ఉత్సవ విగ్రహాలు | festive statues | Sakshi
Sakshi News home page

ఉత్సవ విగ్రహాలు

Published Sat, Aug 17 2013 2:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

festive statues

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ :పల్లె పంచాయతీ ముగిసింది. ప్రత్యేక పాలనకు సెలవిచ్చి కొత్తగా సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. నెల రోజులు ప్రచారం నిర్వహించి, సంగ్రామంలో గెలిచి ఈ నెల 2వ తేదీన సర్పంచ్‌లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినా వీరికి ప్రభుత్వం ‘పవర్’ ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన రోజునే పంచాయతీ రికార్డులు అప్పగించాలి. పక్షం రోజులు గడిచినా రికార్డులు అందలేదు. అయితే రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన రికార్డులు కార్యదర్శుల వద్ద ఉన్నాయి. సర్పంచ్, కార్యదర్శులతో కూడిన జాయింట్ చెక్‌పవర్ ఉంటుందా అన్న దానిపై ఆదేశాలు రాకపోవడంతో చెక్‌బుక్ కార్యదర్శుల వద్దే ఉంచుకుంటున్నారు. దీంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని వాపోతున్నారు.
 
 లెక్కలు తెలిసేదెలా?
 జిల్లాలో 866 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉండగా, ఏడు జీపీలకు నామినేషన్లు రాకపోవడం, మిగతా రెండు జీపీల్లో వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడడం, గెలుపొందిన ఇద్దరు సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేయలేదు. మిగిలిన 855 మంది సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించారే తప్ప వారికి రికార్డులు అందకపోడంతో పంచాయతీ వివరాలు తెలియడంలేదు. 2011లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసింది ఎంత? జనరల్ ఫండ్స్‌లో నిధులు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులెన్ని? ఏఏ పనులకు ఎంతెంత ఖర్చు పెట్టారు? ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంది? మిగులు బాటు ఎంత? చెల్లించాల్సినవి ఏమైన ఉన్నాయా? అనేది నూతన సర్పంచ్‌లను అర్థం కావడం లేదు.
 
 అందని రికార్డులు
 నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సమస్యలు తీర్చాలని ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో సమధానం చెప్పలేక సతమతం అవుతున్నారు. తక్షణం చేపట్టాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయో స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మాజీ సర్పంచ్‌లు, కార్యదర్శలు లెక్కలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు అందలేదన్న సాకుతో కార్యదర్శులు రికార్డులు, చెక్‌బుక్‌లు అప్పగించడం లేదు. చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు రికార్డులు తమ వద్దే ఉంచుకున్నారనే విమర్శలున్నాయి. కాగా ప్రత్యేకాధికారుల పాలన నుంచి రికార్డులు స్పష్టంగా లేవు. రికార్డులుంటే క్యాష్‌బుక్‌లు.. బ్యాంక్ పాస్‌బుక్‌లు ఉంటే రశీదు బుక్కులు లేవు. కొన్ని పంచాయతీల్లో కార్యదర్శులు బదిలీపై వెళ్లారు. పంచాయతీల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి అన్ని రికార్డులు, క్యాష్‌బుక్‌లు, రశీదు పుస్తకాలు అప్పగించని సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరు కార్యదర్శులు 2011 పదవీ నుంచి దిగిపోయే ముందు సర్పంచులే ఈ రికార్డులు అప్పజెప్పలేదని కూడా బుకాయిస్తున్నారు.
 
 మూడు రోజుల్లో ఇస్తాం..
 - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి
 2006 సంవత్సరంలో నూతన సర్పంచ్‌లుగా ఎన్నికైన వారికి ప్రభుత్వం నుంచి ఇంతకు ముందు చెక్ పవర్స్ వచ్చాయి. అప్పుడు వచ్చిన విధంగా నూతన సర్పంచ్‌లకు ఇప్పుడు కూడా రావచ్చు. పంచాయతీ నుంచి ప్రభుత్వానికి నివేదికలు పంపడమంటూ ఏమి ఉండదు. పంచాయతీరాజ్ శాఖ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు చెక్ పవర్స్ ఆర్డర్లను ఏ విధంగా ఇవ్వాలో, రికార్డులను ఏ విధంగా అప్పజెప్పాలో మాకు ఆదేశాలు వస్తాయి. జిల్లా స్థాయిలో సర్పంచ్‌లకు మేమిస్తాం. మూడు నాలుగు రోజుల్లో వస్తాయి. చెక్ పవర్స్ రాగానే కొత్త సర్పంచ్‌లకు తెలియజేస్తాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement