tension in TDP
-
మార్పుకే మొగ్గు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో అసంతృప్తుల గోల నుంచి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు నియోజకవర్గాల సిట్టింగ్‌లను మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇచ్చిన ఫార్ములాకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రెండు రోజుల జిల్లా పర్యటనలో సంతనూతలపాడు, యర్రగొండపాలెం, కొండపి, మార్కాపురం నియోజకవర్గాల పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా అసంతృప్తుల గోల ఆయన్ను తలపట్టుకునేలా చేసింది. సిట్టింగ్‌లను మార్చాల్సిందేనంటూ అసంతృప్త నేతలు, మారిస్తే సంగతి తేలుస్తామంటూ సిట్టింగ్‌లు పరస్పర ఆరోపణలకు దిగడం ముఖ్యమంత్రిని మరింత ఇరుకున పెట్టింది. మెజార్టీ సభ్యుల అభిప్రాయాల మేరకు సిట్టింగ్‌లను మార్చాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. యర్రగొండపాలెం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే డేవిడ్‌రాజుపై ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ పాత నేతలు సీఎం ఎదుటే పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగారు. దీంతో వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజును తప్పించి కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి దేవానంద్‌తో పాటు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన అజితారావు ఇటీవల సీఎంను కలిసి తనకు సీటు ఇవ్వాలంటూ కోరినట్లు తెలుస్తోంది. అజితారావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండడంతో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం నిర్ణయించారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ మాగుంట సూచించిన అభ్యర్థికే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన దేవానంద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సంతనూతలపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజును రాబోయే ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని వారంతా ప్రణాళిక ప్రకారం సిద్ధంగా ఉన్నారు. ఇందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు మరి కొందరు నేతలు మద్ధతు పలుకుతున్నారు. సంతనూతలపాడు నుంచి డేవిడ్‌రాజును పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంతనూతలపాడు మినహా తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ తేల్చి చెబుతున్నారు. బీఎన్ అభ్యర్థిత్వాన్ని సీఎం తిరస్కరించే పక్షంలో బీఎన్ పార్టీని వీడతారన్న ప్రచారం సాగుతోంది. ఇక పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం నియోజకవర్గంపై టీడీపీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కందుల నారాయణరెడ్డిని తప్పించి వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు మాగుంట ఫార్ములా సైతం దోహదం చేసినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఇన్ఫోటెక్‌కు చెందిన అశోక్‌రెడ్డిని మార్కాపురం టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. అయితే కందులను ఒప్పించి ఈ నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కందుల ఒకే అంటారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు ఒంగోలు పార్లమెంటుకు కొత్త అభ్యర్థి దొరికే పక్షంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మార్కాపురం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక కొండపిలో ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని బలమైన వర్గం వ్యతిరేకిస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ సైతం ఇందుకు మద్ధతు పలుకుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావును అభ్యర్థిగా నిలిపేందుకు సీఎం మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఇక కనిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును తప్పించి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉక్కు ఉగ్ర నర్సింహారెడ్డిని అభ్యర్థిగా నిలుపుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం ఉగ్రకు హామీ ఇచ్చినట్లు ప్రచారమూ ఉంది. కాదు కూడదంటే ఎమ్మెల్యే బాబూరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు సీఎం సిద్ధమైనట్లు సమాచారం. అయితే సిట్టింగ్‌లను ఒప్పించి సీఎం అభ్యర్థుల మార్పు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సిట్టింగ్‌ల మార్పును ఇప్పటికే ఎమ్మెల్యేలు బాబూరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారిని మారిస్తే టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. కరణంతో తలనొప్పులు తప్పవా..? రెండు రోజుల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలతో పాటు పశ్చిమ ప్రకాశం పరిధిలోని మార్కాపురం నియోజకవర్గ సమీక్ష మాత్రమే నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సాధించింది శూన్యం. అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని, అందరూ కలిసి పనిచేయాల్సిందేనని ముఖ్యమంత్రి తేల్చి చెబుతున్నారు. వర్గ విభేదాలతో రోడ్డెక్కిన అసమ్మతి వర్గానికి ఇది రుచించలేదు. ఒక వేళ సీఎం సిట్టింగ్‌లను మారిస్తే వారంతా తలొంచుకుని ఆయన చెప్పినట్లు వినే అవకాశం లేదు. ఎదురుతిరిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం 4 నియోజకవర్గాల సమీక్ష మాత్రమే పూర్తయింది. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి త్వరలోనే ఆయన సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అద్దంకి, పర్చూరు, దర్శి నియోజకవర్గాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. సిట్టింగ్‌లకు సీట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు.కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా రాబోయే ఎన్నికల్లో ఆయన తనయుడు కరణం వెంకటేష్‌కు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని కరణం బలరాం కరాఖండిగా చెబుతున్నారు. వెంకటేష్ భవితవ్యం తాను చూసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరణం వెంకటేష్‌కు ఏ నియోజకవర్గం నుంచి సీటు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ వెంకటేష్‌కు సీటు ఇవ్వని పక్షంలో కరణం ఊరుకునే పరిస్థితి కానరావడం లేదు. కొడుకు రాజకీయ భవిష్యత్తే ఆయనకు మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. వెంకటేష్‌కు సీటు దక్కని పరిస్థితుల్లో ముక్కు సూటిగా వ్యవహరించే బలరాం అమీ తుమీకి సిద్ధపడడం ఖాయం. అదే జరిగితే జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. బలరాం వ్యవహారం సీఎంకు తలనొప్పులు తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. మాగుంటకు పెరిగిన ప్రాధాన్యం: ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాగుంటకు ప్రాధాన్యం పెంచారు. మరోవైపు ఎమ్మెల్సీ మాగుంట పార్టీని వీడతారన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆయనకు విపరీతమైన ప్రాధాన్యత కల్పిస్తూ హడావిడి చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. మాగుంటకు పెద్ద పీట వేయడాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. ఈ నేపథ్యంలో పాతకాపులంతా అదును కోసం ఎదురు చూస్తున్నారు. సీఎంకు తలనొప్పులు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి
పుత్తూరు: నగరి టీడీపీ ఇన్చార్జి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులతో సీఎం చంద్రబాబునాయుడు శనివారం రాజధాని అమరావతిలో సమావేశమయ్యారు. ఇన్చార్జి పదవి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చకుండానే వాయిదా వేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందిన తరువాత ఆయన ఇద్దరు కుమారుల మధ్య ఆధిపత్యపోరుతో టీడీపీ కేడర్ వర్గాలుగా చీలిపోయింది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుల అభ్యర్థన మేరకు శనివారం సమావేశానికి అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముద్దు కుటుంబానికి క్లాస్ అభిప్రాయ సేకరణ అనంతరం నాయకులతో మాట్లాడిన చంద్రబాబునాయుడు ముద్దుక్రిష్ణమనాయుడి కుటుంబానికి క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముద్దు పెద్ద కుమారుడు భానుప్రకాష్, తల్లి గాలి సరస్వతమ్మ మధ్య విభేదా లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే ఇద్దరి కుమారుల మధ్య ఉన్న విభేదాలపైనా అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు వేర్వేరుగా నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలకు హాజరవుతుండడంపై పార్టీ మండల అధ్యక్షులను నిలదీశారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కఠినంగా చెప్పారు. కుటుంబం ఏకాభిప్రాయంతో రావాలని సూచించారు. అందుకుగాను ఆదివారం సాయంత్రం వరకు గడువు విధించారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగానే పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ కలుగజేసుకుని ఏకాభిప్రాయంతో వస్తే పార్టీ అభ్యర్థిత్వం ముద్దు కుటుంబానికే కేటాయిస్తారా..? అని అన్నట్టు తెలిసింది. కలిసి వస్తే పరిశీలిస్తానని సర్ది చెప్పినట్లు సమాచారం. ముఖ్య నాయకులతో సమావేశం ముగించుకున్న అధినేత బయట ఉన్న కేడర్‌తో మాట్లాడిన సమయంలోనూ ఇన్చార్జి విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదని తెలిసింది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినా గెలిపించి ముద్దుకృష్ణమకు ఘనంగా నివాళులర్పించాలని ముక్తాయించి నట్లు సమాచారం. ఈ మాత్రం దానికి సమావేశం నిర్వహించడం ఎందుకని టీడీపీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అన్నదమ్ముల మధ్య ఆదివారం సాయంత్రంలోపు సయోధ్య కుదిరినప్పటికీ అభ్యర్థిత్వంపై అధినేత తేల్చడనే మాటలు టీడీపీ కేడర్ నుంచి వినిపిస్తోంది. అభిప్రాయ సేకరణ టీడీపీ అధినేత తన సహజ వైఖరి నాన్చుడు దోరణిని మరోసారి విజయవంతంగా ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులతో ఉండవల్లిలో శనివారం అధినేత సమావేశం కానున్నట్లు ముందురోజు సమాచారం అందింది. నియోజకవర్గ ఇన్చార్జి పదవిపై విస్పష్ట ప్రకటన ఉంటుందని భావించిన ముద్దుక్రిష్ణమనాయుడి ఇద్దరు కుమారులు సమావేశానికి మందీమార్బలంతో హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, రాష్ట్ర నాయకుడు టీడీ జనార్దన్ అభిప్రాయ సేకరణ జరిపారు. నియోజకవర్గంలోని 5 మండలాలు, రెండు మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్‌తోపాటు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్‌రాజు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు రమేష్‌చంద్రప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి విజయబాబు తదితరులతో అభిప్రాయాలు సేకరించారు. -
టీడీపీలో ‘లోకల్’ గుబులు
* స్థానిక ఎన్నికల సరళితో బెంబేలెత్తుతున్న పార్టీ నేతలు * క్షేత్రస్థాయి నివేదికలు, పార్టీ నేతల విశ్లేషణలతో నైరాశ్యం * అత్యధిక స్థానాల్లో టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉందని సర్వేల వెల్లడి * ముఠా పోరుకు తోడు కాంగ్రెస్ నేతలతోనూ పొసగని వైనం * బీజేపీకి కేటాయించిన స్థానాల్లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు * నేడు సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు * టీడీపీ అభ్యర్థుల్లో గుబులు * అత్యధిక స్థానాలు తమవేనని వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా * 13 జిల్లా పరిషత్‌లూ తమకే ఖాయమంటున్న నేతలు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం జారీ అవుతున్న నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల సరళి తెలుగుదేశం పార్టీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ముగిసిన మునిసిపల్, పంచాయతీరాజ్ సంస్థల తొలివిడత ఎన్నికలతో పాటు శుక్రవారంతో పూర్తయిన రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో.. టీడీపీ ప్రభావం నామమాత్రమేనని క్షేత్రస్థాయి నివేదికలు, పార్టీ నేతల విశ్లేషణలు స్పష్టం చేస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ మరింత ముదిరింది. శనివారం నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్న దశలో.. తాజాగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల మినహా సీమాంధ్రలోని 13 జిల్లాల్లోనూ పార్టీ ప్రభావం చెప్పుకోదగినంతగా లేదన్న వార్తలు టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న టీడీపీ నేతల్లో ఈ పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ‘పంచాయతీ’లో పడిపోయాం..! ఇటీవల ముగిసిన మున్సిపల్, తొలివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సేకరించిన సమాచారంతో పాటు తాజాగా ముగిసిన ెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వివరాలను తెప్పించుకున్న రాజకీయ పార్టీలు వాటిని విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. పార్టీ నేతలకు అందిన క్షేత్రస్థాయి నివేదికల మేరకు కృష్ణా, విజయనగరం జిల్లాల్లో మినహాయిస్తే మిగిలిన చోట ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయామని టీడీపీ నేతలు నిర్ధారణకు వచ్చారు. కొన్ని చోట్ల పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ.. అత్యధిక స్థానాల్లో పార్టీ ప్రభావం నామమాత్రంగానే ఉందని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి అందిన సమాచారంగా తెలుస్తోంది. ఈ సమాచారం టీడీపీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నేతల మధ్య గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఆ తగాదాల ప్రభావం ఎన్నికలపై స్పష్టంగా కనిపించిందని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి చేరిన నేతల నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య రాజుకున్న అంతర్గత పోరు కూడా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపినట్లు అంచనాకొచ్చారు. బీజేపీకి కేటాయించిన పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి పోటీ చేయాలని భావించిన టీడీపీ నేతలు పూర్తిగా చెతులెత్తేసినట్టు సమాచారం. ఒక ఒరలో రెండు కత్తుల పోరు... సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు టీడీ పీలో చేరారు. దీంతో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రెండు, మూడుగా ఉన్న గ్రూపులు ఇపుడు రెట్టింపయ్యాయి. ఒక వర్గంపై మరో వర్గం కత్తులు దూస్తోంది. రాయలసీమలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గతంలోకాంగ్రెస్, టీడీపీల మధ్య వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు పలు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరటంతో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేకపోతున్నాయని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. కోస్తా ప్రాంతంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలను కలుపుకుని వెళ్లేందుకు దీర్ఘకాలంగా ఆ పార్టీలో కొనసాగుతున్న టీడీపీ నేతలు అంగీకరించటం లేదు. ఒకవేళ కాంగ్రెస్ వారిని తమతో సమానంగా ప్రోత్సహిస్తే ఏకు మేకు అవుతారన్న భయంతో స్థానిక ఎన్నికల సమయంలో కలుపుకుని వెళ్లకుండా పక్కన పెట్టేశారని చెప్తున్నారు. తాజాగా జరిగిన పురపాలక, పంచాయతీ ఎన్నికల్లో రెండు గ్రూపుల మధ్య ఈ అంతరం స్పష్టంగా కనిపించింది. స్థానిక ఎన్నికల నిమిత్తం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ మంత్రి గల్లా అరుణను చంద్రబాబు నియమించారు. ఆమె కాంగ్రెస్ నేతలందరికీ పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు. దీంతో తొలి నుంచి టీడీపీలో పనిచేస్తున్న నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి మధ్య విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. గతంలో సోమిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లి నియోజకవర్గానికి ఇపుడు ఆదాల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో ఎవరి గ్రూపును వారు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీకి ఇచ్చిన సీట్లలో కాడి పడేసిన తమ్ముళ్లు... బీజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మొదటే చేతులె త్తేశారు. ఈ నెల ఆరో తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న సమయంలో నరసరావుపేట అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించారని ప్రచారం మొదలుకావడంతో టీడీపీ నేతలు నిరాశతో పొలింగ్ మధ్యలో వెనుతిరిగారు. అక్కడ ఎంతో కాలం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న కోడెల శివప్రసాద్ ముఖ్య అనుచరులుగా ఉన్న నాయకులందరూ నేటి వరకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి నైరాశ్యంతో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గాల్లో నేతలు అస్సలు స్థానిక ఎన్నికలను పట్టించుకోలేదు. విశాఖ జిల్లాలోని అరకు, విశాఖ లోక్‌సభ , పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించటంతో ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్న టీ డీపీ నేతలు కాడి కిండ పడేశారు. దీంతో తాజాగా టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు ఏదో చేశామనిపించేందుకు కొద్దిగా హడావుడి చేశారు. ఎక్కడా ఆశాజనకంగా లేదు..! మిగిలిన జిల్లాల్లో కూడా పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. బీజేపీతో పొత్తు, వరుసగా కాంగ్రెస్ నేతల చేరిక అనంతరం పరిస్థితి ఎలా ఉందోనని టీడీపీ అధినేత సర్వేలు చేయించారు. అయితే ఎక్కడ కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదన్న సమాచారం ఆ పార్టీ నేతలను కుంగదీసింది. బీజేపీతో పొత్తు ఫలిస్తుందని, మోడీ హవా ఉందన్న ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఫలితాలు సానుకూలంగా లేకపోవటం టీడీపీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోందని పార్టీ వర్గాలు చెప్పాయి. 13 జెడ్పీలూ మావే: వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో శనివారం మొత్తం 319 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అనేక రకాలుగా తెప్పించుకున్న నివేదికల మేరకు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం, పార్టీ నేతల విశ్లేషణల మేరకు 190కి పైగా జెడ్పీటీసీలను సునాయాసంగా గెలుచుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ అంచనాకొచ్చింది. తమకు అందిన అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించుకుని విశ్లేషిస్తే మొత్తం స్థానాల్లో 50 చోట్ల పోటాపోటీగా ఎన్నికలు జరిగాయని, మిగతా చోట్ల మెజారిటీ స్థానాల్లో పోలింగ్ సరళి ఏకపక్షంగా కనిపించిందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఒకరు పేర్కొన్నారు. 13 జిల్లా పరిషత్‌లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక చోట్ల అభ్యర్థులను పోటీ పెట్టలేకపోగా.. పోటీ చేసిన కొన్ని స్థానాల్లో సైతం ప్రచారం నుంచే వెనుకబడిపోయారు. కాంగ్రెస్ ప్రభావం చెప్పుకోవటానికి కూడా లేదని ఆ పార్టీ వర్గాలే కాదు.. ప్రత్యర్థి పార్టీలు సైతం స్పష్టంచేస్తున్నాయి.