ఎంపీపీ పీఠానికి త్రిముఖ పోటీ!
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్ : మహిళకు కేటాయించిన ఆమదాలవలస మండలాధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరికి వారే ఈ పదవిని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్‌టీవాడ ఎంపీటీసీ సభ్యురాలు కొరుకొండ ఇందుమతి, కొర్లకోట సభ్యురాలు సువ్వారి రూపవతి, చీమలవలస సభ్యురాలు సనపల పద్మావతి ఎంపీపీ పీఠం కోసం పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మండలంలోని అధిక ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలిచింది. కలివరం నుంచి వైఎస్‌ఆర్ సీపీ తరఫున బరిలోకి దిగిన తమ్మినేని ఇందువతమ్మని తొలుత ఎంపీపీ అభ్యర్థిగా సూచాయగా ప్రకటించారు.
అయితే ఆ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం, ఇందువతమ్మ ఓటమి పాలవడంతో మిగిలిన సభ్యుల్లో ఎంపీపీ పదవిపై ఆశలు రేకెత్తాయి. కోరుకొండ ఇందుమతి కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం, ఆమె భర్త జీకేవలస సర్పంచ్ రమణ మాజీమంత్రి తమ్మినేని అనుచరుడు కావడంతో ఎంపీపీ పదవి ఇందుమతికి దక్కే అవకాశం ఉందనే గురగుసలు వినిపిస్తున్నాయి. అలాగే జెడ్పీటీసీ సభ్యురాలు బంధువుగా, సీతారాంకు కష్టకాలంలో అండగా ఉంటూ.. కొర్లకోట ఎంపీటీసీ స్థానంలో గెలుపొందిన సువ్వారి రూపవతికి కూడా పదవి దక్కే అవకాశం మెండగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరితోపాటు చీమలవలస సర్పంచ్ జి. శ్రీనివాసరావు వైఎస్‌ఆర్‌సీపీలో తమ్మినేని చేరినప్పటి నుంచి ఆయన వెంటే ఉంటున్నారు. దీంతో ఇదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు పద్మవతికి ఎంపీపీ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందో కొద్దిరోజులు వేచి చూడాలి.