటల్లో బ్యాంకుల్లో జమ అయ్యాయి. అవుతున్నాయి.
విశాఖపట్నంలో ఓ చిన్న తరహా హోటళ్లను నడిపే ఒకాయన నవంబర్ 9 ఉదయం-తన హోటళ్ల ముందు బోర్డులు పెట్టాడు. ‘పాత నోట్లు పట్టుకుని రండి. సుష్టుగా భోజనం పెట్టి చిల్లర ఇస్తాను’ అంటూ నరేంద్రమోదీ బొమ్మవేసి ‘మగాడురా బుజ్జీ!’ అని రాశాడు. చాపకింద జారుడికి అలవాటుపడ్డ ‘గుళ్లను మింగేవాళ్లు’ పంజా విప్పారు. నవంబర్ 8న ప్రధాని ప్రకటన. 9 బ్యాంకు లకు సెలవు. 10 ఉదయం ఒకాయన దగ్గర 40 లక్షల పాతనోట్లను తరలించి కొత్త నోట్లను నొక్కేశాడు. మోదీ యుద్ధం ఈ మహానుభావులతో.
వచ్చిన చిక్కల్లా-70 సంవత్సరాలు ఈ దోపిడీని ఎరిగి, అందులో పాల్గొని-పూర్తిగా ఇల్లు చక్కపెట్టు కున్న రాజకీయ నాయకులు-ఈ పథకం వల్ల దేశానికి కలిగే లాభం కాక, ఇందువల్ల నేలబారు మనిషికి జరిగే ‘ఇబ్బంది’ని నెత్తికి ఎత్తుకుని ‘భారత్ బంద్’ వరకూ వెళ్లారు. అయితే ఆలోచన ఉన్న ప్రజలు ఇబ్బందుల్ని అంగీకరిస్తున్నారు. కొందరు నాయకులు హర్షిస్తున్నారు. కానీ ప్రతి పక్షాల పోరాటం పేద ప్రజల మీద అర్ధం తరంగా పుట్టు కొచ్చిన జాలితో కాదు. ఈ కారణంగా పెరిగిపోయే మోదీ పాపులారిటీ మీద.
ఈలోగా విశాఖపట్నంలో బోర్డుకట్టి, తొడ చరిచి, అన్నంపెట్టి పాత నోట్లను తీసుకుంటున్న చిన్నతరహా యజమాని నా దగ్గరికి వచ్చాడు. ‘అయ్యా, మోదీగారి యుద్ధం అపూర్వం. మాకిష్టమే. పాత సొమ్ము జమ చేయించి, దాచిన వారిని పట్టుకోవడం సబబే. కానీ కాల్‌మనీ, కాలా మనీ, లెక్కల్లోకి రాని లక్షలు బాకీలు పడ్డ వారి మాటేమిటి? అప్పులు తీర్చడానికి ఇక నల్ల ధనం లేదు. పాత నోట్లు ఇస్తే పుచ్చుకోరు. వారి గోడు ఏమిటి? నల్లధనం బట్టబయలుకి ‘రక్షణ’ ఇచ్చినట్టు- ఈ లావాదేవీలు చెల్లవని చెప్పమనండి. సుఖంగా నిద్రపోతాం. కాల్‌మనీ ‘నల్ల’ అప్పుల భూతం నుంచి కూడా ఆయన కాపాడాలి-అన్నారు.
ఒక సరసమైన వ్యక్తి-ప్రభుత్వానికి ఒక సూచన చేశాడు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి వచ్చినవారే మళ్లీ మళ్లీ రావడాన్ని అరికట్టడానికి ఎన్నికలలో లాగా వేలి మీద ఇంకు చుక్క పెడుతున్నారట. కానీ ఈయన సలహా... రెండోసారి వచ్చినవాడిని కూర్చోపెట్టి గుండు చేయించండి. గుండుతో నెలరోజులపాటు బ్యాంకులకి తిరిగి రాలేడు. మళ్లీ జుత్తు పెరిగేలోపున కొత్త నోట్లు వచ్చేస్తాయి. దొరికిపోతామని భయపడ్డవాళ్లు వెంటనే తిరుపతికి వెళ్తారు-గుండు చేయించుకోడానికి. ఎలాగూ - చెల్లని నోట్లు హుండీలలో వేస్తున్నారు. అలాగే పరువు దక్కించుకోడానికి స్వామివారికి తలనీలాలు సమర్పి స్తారు. ఆఖరున ముక్తాయింపు. పాతనోట్లు విరివిగా, క్షేమంగా చెల్లే చోటు మరొకటి ఉంది. వ్యభిచార గృహాలలో. ఇది విశ్వసనీయ పోలీసు వర్గాల వార్త. అయ్యా పాత నోటిచ్చి సుఖాన్ని ఖరీదు చేసుకునేపాటి వెసులుబాటు-ఆరోజు తిండికి, గుడ్డకి ఖర్చు పెట్టుకునే -నిజాయితీగా సంపాదించుకున్న బీదా బిక్కీ, కర్షక కార్మికులకు ఎందుకు ఇవ్వకూడదు?
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గొప్ప విషయమే. కానీ పాడేరులో, రంపచోడవరంలో, పూడిపల్లిలో, నందికమ్మ అడవుల్లో 2 రూపాయలిచ్చి నూనె కొనుక్కునే- నిరక్షర ఆటవికునికి-ఈ వ్యవస్థ అందని మాని పండు. 70 ఏళ్ల అవినీతిని పెళ్లగించడానికి భయంకరమైన ఆయుధాలు కావాలి. కానీ కలుపుమొక్కలతో పాటు తులసి మొక్కల పునాదులు కదిలిపోకుండా కాపాడాలి.
గొల్లపూడి మారుతీరావు