కొత్తగూడెం: ఇప్పటికే నియోజకవర్గంలో చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకత్వలోపం మరోమారు బహిర్గతమైంది. మెజార్టీ ఉన్నా ఎంపీపీ పదవిని కూడా గెలుచుకోలేక చతికిలపడింది. కొత్తగూడెం మండల పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 14 ఎంపీటీసీలను గెలుచుకుంది. దీంతో ఎంపీపీ అధ్యక్షపీఠం ఇక హస్తగతమేనని అందరూ అనుకున్నారు.
ఇక సీపీఐకి 9, వైఎస్సార్‌సీపీకి 3, టీడీపీకి 2, సీపీఎంకు 2 ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. ఎంపీపీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ అయి, ఈనెల 6న ఎన్నిక జరగాల్సి ఉండగా అనూహ్య రీతిలో సీపీఐ తరపున తన ఎంపీపీ అభ్యర్థిని ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించగా అంతర్గతంగా సయోధ్య కుదరకపోవడంతో మరో కాంగ్రెస్ ఎంపీటీసీ కూడా పోటీకి దిగారు. దీంతో ఆరోజు ఎన్నిక వాయిదా పడింది.
మరుసటిరోజు కూడా అదే పరిస్థితి నెలకొనడం, అనూహ్యంగా మరొక కాంగ్రెస్ ఎంపీటీసీ కూడా ఎంపీపీ అధ్యక్ష పీఠంపై కన్నేయడంతో కాంగ్రెస్‌లో త్రిముఖ పోటీ ఏర్పడింది. మొత్తం 31 మంది ఎంపీటీసీలు ఉన్న కొత్తగూడెంలో 16 మంది సభ్యుల మద్దతు కూడగట్టిన వారికే ఎంపీపీ పీఠం దక్కే అవకాశం ఉంది. కాగా 14 ఎంపీటీసీ స్థానాలున్న కాంగ్రెస్ మరో ఇద్దరు ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీని చేజిక్కించుకునే అవకాశాలుండగా 9 మంది ఎంపీటీసీలు ఉన్న సీపీఐ సైతం ఎంపీపీపై కన్నేసింది.
అభ్యర్థి ఎంపికలో జాప్యం..
కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంపీపీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో జాప్యం చేయడంతో ఆ పార్టీ ఎంపీటీసీల్లో అయోమయం నెలకొంది. ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉండిపోయింది. ఇక అభ్యర్థిని ప్రకటించడంలో సైతం తీవ్ర జాప్యం జరగడంతో పలువురు ఎంపీటీసీలు ఇతర పార్టీలవైపు చూశారు.
సీతంపేటకు చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ లక్ష్మినారాయణ సీపీఐ అభ్యర్థికి మద్దతు తెలపడంతో చేజేతులారా ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకున్నట్టయింది. కాంగ్రెస్ పెద్దలు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో విఫలం కావడంతోపాటు సొంత పార్టీలో కుమ్ములాటలు కూడా పరిష్కరించలేని స్థితి నెలకొంది. నాలుగురోజుల క్రితం ఇతర పార్టీల ఎంపీటీసీల మద్దతుతో 16 మందితో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చివరకు అభ్యర్థి ఎంపిక జాప్యం జరగడంతో డీలాపడాల్సి వచ్చింది.
‘చే’జారిన ఎంపీపీ
Published Thu, Aug 14 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement