ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈసారి ఎర్రకోటపై జరిగే వేడుకలలో నారీశక్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణ కానుంది. వివిధ సమస్యల నుంచి తమ పంచాయతీలకు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రతినిధులు ఎర్రకోట నుంచి మహిళా సాధికారత సందేశాన్ని ఇవ్వనున్నారు.
పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలవారీగా ఎంపికచేసిన 150 మంది మహిళా సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ అధ్యక్షురాళ్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షురాళ్లు తదితర మహిళా పంచాయతీ ప్రతినిధులు ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించనుంది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం పాటుపడుతోంది.
ఇటీవల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆయా రాష్ట్రాలకు చెందిన మహిళా పంచాయతీ ప్రతినిధులను ఆహ్వానించింది. వీరికి ఆగస్టు 14న న్యూఢిల్లీలోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఉదయం 10 గంటల నుంచి ‘పంచాయతీరాజ్‌లో మహిళా నాయకత్వం’ అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment