సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో అసంతృప్తుల గోల నుంచి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు నియోజకవర్గాల సిట్టింగ్‌లను మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇచ్చిన ఫార్ములాకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రెండు రోజుల జిల్లా పర్యటనలో సంతనూతలపాడు, యర్రగొండపాలెం, కొండపి, మార్కాపురం నియోజకవర్గాల పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా అసంతృప్తుల గోల ఆయన్ను తలపట్టుకునేలా చేసింది. సిట్టింగ్‌లను మార్చాల్సిందేనంటూ అసంతృప్త నేతలు, మారిస్తే సంగతి తేలుస్తామంటూ సిట్టింగ్‌లు పరస్పర ఆరోపణలకు దిగడం ముఖ్యమంత్రిని మరింత ఇరుకున పెట్టింది. మెజార్టీ సభ్యుల అభిప్రాయాల మేరకు సిట్టింగ్‌లను మార్చాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
యర్రగొండపాలెం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే డేవిడ్‌రాజుపై ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ పాత నేతలు సీఎం ఎదుటే పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగారు. దీంతో వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజును తప్పించి కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి దేవానంద్‌తో పాటు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన అజితారావు ఇటీవల సీఎంను కలిసి తనకు సీటు ఇవ్వాలంటూ కోరినట్లు తెలుస్తోంది. అజితారావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండడంతో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం నిర్ణయించారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ మాగుంట సూచించిన అభ్యర్థికే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన దేవానంద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సంతనూతలపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజును రాబోయే ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని వారంతా ప్రణాళిక ప్రకారం సిద్ధంగా ఉన్నారు. ఇందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు మరి కొందరు నేతలు మద్ధతు పలుకుతున్నారు. సంతనూతలపాడు నుంచి డేవిడ్‌రాజును పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంతనూతలపాడు మినహా తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ తేల్చి చెబుతున్నారు. బీఎన్ అభ్యర్థిత్వాన్ని సీఎం తిరస్కరించే పక్షంలో బీఎన్ పార్టీని వీడతారన్న ప్రచారం సాగుతోంది. ఇక పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం నియోజకవర్గంపై టీడీపీలో అంతర్మథనం కొనసాగుతోంది.
ఎట్టి పరిస్థితుల్లో కందుల నారాయణరెడ్డిని తప్పించి వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు మాగుంట ఫార్ములా సైతం దోహదం చేసినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఇన్‌ఫోటెక్‌కు చెందిన అశోక్‌రెడ్డిని మార్కాపురం టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. అయితే కందులను ఒప్పించి ఈ నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కందుల ఒకే అంటారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు ఒంగోలు పార్లమెంటుకు కొత్త అభ్యర్థి దొరికే పక్షంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మార్కాపురం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక కొండపిలో ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని బలమైన వర్గం వ్యతిరేకిస్తోంది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ సైతం ఇందుకు మద్ధతు పలుకుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావును అభ్యర్థిగా నిలిపేందుకు సీఎం మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఇక కనిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును తప్పించి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉక్కు ఉగ్ర నర్సింహారెడ్డిని అభ్యర్థిగా నిలుపుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం ఉగ్రకు హామీ ఇచ్చినట్లు ప్రచారమూ ఉంది. కాదు కూడదంటే ఎమ్మెల్యే బాబూరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు సీఎం సిద్ధమైనట్లు సమాచారం. అయితే సిట్టింగ్‌లను ఒప్పించి సీఎం అభ్యర్థుల మార్పు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సిట్టింగ్‌ల మార్పును ఇప్పటికే ఎమ్మెల్యేలు బాబూరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారిని మారిస్తే టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది.
కరణంతో తలనొప్పులు తప్పవా..?
రెండు రోజుల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలతో పాటు పశ్చిమ ప్రకాశం పరిధిలోని మార్కాపురం నియోజకవర్గ సమీక్ష మాత్రమే నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సాధించింది శూన్యం. అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని, అందరూ కలిసి పనిచేయాల్సిందేనని ముఖ్యమంత్రి తేల్చి చెబుతున్నారు. వర్గ విభేదాలతో రోడ్డెక్కిన అసమ్మతి వర్గానికి ఇది రుచించలేదు.
ఒక వేళ సీఎం సిట్టింగ్‌లను మారిస్తే వారంతా తలొంచుకుని ఆయన చెప్పినట్లు వినే అవకాశం లేదు. ఎదురుతిరిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం 4 నియోజకవర్గాల సమీక్ష మాత్రమే పూర్తయింది. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి త్వరలోనే ఆయన సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అద్దంకి, పర్చూరు, దర్శి నియోజకవర్గాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. సిట్టింగ్‌లకు సీట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు.కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా రాబోయే ఎన్నికల్లో ఆయన తనయుడు కరణం వెంకటేష్‌కు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని కరణం బలరాం కరాఖండిగా చెబుతున్నారు.
వెంకటేష్ భవితవ్యం తాను చూసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరణం వెంకటేష్‌కు ఏ నియోజకవర్గం నుంచి సీటు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ వెంకటేష్‌కు సీటు ఇవ్వని పక్షంలో కరణం ఊరుకునే పరిస్థితి కానరావడం లేదు. కొడుకు రాజకీయ భవిష్యత్తే ఆయనకు మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. వెంకటేష్‌కు సీటు దక్కని పరిస్థితుల్లో ముక్కు సూటిగా వ్యవహరించే బలరాం అమీ తుమీకి సిద్ధపడడం ఖాయం. అదే జరిగితే జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. బలరాం వ్యవహారం సీఎంకు తలనొప్పులు తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు.
మాగుంటకు పెరిగిన ప్రాధాన్యం:
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాగుంటకు ప్రాధాన్యం పెంచారు. మరోవైపు ఎమ్మెల్సీ మాగుంట పార్టీని వీడతారన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆయనకు విపరీతమైన ప్రాధాన్యత కల్పిస్తూ హడావిడి చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. మాగుంటకు పెద్ద పీట వేయడాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. ఈ నేపథ్యంలో పాతకాపులంతా అదును కోసం ఎదురు చూస్తున్నారు. సీఎంకు తలనొప్పులు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment