* స్థానిక ఎన్నికల సరళితో బెంబేలెత్తుతున్న పార్టీ నేతలు
* క్షేత్రస్థాయి నివేదికలు, పార్టీ నేతల విశ్లేషణలతో నైరాశ్యం
* అత్యధిక స్థానాల్లో టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉందని సర్వేల వెల్లడి
* ముఠా పోరుకు తోడు కాంగ్రెస్ నేతలతోనూ పొసగని వైనం
* బీజేపీకి కేటాయించిన స్థానాల్లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు
* నేడు సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు
* టీడీపీ అభ్యర్థుల్లో గుబులు
* అత్యధిక స్థానాలు తమవేనని వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా
* 13 జిల్లా పరిషత్‌లూ తమకే ఖాయమంటున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం జారీ అవుతున్న నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల సరళి తెలుగుదేశం పార్టీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ముగిసిన మునిసిపల్, పంచాయతీరాజ్ సంస్థల తొలివిడత ఎన్నికలతో పాటు శుక్రవారంతో పూర్తయిన రెండో విడత ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో.. టీడీపీ ప్రభావం నామమాత్రమేనని క్షేత్రస్థాయి నివేదికలు, పార్టీ నేతల విశ్లేషణలు స్పష్టం చేస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ మరింత ముదిరింది.
శనివారం నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్న దశలో.. తాజాగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల మినహా సీమాంధ్రలోని 13 జిల్లాల్లోనూ పార్టీ ప్రభావం చెప్పుకోదగినంతగా లేదన్న వార్తలు టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న టీడీపీ నేతల్లో ఈ పరిణామాలు గుబులు రేపుతున్నాయి.
‘పంచాయతీ’లో పడిపోయాం..!
ఇటీవల ముగిసిన మున్సిపల్, తొలివిడత ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల అనంతరం సేకరించిన సమాచారంతో పాటు తాజాగా ముగిసిన ెండో విడత ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల వివరాలను తెప్పించుకున్న రాజకీయ పార్టీలు వాటిని విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. పార్టీ నేతలకు అందిన క్షేత్రస్థాయి నివేదికల మేరకు కృష్ణా, విజయనగరం జిల్లాల్లో మినహాయిస్తే మిగిలిన చోట ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయామని టీడీపీ నేతలు నిర్ధారణకు వచ్చారు. కొన్ని చోట్ల పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ.. అత్యధిక స్థానాల్లో పార్టీ ప్రభావం నామమాత్రంగానే ఉందని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి అందిన సమాచారంగా తెలుస్తోంది.
ఈ సమాచారం టీడీపీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నేతల మధ్య గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఆ తగాదాల ప్రభావం ఎన్నికలపై స్పష్టంగా కనిపించిందని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి చేరిన నేతల నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య రాజుకున్న అంతర్గత పోరు కూడా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపినట్లు అంచనాకొచ్చారు. బీజేపీకి కేటాయించిన పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి పోటీ చేయాలని భావించిన టీడీపీ నేతలు పూర్తిగా చెతులెత్తేసినట్టు సమాచారం.
ఒక ఒరలో రెండు కత్తుల పోరు...
సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు టీడీ పీలో చేరారు. దీంతో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రెండు, మూడుగా ఉన్న గ్రూపులు ఇపుడు రెట్టింపయ్యాయి. ఒక వర్గంపై మరో వర్గం కత్తులు దూస్తోంది. రాయలసీమలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గతంలోకాంగ్రెస్, టీడీపీల మధ్య వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు పలు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరటంతో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేకపోతున్నాయని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
కోస్తా ప్రాంతంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలను కలుపుకుని వెళ్లేందుకు దీర్ఘకాలంగా ఆ పార్టీలో కొనసాగుతున్న టీడీపీ నేతలు అంగీకరించటం లేదు. ఒకవేళ కాంగ్రెస్ వారిని తమతో సమానంగా ప్రోత్సహిస్తే ఏకు మేకు అవుతారన్న భయంతో స్థానిక ఎన్నికల సమయంలో కలుపుకుని వెళ్లకుండా పక్కన పెట్టేశారని చెప్తున్నారు. తాజాగా జరిగిన పురపాలక, పంచాయతీ ఎన్నికల్లో రెండు గ్రూపుల మధ్య ఈ అంతరం స్పష్టంగా కనిపించింది.
స్థానిక ఎన్నికల నిమిత్తం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి గల్లా అరుణను చంద్రబాబు నియమించారు. ఆమె కాంగ్రెస్ నేతలందరికీ పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు. దీంతో తొలి నుంచి టీడీపీలో పనిచేస్తున్న నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి మధ్య విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. గతంలో సోమిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లి నియోజకవర్గానికి ఇపుడు ఆదాల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో ఎవరి గ్రూపును వారు కాపాడుకునేందుకు ప్రయత్నించారు.
బీజేపీకి ఇచ్చిన సీట్లలో కాడి పడేసిన తమ్ముళ్లు...
బీజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మొదటే చేతులె త్తేశారు. ఈ నెల ఆరో తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న సమయంలో నరసరావుపేట అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించారని ప్రచారం మొదలుకావడంతో టీడీపీ నేతలు నిరాశతో పొలింగ్ మధ్యలో వెనుతిరిగారు.
అక్కడ ఎంతో కాలం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న కోడెల శివప్రసాద్ ముఖ్య అనుచరులుగా ఉన్న నాయకులందరూ నేటి వరకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి నైరాశ్యంతో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గాల్లో నేతలు అస్సలు స్థానిక ఎన్నికలను పట్టించుకోలేదు. విశాఖ జిల్లాలోని అరకు, విశాఖ లోక్‌సభ , పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించటంతో ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్న టీ డీపీ నేతలు కాడి కిండ పడేశారు. దీంతో తాజాగా టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు ఏదో చేశామనిపించేందుకు కొద్దిగా హడావుడి చేశారు.
ఎక్కడా ఆశాజనకంగా లేదు..!
మిగిలిన జిల్లాల్లో కూడా పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. బీజేపీతో పొత్తు, వరుసగా కాంగ్రెస్ నేతల చేరిక అనంతరం పరిస్థితి ఎలా ఉందోనని టీడీపీ అధినేత సర్వేలు చేయించారు. అయితే ఎక్కడ కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదన్న సమాచారం ఆ పార్టీ నేతలను కుంగదీసింది. బీజేపీతో పొత్తు ఫలిస్తుందని, మోడీ హవా ఉందన్న ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఫలితాలు సానుకూలంగా లేకపోవటం టీడీపీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోందని పార్టీ వర్గాలు చెప్పాయి.
13 జెడ్‌పీలూ మావే: వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా
సీమాంధ్రలోని 13 జిల్లాల్లో శనివారం మొత్తం 319 జెడ్‌పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అనేక రకాలుగా తెప్పించుకున్న నివేదికల మేరకు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం, పార్టీ నేతల విశ్లేషణల మేరకు 190కి పైగా జెడ్‌పీటీసీలను సునాయాసంగా గెలుచుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ అంచనాకొచ్చింది.
తమకు అందిన అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించుకుని విశ్లేషిస్తే మొత్తం స్థానాల్లో 50 చోట్ల పోటాపోటీగా ఎన్నికలు జరిగాయని, మిగతా చోట్ల మెజారిటీ స్థానాల్లో పోలింగ్ సరళి ఏకపక్షంగా కనిపించిందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఒకరు పేర్కొన్నారు. 13 జిల్లా పరిషత్‌లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక చోట్ల అభ్యర్థులను పోటీ పెట్టలేకపోగా.. పోటీ చేసిన కొన్ని స్థానాల్లో సైతం ప్రచారం నుంచే వెనుకబడిపోయారు. కాంగ్రెస్ ప్రభావం చెప్పుకోవటానికి కూడా లేదని ఆ పార్టీ వర్గాలే కాదు.. ప్రత్యర్థి పార్టీలు సైతం స్పష్టంచేస్తున్నాయి.
టీడీపీలో ‘లోకల్’ గుబులు
Published Sat, Apr 12 2014 1:09 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement