casts
-
‘అచ్చు’ వ్యాధి!
మెడిక్షనరీ చర్మంపై అరచేత్తో మెచ్చుకోలుగా చరిస్తే... ఐదు వేళ్లూ అచ్చులు తేలుతాయి. కొద్దిగా గీరినా చాలు... ఎర్రబారి వాతలు కనిపిస్తాయి. గోముగా అలా నిమిరినా చాలు... మేనుపై మార్కింగ్ వచ్చేస్తుంది. కొంతమందిలో కనిపించే ఈ చర్మ సమస్యను ‘డర్మటోగ్రాఫియా’ అనీ, డర్మటోగ్రాఫిజమ్ అని కూడా అంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారి చర్మంపై ఏదైనా రాస్తే... పచ్చబొట్టు తరహాలో అది చాలాసేపు ఉండిపోతుంది. కాకపోతే పచ్చబొట్టు కాస్త ఆకుపచ్చ రంగులో ఉంటే అది చర్మం ఎర్రబారినప్పుడు ఉండే రంగుకు మారుతుంది. ఈ సమస్య ఎందుకు వస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే మైక్రోఒవెన్ దగ్గర చాలా సేపు ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువని పరిశోధకులు తెలుసుకున్నారు. అయితే దీనివల్ల ప్రాణాపాయం ఉండదు. ఇదేమీ అంటువ్యాధి కాదు. యాంగ్జైటీ, తీవ్రమైన ఒత్తిడి, చర్మంపై బిగుతుగా దుస్తులు ధరించడం వంటివి దీన్ని మరింత పెంచుతాయని కూడా తేలింది. ఈ సమస్యకు యాంటీహిస్టమైన్స్తో చికిత్స చేస్తారు. -
వెనకయ్య సంతతి
జీవన కాలమ్ మనది ముందుకు పోతున్న దేశం. కాని మన దేశంలో దాదాపు అన్ని కులాల వారూ, వర్గాలవారూ వెనుకపడాలని ఉబలాటపడతారు. ఎవరు ముందుగా వెనుకపడతారో వారికి తాయిలాలు లభిస్తాయి. కొత్తగా వెనుకపడినవారిని అప్పుడే వెనుకబడినవారు వెనుకపడనివ్వరు. వాళ్లు మాలాగా వెనుకపడితే- వారు వెనుకపడడంలో ముందుంటారని -లోగడ వెనుకబడినవారి వాదం. దేశం ముందుకుపోతోంది. కులాల వెనుకపడాలని తోసుకువస్తున్నారు. హరియానాలో జాట్ సోదరులను నేను మనసారా అభినందిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడి, తాము వెనుకపడ్డామని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రభుత్వం వెనుకపడి- ఆ బాధలు పడలేక -ఎన్నోసార్లు తమ వెనుకబడినతనాన్ని రోడ్ల మీద నిరూపించారు. ప్రస్తుతం 34 వేల కోట్ల విధ్వంసం జరిగింది. 16 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఢిల్లీకి పాల సరఫరా నిలిచిపోయింది. నీటి సరఫరా దెబ్బతింది. ఆస్తులు తగలపడ్డాయి. అప్పుడుకాని ప్రభుత్వం కళ్లు తెరవలేదు. వెనుకబడినవారు ఇలా ముందుపడకపోతే తొక్క దళసరిగా ఉన్న పాలకవర్గం దిగిరాదని, వారిని దింపి నిరూపించిన ఘనత జాట్ సోదరులది. మొన్న కాపు సోదరులూ తాము వెనుకబడి ఉన్నామని చెప్పి చెప్పి విసిగి- ఆఖరికి కొన్ని రైల్వే బోగీలు, కొన్ని కార్లు, పోలీస్స్టేషన్లు తగలబడితే తప్ప పాలకవర్గం కళ్లు తెరవదని గుర్తించి - ఎట్టకేలకు తాము వెనుకబడి ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగారు. అయితే ఇదివరకే వెనుకబడిన వారు కాపు వర్గాల వారు వెనుకబడ రాదని అంటున్నారు. వారు వెనుక బడితే - ఇప్పటికే వెనుకబడిన తమ రాయితీలలో కోతలు వస్తాయని వారి భావన. పాలక వర్గానికి సమస్య అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చేయాలో రెండు సందర్భాలు ప్రస్తుతం చూశాం. అడగనిదే అమ్మయినా పెట్టదని సామెత. ప్రభుత్వాన్ని అడిగే పద్ధతి ఏమిటో ఈ మధ్య కొత్తగా వెనుకబడినవారు నిరూపించారు. ఈ దేశంలో ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. మన నాయకులూ, ఆయా వర్గాల వారూ ఆ నాయకుడికి నివాళులర్పిస్తారు. అంబేడ్కర్ వైతాళికుడు. visionary. ఈ దేశంలో తరతరాలుగా, శతాబ్దాలుగా అభివృద్ధి అవకాశాలు లేక కుంగిపోయిన వర్గాలకు మేలు జరగాలంటూనే ఆ నాయకుడు ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. వెనుకబడిన వారికి చేయూతనిస్తూనే ఒక విడత గడిచాక - సామర్థ్యంలో, ఉద్ధతిలో- అందరితోపాటు పోటీపడే అవకాశాన్ని కల్పించమన్నారు. నిస్సహాయత పరిస్థితులది. వ్యక్తులది కాదు. కులానిది కాదు. సామర్థ్యంలో ఎవరూ ఎవరికీ తీసిపోని విధంగా ఈ సమాజ పురోగతికి చెయ్యి కలపాలన్నదే ఆయన ఆశయం. ఇంతకీ వీరంతా వెనుకబడడానికి అగ్రవర్గాలే కారణం. పేదరికంలో, బొత్తిగా అభివృద్ధికి అవకాశం లేదంటూ ఈ మధ్య ‘మేమూ వెనకబడ్డాం’ అని బ్రాహ్మణులు నోరిప్పారు! ప్రభుత్వం వారి సంక్షేమానికి ఐ.వై.ఆర్.కృష్ణారావుగారితో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఎంత చెట్టుకి అంతగాలి. రకరకాల అవినీతుల్లో కూరుకుపోయిన ప్రభుత్వాలు కళ్లు తెరవాలంటే - కాళ్ల బేరానికి రావాలంటే - ఈ దేశంలో బోలెడన్ని రైల్వే బోగీలు, కార్లు, పోలీస్స్టేషన్లు, పాల సరఫరా కేంద్రాలు, జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, చచ్చిపోవడానికి మనుషులు - ఇన్ని ఉన్నాయని మరిచిపోకూడదు. దేశం ముందుకుపోతోందని ఈ ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. కాని వెనుకపడాలనుకుంటున్న వారు - ‘మేము వెనుకపడ్డాం బాబోయ్!’ అని ఎంత వెనుకపడినా పట్టించుకోవడంలేదు. ఇంతకు ముందు వెనుకపడినవారు కాళ్లకు అడ్డం పడుతున్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ప్రజలకి, పేపర్లు చదివేవారికి - జరిగిన విధ్వంసమే కనిపిస్తుంది కాని, వీరు ఎంత నిస్సహాయంగా వెనుకపడ్డారో కనిపించదు. కనుక- తప్పనిసరిగా కనిపించేలాగ చెయ్యాల్సిన రోజులొచ్చాయి. ఒకరి బాధలు మరొకరికి తెలియవు. తెలిసినా అర్థం చేసుకోరు. అప్పుడే వెనుకబడినవారికి వీరు వెనుకబడడం నచ్చలేదా? పీత కష్టాలు పీతవి. నాయకులకు తరతరాలుగా నష్టాలలో, కష్టాలలో ఇరుక్కున్న వెనుకబడినవారి ఇక్కట్లు అర్థంకావు. ఇందుకు రెండు రాష్ట్రాల్లో మార్గాలు చూపారు. ముఖ్యంగా జాట్ సోదరులకు నా అభినందనలు. ఇంతకీ విఘ్నేశ్వరుడికి ‘వెనకయ్య’ అనే పేరుంది. మనమంతా ఆయన సంతతి. గొల్లపూడి మారుతీరావు -
కోటా చిచ్చు
దాదాపు పదిరోజులుగా సాగుతున్న జాట్ కులస్తుల ఆందోళనలతో హరియాణా అట్టుడుకుతోంది. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా హింస చెలరేగి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు బుగ్గి అయ్యాయి. 16మంది మరణించాక...దాదాపు 20,000 కోట్ల రూపాయల ఆస్తులు బుగ్గిపాలయ్యాక వారి డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జాట్లను ఓబీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వడానికి కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించింది. హరియాణా అసెంబ్లీలో వచ్చే సమావేశాల్లోనే జాట్లను ఓబీసీల్లో చేర్చడానికి వీలుకల్పించే బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. హరియాణా పరిణామాలపై కేంద్రం ఎంతగా కలవరపడుతున్నదో ఈ నిర్ణయాలు చెబుతున్నాయి. అయితే జాట్ల ఆగ్రహం చల్లారలేదని సోమవారం కూడా కొనసాగిన ఘటనలు నిరూపిస్తున్నాయి. చాలాచోట్ల రైలు మార్గాలు, రహదార్ల దిగ్బంధం ఆగలేదు. దేశ రాజధాని నగరానికి హరియాణానుంచి రావలసిన మంచినీటి సరఫరా సైతం నిలిచిపోగా సైన్యం జోక్యంతో దాన్ని పునరుద్ధరించవలసి వచ్చింది. పెట్టుబడులకు అనువైన, ఆదర్శవంతమైన రాష్ట్రంగా చెప్పుకునే హరియాణా ఇప్పుడు అరాచకానికి మారుపేరైంది. పంజాబ్‌నుంచి 1966లో విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక హరియాణాలో జాట్ కులస్తులదే ప్రాబల్యం. ఇంతవరకూ రాష్ట్రాన్నేలిన ముఖ్యమంత్రులు పదిమందిలో ఏడుగురు ఆ కులానికి చెందినవారే. అసెంబ్లీలోని 90 స్థానాల్లో మూడోవంతు వారివే. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాక ఖట్టర్ కులానికి చెందిన మనోహర్‌లాల్ ఖట్టర్ సీఎం అయ్యారు. జాట్ కాకుండా వేరే కులానికి చెందిన వ్యక్తి సీఎం కావడం చాన్నాళ్ల తర్వాత ఇదే మొదటిసారి. దానికితోడు కేబినెట్లోని 8మంది మంత్రుల్లో ఇద్దరు మాత్రమే జాట్ కులస్తులు. గ్రామసీమల్లో ప్రాబల్యం ఉన్న కులస్తులుగా జాట్లు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారన్నది నిజం. 1991లో గుర్నాంసింగ్ కమిషన్ మరో ఏడు కులాలతోపాటు జాట్లను కూడా బీసీల్లో చేర్చవచ్చునని సిఫార్సు చేసినప్పటినుంచి ఆ కులంలో కోటా ఆందోళన రాజుకుంది. అప్పట్లో భజన్‌లాల్ సర్కారు జాట్లను బీసీలుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీచేయడం, ఆ తర్వాత ఉపసంహరించుకోవడం వారిలోని ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత రెండు కమిషన్లు వచ్చాయి. 2011లో ఏర్పాటైన కేసీ గుప్తా కమిషన్ జాట్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏడాది తర్వాత సిఫార్సుచేసింది. దానికి అనుగుణంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పటి భూపేందర్‌సింగ్ హూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడటానికి ఒక్క రోజు ముందు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కేంద్ర జాబితాలో జాట్లను చేరుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. హరియాణాతోపాటు రాజస్థాన్, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉన్న జాట్ కులస్తుల ఓట్లు రాబట్టడమే యూపీఏ సర్కారు లక్ష్యం. 1931నాటి జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకున్న ఈ నిర్ణయంలోని ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు నిరుడు ప్రశ్నించింది. యూపీఏ సర్కారు నిర్ణయాన్ని కొట్టేసింది. రిజర్వేషన్లకు వాస్తవంగా అర్హత ఉన్నవారెవరో తేల్చే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుండాలని... ఆ అధ్యయనాంశాల ఆధారంగా నిర్ణయం ఉండాలి తప్ప, రాజకీయ ప్రయోజనాల దృష్టితో ఆలోచించి ఎవరికి పడితే వారికి కోటా వర్తింపజేయడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. హరియాణా విషయానికొస్తే రాష్ట్రంలోని 80 కులాల్లో ఇప్పటికే 63 కులాలు వివిధ కేటగిరీల కింద రిజర్వేషన్లు పొందుతున్నాయి. పాతికేళ్ల క్రితంనాటి పరిస్థితిని గుర్తుకు తెచ్చుకుని ఇప్పటితో పోల్చుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతిభకు చేటు కలిగిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆనాడు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అప్పుడు ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించిన కులాలే ఇప్పుడు రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తున్నాయి. తామూ వెనకబడిన కులాలకిందికే వస్తామని వాదిస్తున్నాయి. తమలో పేదరికం ఏ స్థాయిలో ఉన్నదో ఏకరువు పెడుతున్నాయి. అయితే వీరి వాదనలో ఓ మెలిక ఉంది. ‘ఇస్తే మాకూ రిజర్వేషన్లు ఇవ్వండి...లేదా అందరికీ తీసేయండి’ అన్నదే వారి డిమాండ్. రాజస్థాన్‌లో గుజ్జర్లైనా, గుజరాత్లో పటేళ్లయినా, ఇప్పుడు జాట్లైనా, మహారాష్ట్రలోని మరాఠాలైనా అదే కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపులైతే 1966 వరకూ తమకున్న కోటాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ప్రపంచీకరణ విధానాల అమలు మొదలెట్టాక క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో పాలకులు తెలుసుకోవడం లేదు. మెజారిటీ ప్రజానీకం ఆధారపడే వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోవడం, అందులో ఉపాధి అవకాశాలు తగ్గడంలాంటి పరిస్థితులను వారు గుర్తించడంలేదు. కొండలా పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను పాలకులు పట్టించుకోవడంలేదు. గుజరాత్లో పటేళ్లది మరో సమస్య. వారు నిర్వహిస్తున్న చిన్నా చితకా వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడుతున్నాయి. అభివృద్ధి పేరిట అమలవుతున్న విధానాలే దీనికి కూడా కారణం. ఇలా దిక్కుతోచని స్థితిలో ఉన్న కులాలకు రిజర్వేషన్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామంతో ఓబీసీ కులాలు కలవరపడుతున్నాయి. రిజర్వేషన్లకు సామాజిక వెనకబాటుతనం ప్రాతిపదిక కావలసినచోట ఆర్థిక స్థితిగతులు గీటురాయి కావడమేమిటని ఆ కులాలు ప్రశ్నిస్తున్నాయి. అన్నివిధాలా అభివృద్ధి చెంది ఉన్న కులాలవారికి ఓబీసీ గుర్తింపునిస్తే తమకున్న కొద్దిపాటి అవకాశాలూ దెబ్బతింటాయన్నది వారి వాదన. ఇలాంటి వైరుధ్యాలను పరిష్కరించడం అంత సులభం కాదు. ముద్రగడ దీక్ష సందర్భంగా చంద్రబాబు సర్కారిచ్చిన హామీ అయినా...ఇప్పుడు జాట్ల ఆందోళనను చల్లార్చడానికి కేంద్రం ఏర్పరిచిన కమిటీ అయినా తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. గండం గట్టెక్కడం కోసం తీసుకునే ఇలాంటి చర్యలు దీర్ఘకాలంలో పెద్దగా ఉపయోగపడవు. సమస్యను సమగ్రంగా దర్శించి తమ విధానాల్లోని లోటుపాట్లను సవరించుకోవడంతోపాటు ఆయా వర్గాల డిమాండ్లలోని సహేతుకతను నిర్ధారించడానికి శాస్త్రీయ మార్గాలను అనుసరించడం ఉత్తమమని పాలకులు తెలుసుకోవాలి. -
కులాల మధ్య సౌభ్రాతృత్వమే అంబేడ్కరిజం
సందర్భం కులాల మధ్యన సౌభ్రాతృత్వ సాధననే అంబేడ్కర్ ఆలోచనా విధానంగా చెప్ప వచ్చు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృ త్వం అనే ఫ్రెంచ్ విప్లవం మూడు ప్రధాన సూత్రాల్లో చివరిదైన సౌభ్రాతృ త్వానికి అంబేడ్కర్ అంత ప్రాధాన్యతను ఎందుకిచ్చారో తెలుసుకోకుంటే, అంబేడ్కరిజాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. సౌభ్రాతృత్వ పునాదులు లేకుండా సమానత్వం, స్వేచ్ఛ భారతీయ సమాజంలో సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే హిందూ మతంలో సమానత్వం అసాధ్య మేనని చెప్పవచ్చు. ఎందుకంటే హిందూ సమాజం వర్ణం/కులం ఆధారంగా ఏర్పడింది. మొత్తం సమాజం ఏకంగా భావించినా అది నిట్టనిలువునా చీలి ఉంటుంది. ఇది దొంతరలతో కూడిన నిర్మాణం. ఒక కులం, దానిపైన ఇంకో కులం లేదా దానికింద మరో కులం. ఇలా ఈ చీలిక శాశ్వత నిర్మాణంగా ఉంటుంది. ఇలాంటి వివక్షతో కూడిన సమాజ నిర్మాణానికి మతపరమైన పవిత్రతను ఆపాదించారు. ఇది కులాంతరీకరణకు వ్యతిరేకం. ఒక కులం ఇంకో కులంతో సమానం కాదు కాబట్టి కులాంతర వివా హాలు నిషేధం. ఇది సామాజిక అనుసంధానం కంటే తృణీకరణనే ప్రోత్సహిస్తుంది. పైగా మనుస్మృతి మనుషులను సమానులుగా చూడలేదు కాబట్టి నేరాలకు కూడా కులాలను బట్టి శిక్షలు విధించారు. ఇది చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే మౌలిక సూత్రానికే వ్యతిరేకం. స్వేచ్ఛను అనుభవించడానికి కొన్ని సామా జిక పరిస్థితులు ఏర్పడి ఉండాలని అంబేడ్కర్ అన్నారు. అవి సామాజిక సమానత్వం, సార్వ త్రిక, లౌకిక విద్య కులాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండటం, వృత్తిపరమైన ఆర్థిక రక్షణ. ఈ మూడు పరిస్థితులు లేని చోట స్వేచ్ఛ మనగలగడం అసాధ్యం. అయితే హిందూ సమా జంలో సమానత్వానికి స్థానమేలేదు. అదే విధంగా విద్యను ఒక హక్కుగా అది భావించదు. కేవలం అగ్రవర్ణాలకు పరిమితమైన గురుకుల విద్యా విధానంతో కూడుకుని ఉండటం వలన అది విద్యలో సమానత్వాన్ని కోరుకోలేదు. అదేవిధంగా కులాలకు, వ్యక్తులకు ఎలాంటి ఆర్థిక స్వేచ్ఛను హిందూ మతం ఇవ్వలేదు. హిందూ సమాజంలో సౌభ్రాతృత్వానికి స్థానం లేదు. అంబే డ్కర్ ప్రకారం సౌభ్రాతృత్వం అంటే తోటి వారిని కులం గురించి ఆలోచించకుండా సమానంగా చూడడం. ఈ దేశంలో ప్రతి కులం తన కుల ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తుంది. ప్రతి కులానికి ఒక జాతీయతకుండే అన్ని లక్షణాలు ఉంటాయంటారు అంబేడ్కర్. కాబట్టి కులం ఆధారంగా ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించలేమంటారు. భారత సమాజంలో ఆహార సంస్కృతి కూడా కులం చుట్టూ అల్లుకొని ఉన్నది. మాంసాహారాన్ని అందులో గొడ్డు మాంసాన్ని తక్కువ చూడడం, దానితోపాటు ఎవరు ఏది తినాలనే నియమం పెట్టడం, ఇవన్నీ కూడా కులాల సౌభ్రాతృత్వానికి అడ్డుగోడలు. అంబేడ్కర్ హిందూ సామాజిక మనస్తత్వాన్ని ‘‘వివిధ కులాల మధ్యన గౌరవం కోసం జరిగే శత్రుత్వ పోరాటాలు’’ అనీ, అలాగే ‘తమపై కులా లను ద్వేషించడం - కింది కులాలను నీచంగా చూడడం’ జరుగు తుందనీ నిర్వచించారు. కులం వెలుపల పుట్టుకలు, పెళ్లిళ్లు, పండు గలు, చావులు జరగవు. అలాగే కులాల మధ్య కంచం పొత్తు- మంచం పొత్తు ఉండదు. ఇది మత ఆధారిత వ్యవస్థ. కాబట్టి హిందూ సమాజంలో సౌభ్రాతృత్వానికి ఆస్కారమే లేదు. సామాజికంగా కుల సంఘ ఉద్యమాల ద్వారా అంబేడ్కరి జాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునేవారు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే కుల సంఘాల ద్వారా సౌభ్రాతృత్వం సాధించకపోగా మిగత కులాల వారితో వైరి/ వైరుధ్యం పెరుగుతుంది. అట్లాంటి ఉద్యమాలు కేవలం తమ కులాలలో ఉన్న వ్యక్తులకు కొన్ని పద వులు/ రాయితీలు తెచ్చిపెట్టవచ్చు కాని మొత్తం మీద అంబేడ్కర్ ఉద్యమాన్ని దెబ్బతీసినవాళ్లవుతారు. అలాగే వర్గ పోరాటాల వల్ల కూడా సౌభ్రాతృత్వ సాధన అసాధ్యం. ప్రజల్లో వర్గ భావం కాకుం డా కుల భావమే ఉంటుంది కాబట్టి ‘వర్గ ఐక్యత’ సాధించడం హిందూ సమాజంలో అసాధ్యం. అది కేవలం కుల నిర్మూలన ద్వా రానే సాధ్యం. కుల నిర్మూలనకి కూడా సౌభ్రాతృత్వమే పునాది. భారతదేశంలో ఆ పునాదిని ఏర్పరిచింది రిజర్వేషన్లు; కుల సంఘా లు ఏర్పాటు చేసుకొని గిరిగీసుకొని కూర్చుంటే అది సౌభ్రాతృ త్వానికి దారి తీయదు. సమాజంలోని అట్టడుగు కులాలను ఏకం చేయడం రాజకీయ ఉద్యమం ద్వారానే సాధ్యం. ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసింది కాన్షీరాం బహుజనవాదం - బహుజన ఉద్యమం; ఆయన అన్నట్టు కులాన్ని ఇంకో కులంతో కలపడం - దాని ద్వారా రాజకీయ చైతన్యం పెంపొందించి; దాన్ని రాజకీయా ధికారంగా మార్చడం, రాజకీయాధికారాన్ని సామాజిక, ఆర్థిక సాంస్కృతిక మార్పులకు ఉపయోగించడం. తద్వారా అంబేడ్కర్ ఆకాంక్షించినట్టు ‘‘ప్రబుద్ధ భారతాన్ని’’ నిర్మించడం. అంటే అది కేవలం ‘అంబేడ్కర్ ఐడియాలజీ- కాన్షీరాం మెథడాలజీ’ ద్వారానే సాధ్యం. ఆ విధంగా కేవలం సౌభ్రాతృత్వం ఆధారంగా భారత సమాజాన్ని పునర్నిర్మించడమే భారతరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు మనం అర్పించే నిజమైన నివాళి. - డా. వెంకటేశ్ నాయక్ వదిత్య (నేడు బాబాసాహెబ్ అంబే డ్కర్ 59వ వర్ధంతి) వ్యాసకర్త అసిస్టెంట్ ఫ్రొఫెసర్, ఇఫ్లూ 72072 50809