* రేపో మాపో సాధారణ ఎన్నికల షెడ్యూల్!
* లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై ఎలాంటి
* ప్రభావం పడకూడదంటోన్న నియమావళి
* రాష్ట్రంలో ‘సార్వత్రిక’ పోలింగ్ ముగిసేవరకు
* మున్సిపల్ ఫలితాలు నిలిపేస్తే మేలనే భావన
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు నుంచి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు మరోవైపు నుంచి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావిస్తుండగానే.. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఫలితాలు ఏప్రిల్ 2న వెలువడనున్నాయి.
ఇవి ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా ప్రభావం చూపుతాయని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణంగా అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై ఎటువంటి ప్రభావం పడకుండా చూడాలనే నిబంధన ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అదే చెబుతోంది. 2009లో రాష్ట్రంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 16, 23 తేదీల్లో రెండు విడతల్లో జరిగింది. అయితే ఈ ఫలితాలు వెల్లడిస్తే మిగతా దశల్లో ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల పై ప్రభావం చూపుతాయనే కారణంతో ఎన్నికల కమిషన్ మే 16 వరకు ఓట్ల లెక్కింపు చేపట్టలేదు.
ఇప్పుడు మాత్రం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌కు ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో ఆ ప్రభావం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పోలింగ్‌పై పడుతుందనే వాదన బలంగా విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఫలితాలను మాత్రం లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసిన తరువాత వెలువరిస్తే సరిపోతుందనే భావనను ఓ ఉన్నతాధికారి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతోనే జరగనున్నందున ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని విశ్లేషించారు.
అవి ఒక విధమైన అధికారిక సర్వేగా నిలుస్తాయని, ఇది సాధారణ ఎన్నికల ప్రక్రియను కలుషితం చేసే చర్యగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలను సంప్రదించగా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం తప్పనిసరిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియామవళికి విరుద్ధమనే అభిప్రాయూన్నే వ్యక్తం చేయడం గమనార్హం.
సాధారణ ఎన్నికలపై మున్సిపల్ ఫలితాల ప్రభావం!
Published Tue, Mar 4 2014 2:57 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement