పుత్తూరు: నగరి టీడీపీ ఇన్‌చార్జి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులతో సీఎం చంద్రబాబునాయుడు శనివారం రాజధాని అమరావతిలో సమావేశమయ్యారు. ఇన్‌చార్జి పదవి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చకుండానే వాయిదా వేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందిన తరువాత ఆయన ఇద్దరు కుమారుల మధ్య ఆధిపత్యపోరుతో టీడీపీ కేడర్ వర్గాలుగా చీలిపోయింది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుల అభ్యర్థన మేరకు శనివారం సమావేశానికి అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ముద్దు కుటుంబానికి క్లాస్
అభిప్రాయ సేకరణ అనంతరం నాయకులతో మాట్లాడిన చంద్రబాబునాయుడు ముద్దుక్రిష్ణమనాయుడి కుటుంబానికి క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముద్దు పెద్ద కుమారుడు భానుప్రకాష్, తల్లి గాలి సరస్వతమ్మ మధ్య విభేదా లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే ఇద్దరి కుమారుల మధ్య ఉన్న విభేదాలపైనా అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు వేర్వేరుగా నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలకు హాజరవుతుండడంపై పార్టీ మండల అధ్యక్షులను నిలదీశారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కఠినంగా చెప్పారు. కుటుంబం ఏకాభిప్రాయంతో రావాలని సూచించారు.
అందుకుగాను ఆదివారం సాయంత్రం వరకు గడువు విధించారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగానే పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ కలుగజేసుకుని ఏకాభిప్రాయంతో వస్తే పార్టీ అభ్యర్థిత్వం ముద్దు కుటుంబానికే కేటాయిస్తారా..? అని అన్నట్టు తెలిసింది. కలిసి వస్తే పరిశీలిస్తానని సర్ది చెప్పినట్లు సమాచారం. ముఖ్య నాయకులతో సమావేశం ముగించుకున్న అధినేత బయట ఉన్న కేడర్‌తో మాట్లాడిన సమయంలోనూ ఇన్‌చార్జి విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదని తెలిసింది.
ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినా గెలిపించి ముద్దుకృష్ణమకు ఘనంగా నివాళులర్పించాలని ముక్తాయించి నట్లు సమాచారం. ఈ మాత్రం దానికి సమావేశం నిర్వహించడం ఎందుకని టీడీపీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అన్నదమ్ముల మధ్య ఆదివారం సాయంత్రంలోపు సయోధ్య కుదిరినప్పటికీ అభ్యర్థిత్వంపై అధినేత తేల్చడనే మాటలు టీడీపీ కేడర్ నుంచి వినిపిస్తోంది.
అభిప్రాయ సేకరణ
టీడీపీ అధినేత తన సహజ వైఖరి నాన్చుడు దోరణిని మరోసారి విజయవంతంగా ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులతో ఉండవల్లిలో శనివారం అధినేత సమావేశం కానున్నట్లు ముందురోజు సమాచారం అందింది. నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిపై విస్పష్ట ప్రకటన ఉంటుందని భావించిన ముద్దుక్రిష్ణమనాయుడి ఇద్దరు కుమారులు సమావేశానికి మందీమార్బలంతో హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, రాష్ట్ర నాయకుడు టీడీ జనార్దన్ అభిప్రాయ సేకరణ జరిపారు. నియోజకవర్గంలోని 5 మండలాలు, రెండు మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్‌తోపాటు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్‌రాజు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు రమేష్‌చంద్రప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి విజయబాబు తదితరులతో అభిప్రాయాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment