దేశం అంటే భక్తి... ప్రేమ ఉన్నవాళ్లు దేశం కోసం ప్రాణాలను వదిలేయడానికి కూడా వెనకడుగు వేయరు. ‘మేరా భారత్ మహాన్’ అంటూ నిజజీవితంలోప్రాణాలను పణంగా పెట్టిన అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కొందరి జీవితాల ఆదర్శంగా వెండితెరపైకి వచ్చిన సినిమాలనూ చూశాం. ప్రస్తుతం నిర్మాణంలో అలాంటి నిజ జీవిత వీరుల నేపథ్యంలో, కల్పిత పాత్రలతోనూ రూపొందుతున్న దేశభక్తి చిత్రాలు చాలా ఉన్నాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.
భూతల్లిపై ఒట్టేయ్...
‘‘భూతల్లిపై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్... తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టేయ్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా, వారిలో దేశభక్తి ఉ΄÷్పంగేలా పాట పాడుతున్నాడు వీరశేఖరన్. ఇతని గురించి బాగా తెలిసిన వ్యక్తి సేనాపతి. ఎందుకంటే సేనాపతి తండ్రి వీర శేఖరన్. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ (కల్పిత పాత్ర) ఏ విధంగా పోరాడాడు? అనేది వెండితెరపై ‘ఇండియన్ 3’ సినిమాలో చూడొచ్చు.
హీరో కమల్‌హాసన్–దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఇండియన్’ (‘భారతీయుడు’) ఫ్రాంచైజీలో త్వరలో రానున్న చిత్రం ‘ఇండియన్ 3’. ఈ చిత్రంలో వీరశేఖరన్, సేనాపతి పాత్రల్లో తండ్రీకొడుకుగా కమల్‌హాసన్ కనిపిస్తారు. 1806 సమయంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ ఏ విధంగా పోరాడాడు? అతని పోరాట స్ఫూర్తితో 1940లలో సేనాపతి ఏం చేశాడు? అనే అంశాలతో ‘ఇండియన్ 3’ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
భారత్ మాతా కీ జై
‘తేరే పాకిస్తానీ అడ్డా మే బైట్ కే బతా రహా హూ... భారత్ మాతా కీ జై...’ అంటూ నాగచైతన్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ‘తండేల్’ సినిమాలోనిది. విజయనగరం, శ్రీకాకుళంప్రాంతాలకు చెందిన మత్య్సకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరప్రాంతానికి వలస వెళ్తారు. వేటలో భాగంగా వారికి తెలియకుండానే పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్తారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డులు ఈ భారత మత్స్యకారులను బంధీలుగా పట్టుకుని జైల్లో వేస్తారు.
పాకిస్తాన్ జైల్లో వీరి పరిస్థితి ఏంటి? వీరి కుటుంబ సభ్యులు వీరి కోసం ఏమైనా పోరాటం చేశారా? అనే అంశాల నేపథ్యంలో ‘తండేల్’ కథనం ఉంటుందని తెలిసింది. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, అతని భార్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. దేశభక్తి అంశాలతో పాటు ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు మిళితమైన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.
మార్టిన్... ఇండియన్
పాకిస్తాన్ ఆర్మీ మార్టిన్ అనే భారతీయుడిని క్రూరంగా శిక్షించాలనుకుంటుంది. మార్టిన్‌కు దేశభక్తి ఎక్కువ. ఎంతలా అంటే... అతని చేతిపై ఇండియన్ అనే ట్యాటూ ఉంటుంది. అసలు పాకిస్తాన్ జైల్లో మార్టిన్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అనేది కన్నడ చిత్రం ‘మార్టిన్’ చూస్తే తెలుస్తుంది. ధ్రువ్ సర్జా హీరోగా నటించిన చిత్రం ఇది. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ దేశభక్తి, యాక్షన్, ఎమోషనల్ మూవీ అక్టోబరు 11న రిలీజ్ కానుంది.
అమరన్
‘రమణ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయింది), తుపాకీ, కత్తి’ వంటి సినిమాల్లో సామాజిక బాధ్యతతో పాటు కాస్త దేశభక్తిని కూడా మిళితం చేసి, హిట్ సాధించారు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్‌తో ‘అమరన్’ సినిమా చేస్తున్నారాయన.
ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపిస్తారు శివ కార్తికేయన్. సాయిపల్లవి హీరోయిన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని టాక్. ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. అలాగే ప్రస్తుతం మురుగదాస్ హిందీలో సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ‘సికందర్’ కూడా దేశభక్తి నేపథ్యంలోనే ఉంటుందని టాక్.
సరిహద్దు యుద్ధం
దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న చిత్రాల్లో నటించేందుకు అక్షయ్ కుమార్ ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన చేసిన ‘బేబీ, ఎయిర్ లిఫ్ట్, ‘మిషన్ మంగళ్’ వంటి చిత్రాలు ఇందుకు ఓ నిదర్శనం. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘స్కై ఫోర్స్’. 1965లో ఇండియా–పాకిస్తాన్‌ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. వీర్ పహారియా, నిమ్రత్ కౌర్, సారా అలీఖాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు.
సందీప్ కెవ్లానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుంది. అలాగే 1971లో ఇండియా–పాకిస్తాన్‌ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో 1997లో హిందీలో ‘బోర్డర్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించారు. కాగా ఇటీవల సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ను ప్రకటించారు.
ఇంకా భారత్–పాకిస్తాన్ విడిపోయిన నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘లాహోర్ –1947’ సినిమా కూడా చేస్తున్నారు సన్నీ డియోల్. ఇక పాకిస్తాన్ చిన్నారిని ఆమె దేశంలో విడిచిపెట్టేందుకు ‘భజరంగీ భాయిజాన్’ (2015)గా సల్మాన్ ఖాన్ చేసిన సాహసాలను సులభంగా మర్చిపోలేం. ఈ ఫిల్మ్‌కు సీక్వెల్ ఉంటుందని చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment