వెనకయ్య సంతతి
జీవన కాలమ్
మనది ముందుకు పోతున్న దేశం. కాని మన దేశంలో దాదాపు అన్ని కులాల వారూ, వర్గాలవారూ వెనుకపడాలని ఉబలాటపడతారు. ఎవరు ముందుగా వెనుకపడతారో వారికి తాయిలాలు లభిస్తాయి. కొత్తగా వెనుకపడినవారిని అప్పుడే వెనుకబడినవారు వెనుకపడనివ్వరు. వాళ్లు మాలాగా వెనుకపడితే- వారు వెనుకపడడంలో ముందుంటారని -లోగడ వెనుకబడినవారి వాదం. దేశం ముందుకుపోతోంది. కులాల వెనుకపడాలని తోసుకువస్తున్నారు.
హరియానాలో జాట్ సోదరులను నేను మనసారా అభినందిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడి, తాము వెనుకపడ్డామని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రభుత్వం వెనుకపడి- ఆ బాధలు పడలేక -ఎన్నోసార్లు తమ వెనుకబడినతనాన్ని రోడ్ల మీద నిరూపించారు. ప్రస్తుతం 34 వేల కోట్ల విధ్వంసం జరిగింది. 16 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఢిల్లీకి పాల సరఫరా నిలిచిపోయింది. నీటి సరఫరా దెబ్బతింది. ఆస్తులు తగలపడ్డాయి. అప్పుడుకాని ప్రభుత్వం కళ్లు తెరవలేదు. వెనుకబడినవారు ఇలా ముందుపడకపోతే తొక్క దళసరిగా ఉన్న పాలకవర్గం దిగిరాదని, వారిని దింపి నిరూపించిన ఘనత జాట్ సోదరులది.
మొన్న కాపు సోదరులూ తాము వెనుకబడి ఉన్నామని చెప్పి చెప్పి విసిగి- ఆఖరికి కొన్ని రైల్వే బోగీలు, కొన్ని కార్లు, పోలీస్‌స్టేషన్లు తగలబడితే తప్ప పాలకవర్గం కళ్లు తెరవదని గుర్తించి - ఎట్టకేలకు తాము వెనుకబడి ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగారు. అయితే ఇదివరకే వెనుకబడిన వారు కాపు వర్గాల వారు వెనుకబడ రాదని అంటున్నారు. వారు వెనుక బడితే - ఇప్పటికే వెనుకబడిన తమ రాయితీలలో కోతలు వస్తాయని వారి భావన. పాలక వర్గానికి సమస్య అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చేయాలో రెండు సందర్భాలు ప్రస్తుతం చూశాం. అడగనిదే అమ్మయినా పెట్టదని సామెత. ప్రభుత్వాన్ని అడిగే పద్ధతి ఏమిటో ఈ మధ్య కొత్తగా వెనుకబడినవారు నిరూపించారు.
ఈ దేశంలో ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. మన నాయకులూ, ఆయా వర్గాల వారూ ఆ నాయకుడికి నివాళులర్పిస్తారు. అంబేడ్కర్ వైతాళికుడు. visionary. ఈ దేశంలో తరతరాలుగా, శతాబ్దాలుగా అభివృద్ధి అవకాశాలు లేక కుంగిపోయిన వర్గాలకు మేలు జరగాలంటూనే ఆ నాయకుడు ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. వెనుకబడిన వారికి చేయూతనిస్తూనే ఒక విడత గడిచాక - సామర్థ్యంలో, ఉద్ధతిలో- అందరితోపాటు పోటీపడే అవకాశాన్ని కల్పించమన్నారు. నిస్సహాయత పరిస్థితులది. వ్యక్తులది కాదు. కులానిది కాదు. సామర్థ్యంలో ఎవరూ ఎవరికీ తీసిపోని విధంగా ఈ సమాజ పురోగతికి చెయ్యి కలపాలన్నదే ఆయన ఆశయం.
ఇంతకీ వీరంతా వెనుకబడడానికి అగ్రవర్గాలే కారణం. పేదరికంలో, బొత్తిగా అభివృద్ధికి అవకాశం లేదంటూ ఈ మధ్య ‘మేమూ వెనకబడ్డాం’ అని బ్రాహ్మణులు నోరిప్పారు! ప్రభుత్వం వారి సంక్షేమానికి ఐ.వై.ఆర్.కృష్ణారావుగారితో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.
ఎంత చెట్టుకి అంతగాలి. రకరకాల అవినీతుల్లో కూరుకుపోయిన ప్రభుత్వాలు కళ్లు తెరవాలంటే - కాళ్ల బేరానికి రావాలంటే - ఈ దేశంలో బోలెడన్ని రైల్వే బోగీలు, కార్లు, పోలీస్‌స్టేషన్లు, పాల సరఫరా కేంద్రాలు, జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, చచ్చిపోవడానికి మనుషులు - ఇన్ని ఉన్నాయని మరిచిపోకూడదు.
దేశం ముందుకుపోతోందని ఈ ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. కాని వెనుకపడాలనుకుంటున్న వారు - ‘మేము వెనుకపడ్డాం బాబోయ్!’ అని ఎంత వెనుకపడినా పట్టించుకోవడంలేదు. ఇంతకు ముందు వెనుకపడినవారు కాళ్లకు అడ్డం పడుతున్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ప్రజలకి, పేపర్లు చదివేవారికి - జరిగిన విధ్వంసమే కనిపిస్తుంది కాని, వీరు ఎంత నిస్సహాయంగా వెనుకపడ్డారో కనిపించదు. కనుక- తప్పనిసరిగా కనిపించేలాగ చెయ్యాల్సిన రోజులొచ్చాయి. ఒకరి బాధలు మరొకరికి తెలియవు. తెలిసినా అర్థం చేసుకోరు. అప్పుడే వెనుకబడినవారికి వీరు వెనుకబడడం నచ్చలేదా? పీత కష్టాలు పీతవి. నాయకులకు తరతరాలుగా నష్టాలలో, కష్టాలలో ఇరుక్కున్న వెనుకబడినవారి ఇక్కట్లు అర్థంకావు. ఇందుకు రెండు రాష్ట్రాల్లో మార్గాలు చూపారు. ముఖ్యంగా జాట్ సోదరులకు నా అభినందనలు.
ఇంతకీ విఘ్నేశ్వరుడికి ‘వెనకయ్య’ అనే పేరుంది. మనమంతా ఆయన సంతతి.
గొల్లపూడి మారుతీరావు