localbody polls
-
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యా ఉద్యోగాల్లో అమలు చేసినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాతినిధ్యానికి నోచుకోని కులాలు, సంచార జాతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు డీఆర్డీఎస్ రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ కేవీ రావు, రిటైర్డ్ అడిషినల్ డీసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, ఎంబీసీ ప్రతినిధి మహేశ్ వినతిపత్రం సమర్పించారు. 35 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యంత వెనుబడిన కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. బీసీల్లోని 8 నుంచి 9 కులాలే రాజకీయాల్లో రిజర్వేషన్ల ఫలాలను మొత్తం అనుభవిస్తున్నాయని.. అత్యంత వెనుకబడిన వర్గాలకు కనీసం వార్డు మెంబర్ పదవులు కూడా ఇప్పటికీ దక్కడం లేదన్నారు. ఏబీసీడీ వర్గీకరణ అమలుతోనే రాజకీయాల్లో ఎంబీసీలకు ప్రాతినిధ్యం దక్కుతుందని వివరించారు.తెలంగాణలో 56 శాతం వరకు బీసీలు ఉన్నారని.. దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందన్నారు. కులగణన తర్వాత దాషామా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు. రాష్ట్రంలో 93 బీసీ కులాలు ఉండగా 90 శాతం రిజర్వేషన్లు 9 కులాలే దక్కించుకుంటున్నాయని, మిగతా 10 శాతం రిజర్వేషన్లను 15 కులాలకు చెందిన వారు దక్కించుకున్నారని వివరించారు. అత్యంత వెనుకబడిన బీసీ-ఏ కులాలకు, సంచార జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం శూన్యమని తెలిపారు. ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉండాలంటే ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడం ఒక్కటే మార్గమని నొక్కి చెప్పారు. ఎంబీసీల సామాజిక సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం ఎంతో కీలమని తేల్చిచెప్పారు.చదవండి: నిరుపయోగంగా 50 ఎకరాలు... నెరవేరని ప్రభుత్వ లక్ష్యం -
టీడీపీలో ‘లోకల్’ గుబులు
* స్థానిక ఎన్నికల సరళితో బెంబేలెత్తుతున్న పార్టీ నేతలు * క్షేత్రస్థాయి నివేదికలు, పార్టీ నేతల విశ్లేషణలతో నైరాశ్యం * అత్యధిక స్థానాల్లో టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉందని సర్వేల వెల్లడి * ముఠా పోరుకు తోడు కాంగ్రెస్ నేతలతోనూ పొసగని వైనం * బీజేపీకి కేటాయించిన స్థానాల్లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు * నేడు సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు * టీడీపీ అభ్యర్థుల్లో గుబులు * అత్యధిక స్థానాలు తమవేనని వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా * 13 జిల్లా పరిషత్‌లూ తమకే ఖాయమంటున్న నేతలు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం జారీ అవుతున్న నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల సరళి తెలుగుదేశం పార్టీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ముగిసిన మునిసిపల్, పంచాయతీరాజ్ సంస్థల తొలివిడత ఎన్నికలతో పాటు శుక్రవారంతో పూర్తయిన రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో.. టీడీపీ ప్రభావం నామమాత్రమేనని క్షేత్రస్థాయి నివేదికలు, పార్టీ నేతల విశ్లేషణలు స్పష్టం చేస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ మరింత ముదిరింది. శనివారం నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్న దశలో.. తాజాగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల మినహా సీమాంధ్రలోని 13 జిల్లాల్లోనూ పార్టీ ప్రభావం చెప్పుకోదగినంతగా లేదన్న వార్తలు టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న టీడీపీ నేతల్లో ఈ పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ‘పంచాయతీ’లో పడిపోయాం..! ఇటీవల ముగిసిన మున్సిపల్, తొలివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సేకరించిన సమాచారంతో పాటు తాజాగా ముగిసిన ెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వివరాలను తెప్పించుకున్న రాజకీయ పార్టీలు వాటిని విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. పార్టీ నేతలకు అందిన క్షేత్రస్థాయి నివేదికల మేరకు కృష్ణా, విజయనగరం జిల్లాల్లో మినహాయిస్తే మిగిలిన చోట ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయామని టీడీపీ నేతలు నిర్ధారణకు వచ్చారు. కొన్ని చోట్ల పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ.. అత్యధిక స్థానాల్లో పార్టీ ప్రభావం నామమాత్రంగానే ఉందని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి అందిన సమాచారంగా తెలుస్తోంది. ఈ సమాచారం టీడీపీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నేతల మధ్య గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఆ తగాదాల ప్రభావం ఎన్నికలపై స్పష్టంగా కనిపించిందని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి చేరిన నేతల నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య రాజుకున్న అంతర్గత పోరు కూడా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపినట్లు అంచనాకొచ్చారు. బీజేపీకి కేటాయించిన పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి పోటీ చేయాలని భావించిన టీడీపీ నేతలు పూర్తిగా చెతులెత్తేసినట్టు సమాచారం. ఒక ఒరలో రెండు కత్తుల పోరు... సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు టీడీ పీలో చేరారు. దీంతో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రెండు, మూడుగా ఉన్న గ్రూపులు ఇపుడు రెట్టింపయ్యాయి. ఒక వర్గంపై మరో వర్గం కత్తులు దూస్తోంది. రాయలసీమలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గతంలోకాంగ్రెస్, టీడీపీల మధ్య వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు పలు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరటంతో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేకపోతున్నాయని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. కోస్తా ప్రాంతంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలను కలుపుకుని వెళ్లేందుకు దీర్ఘకాలంగా ఆ పార్టీలో కొనసాగుతున్న టీడీపీ నేతలు అంగీకరించటం లేదు. ఒకవేళ కాంగ్రెస్ వారిని తమతో సమానంగా ప్రోత్సహిస్తే ఏకు మేకు అవుతారన్న భయంతో స్థానిక ఎన్నికల సమయంలో కలుపుకుని వెళ్లకుండా పక్కన పెట్టేశారని చెప్తున్నారు. తాజాగా జరిగిన పురపాలక, పంచాయతీ ఎన్నికల్లో రెండు గ్రూపుల మధ్య ఈ అంతరం స్పష్టంగా కనిపించింది. స్థానిక ఎన్నికల నిమిత్తం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ మంత్రి గల్లా అరుణను చంద్రబాబు నియమించారు. ఆమె కాంగ్రెస్ నేతలందరికీ పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు. దీంతో తొలి నుంచి టీడీపీలో పనిచేస్తున్న నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి మధ్య విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. గతంలో సోమిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లి నియోజకవర్గానికి ఇపుడు ఆదాల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో ఎవరి గ్రూపును వారు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీకి ఇచ్చిన సీట్లలో కాడి పడేసిన తమ్ముళ్లు... బీజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మొదటే చేతులె త్తేశారు. ఈ నెల ఆరో తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న సమయంలో నరసరావుపేట అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించారని ప్రచారం మొదలుకావడంతో టీడీపీ నేతలు నిరాశతో పొలింగ్ మధ్యలో వెనుతిరిగారు. అక్కడ ఎంతో కాలం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న కోడెల శివప్రసాద్ ముఖ్య అనుచరులుగా ఉన్న నాయకులందరూ నేటి వరకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి నైరాశ్యంతో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గాల్లో నేతలు అస్సలు స్థానిక ఎన్నికలను పట్టించుకోలేదు. విశాఖ జిల్లాలోని అరకు, విశాఖ లోక్‌సభ , పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించటంతో ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్న టీ డీపీ నేతలు కాడి కిండ పడేశారు. దీంతో తాజాగా టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు ఏదో చేశామనిపించేందుకు కొద్దిగా హడావుడి చేశారు. ఎక్కడా ఆశాజనకంగా లేదు..! మిగిలిన జిల్లాల్లో కూడా పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. బీజేపీతో పొత్తు, వరుసగా కాంగ్రెస్ నేతల చేరిక అనంతరం పరిస్థితి ఎలా ఉందోనని టీడీపీ అధినేత సర్వేలు చేయించారు. అయితే ఎక్కడ కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదన్న సమాచారం ఆ పార్టీ నేతలను కుంగదీసింది. బీజేపీతో పొత్తు ఫలిస్తుందని, మోడీ హవా ఉందన్న ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఫలితాలు సానుకూలంగా లేకపోవటం టీడీపీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోందని పార్టీ వర్గాలు చెప్పాయి. 13 జెడ్పీలూ మావే: వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో శనివారం మొత్తం 319 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అనేక రకాలుగా తెప్పించుకున్న నివేదికల మేరకు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం, పార్టీ నేతల విశ్లేషణల మేరకు 190కి పైగా జెడ్పీటీసీలను సునాయాసంగా గెలుచుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ అంచనాకొచ్చింది. తమకు అందిన అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించుకుని విశ్లేషిస్తే మొత్తం స్థానాల్లో 50 చోట్ల పోటాపోటీగా ఎన్నికలు జరిగాయని, మిగతా చోట్ల మెజారిటీ స్థానాల్లో పోలింగ్ సరళి ఏకపక్షంగా కనిపించిందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఒకరు పేర్కొన్నారు. 13 జిల్లా పరిషత్‌లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక చోట్ల అభ్యర్థులను పోటీ పెట్టలేకపోగా.. పోటీ చేసిన కొన్ని స్థానాల్లో సైతం ప్రచారం నుంచే వెనుకబడిపోయారు. కాంగ్రెస్ ప్రభావం చెప్పుకోవటానికి కూడా లేదని ఆ పార్టీ వర్గాలే కాదు.. ప్రత్యర్థి పార్టీలు సైతం స్పష్టంచేస్తున్నాయి. -
టీడీపీ నేత ప్రసాద్‌బాబుపై కేసు నమోదు
కడప: రాయచోటిలో టీడీపీ నేత ప్రసాద్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 24వ వార్డు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించినందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
సాధారణ ఎన్నికలపై మున్సిపల్ ఫలితాల ప్రభావం!
-
సాధారణ ఎన్నికలపై మున్సిపల్ ఫలితాల ప్రభావం!
* రేపో మాపో సాధారణ ఎన్నికల షెడ్యూల్! * లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై ఎలాంటి * ప్రభావం పడకూడదంటోన్న నియమావళి * రాష్ట్రంలో ‘సార్వత్రిక’ పోలింగ్ ముగిసేవరకు * మున్సిపల్ ఫలితాలు నిలిపేస్తే మేలనే భావన సాక్షి, హైదరాబాద్: ఒకవైపు నుంచి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు మరోవైపు నుంచి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావిస్తుండగానే.. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఫలితాలు ఏప్రిల్ 2న వెలువడనున్నాయి. ఇవి ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా ప్రభావం చూపుతాయని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణంగా అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై ఎటువంటి ప్రభావం పడకుండా చూడాలనే నిబంధన ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అదే చెబుతోంది. 2009లో రాష్ట్రంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 16, 23 తేదీల్లో రెండు విడతల్లో జరిగింది. అయితే ఈ ఫలితాలు వెల్లడిస్తే మిగతా దశల్లో ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల పై ప్రభావం చూపుతాయనే కారణంతో ఎన్నికల కమిషన్ మే 16 వరకు ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఇప్పుడు మాత్రం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌కు ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో ఆ ప్రభావం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పోలింగ్‌పై పడుతుందనే వాదన బలంగా విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఫలితాలను మాత్రం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసిన తరువాత వెలువరిస్తే సరిపోతుందనే భావనను ఓ ఉన్నతాధికారి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతోనే జరగనున్నందున ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని విశ్లేషించారు. అవి ఒక విధమైన అధికారిక సర్వేగా నిలుస్తాయని, ఇది సాధారణ ఎన్నికల ప్రక్రియను కలుషితం చేసే చర్యగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలను సంప్రదించగా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం తప్పనిసరిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియామవళికి విరుద్ధమనే అభిప్రాయూన్నే వ్యక్తం చేయడం గమనార్హం. -
ఉత్సవ విగ్రహాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :పల్లె పంచాయతీ ముగిసింది. ప్రత్యేక పాలనకు సెలవిచ్చి కొత్తగా సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. నెల రోజులు ప్రచారం నిర్వహించి, సంగ్రామంలో గెలిచి ఈ నెల 2వ తేదీన సర్పంచ్‌లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినా వీరికి ప్రభుత్వం ‘పవర్’ ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన రోజునే పంచాయతీ రికార్డులు అప్పగించాలి. పక్షం రోజులు గడిచినా రికార్డులు అందలేదు. అయితే రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన రికార్డులు కార్యదర్శుల వద్ద ఉన్నాయి. సర్పంచ్, కార్యదర్శులతో కూడిన జాయింట్ చెక్‌పవర్ ఉంటుందా అన్న దానిపై ఆదేశాలు రాకపోవడంతో చెక్‌బుక్ కార్యదర్శుల వద్దే ఉంచుకుంటున్నారు. దీంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని వాపోతున్నారు. లెక్కలు తెలిసేదెలా? జిల్లాలో 866 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉండగా, ఏడు జీపీలకు నామినేషన్లు రాకపోవడం, మిగతా రెండు జీపీల్లో వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడడం, గెలుపొందిన ఇద్దరు సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేయలేదు. మిగిలిన 855 మంది సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించారే తప్ప వారికి రికార్డులు అందకపోడంతో పంచాయతీ వివరాలు తెలియడంలేదు. 2011లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసింది ఎంత? జనరల్ ఫండ్స్‌లో నిధులు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులెన్ని? ఏఏ పనులకు ఎంతెంత ఖర్చు పెట్టారు? ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంది? మిగులు బాటు ఎంత? చెల్లించాల్సినవి ఏమైన ఉన్నాయా? అనేది నూతన సర్పంచ్‌లను అర్థం కావడం లేదు. అందని రికార్డులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సమస్యలు తీర్చాలని ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో సమధానం చెప్పలేక సతమతం అవుతున్నారు. తక్షణం చేపట్టాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయో స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మాజీ సర్పంచ్‌లు, కార్యదర్శలు లెక్కలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు అందలేదన్న సాకుతో కార్యదర్శులు రికార్డులు, చెక్‌బుక్‌లు అప్పగించడం లేదు. చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు రికార్డులు తమ వద్దే ఉంచుకున్నారనే విమర్శలున్నాయి. కాగా ప్రత్యేకాధికారుల పాలన నుంచి రికార్డులు స్పష్టంగా లేవు. రికార్డులుంటే క్యాష్‌బుక్‌లు.. బ్యాంక్ పాస్‌బుక్‌లు ఉంటే రశీదు బుక్కులు లేవు. కొన్ని పంచాయతీల్లో కార్యదర్శులు బదిలీపై వెళ్లారు. పంచాయతీల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి అన్ని రికార్డులు, క్యాష్‌బుక్‌లు, రశీదు పుస్తకాలు అప్పగించని సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరు కార్యదర్శులు 2011 పదవీ నుంచి దిగిపోయే ముందు సర్పంచులే ఈ రికార్డులు అప్పజెప్పలేదని కూడా బుకాయిస్తున్నారు. మూడు రోజుల్లో ఇస్తాం.. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి 2006 సంవత్సరంలో నూతన సర్పంచ్‌లుగా ఎన్నికైన వారికి ప్రభుత్వం నుంచి ఇంతకు ముందు చెక్ పవర్స్ వచ్చాయి. అప్పుడు వచ్చిన విధంగా నూతన సర్పంచ్‌లకు ఇప్పుడు కూడా రావచ్చు. పంచాయతీ నుంచి ప్రభుత్వానికి నివేదికలు పంపడమంటూ ఏమి ఉండదు. పంచాయతీరాజ్ శాఖ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు చెక్ పవర్స్ ఆర్డర్లను ఏ విధంగా ఇవ్వాలో, రికార్డులను ఏ విధంగా అప్పజెప్పాలో మాకు ఆదేశాలు వస్తాయి. జిల్లా స్థాయిలో సర్పంచ్‌లకు మేమిస్తాం. మూడు నాలుగు రోజుల్లో వస్తాయి. చెక్ పవర్స్ రాగానే కొత్త సర్పంచ్‌లకు తెలియజేస్తాం.