డెడికేటెడ్ కమిషన్‌కు ఎంబీసీ ప్రతినిధుల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: విద్యా ఉద్యోగాల్లో అమలు చేసినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాతినిధ్యానికి నోచుకోని కులాలు, సంచార జాతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు డీఆర్‌డీఎస్ రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ కేవీ రావు, రిటైర్డ్ అడిషినల్ డీసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, ఎంబీసీ ప్రతినిధి మహేశ్ వినతిపత్రం సమర్పించారు.
35 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యంత వెనుబడిన కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. బీసీల్లోని 8 నుంచి 9 కులాలే రాజకీయాల్లో రిజర్వేషన్ల ఫలాలను మొత్తం అనుభవిస్తున్నాయని.. అత్యంత వెనుకబడిన వర్గాలకు కనీసం వార్డు మెంబర్ పదవులు కూడా ఇప్పటికీ దక్కడం లేదన్నారు. ఏబీసీడీ వర్గీకరణ అమలుతోనే రాజకీయాల్లో ఎంబీసీలకు ప్రాతినిధ్యం దక్కుతుందని వివరించారు.
తెలంగాణలో 56 శాతం వరకు బీసీలు ఉన్నారని.. దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందన్నారు. కులగణన తర్వాత దాషామా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు. రాష్ట్రంలో 93 బీసీ కులాలు ఉండగా 90 శాతం రిజర్వేషన్లు 9 కులాలే దక్కించుకుంటున్నాయని, మిగతా 10 శాతం రిజర్వేషన్లను 15 కులాలకు చెందిన వారు దక్కించుకున్నారని వివరించారు. అత్యంత వెనుకబడిన బీసీ-ఏ కులాలకు, సంచార జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం శూన్యమని తెలిపారు. ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉండాలంటే ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడం ఒక్కటే మార్గమని నొక్కి చెప్పారు. ఎంబీసీల సామాజిక సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం ఎంతో కీలమని తేల్చిచెప్పారు.
చదవండి: నిరుపయోగంగా 50 ఎకరాలు... నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment