ఫలించిన టీడీపీ కుతంత్రం | Telugu Desam Party machinations in Eluru | Sakshi
Sakshi News home page

ఫలించిన టీడీపీ కుతంత్రం

Published Mon, Jul 14 2014 2:45 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

ఫలించిన టీడీపీ కుతంత్రం - Sakshi

ఫలించిన టీడీపీ కుతంత్రం

సాక్షి, ఏలూరు : కుట్రలు కుతంత్రాలే ఫలిం చాయి. స్పష్టమైన ఆధిక్యం ఉన్న వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీకి పదవి దక్కకుండా చేయాలని కుయుక్తులు పన్నిన టీడీపీ దేవరపల్లి ఎంపీపీ పీఠాన్ని వైసీపీ నుంచి తన్నుకుపోయింది. టీడీపీ దౌర్జన్యాల నేపథ్యంలో వాయిదా వేసిన దేవరపల్లి ఎంపీపీ ఎన్నికను ఆదివారం నిర్వహిం చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బెదిరించడంతో పాటు ప్రలోభాలకు గురిచేసి ఇద్దరిని తమవైపునకు తిప్పుకున్న టీడీపీ లాటరీ విధానంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలోని మొత్తం 22 స్థానాలకు 12 సీట్లు గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస స్పష్టమైన మెజార్టీ సాధించగా, టీడీపీకి 9 స్థానాలు లభించాయి. ఒక స్థానంలో గెలుపొందిన స్వత్రంత్ర అభ్యర్థి వైసీపీకే మద్దతు ఇవ్వటంతో ఆ పార్టీ బలం 13కు చేరింది.
 
 ఈ పీఠాన్ని వైసీపీకి దక్కకుండా చేసేందుకుగాను పన్నిన వ్యూహంలో భాగంగా ఈ నెల 4న ఎంపీపీ ఎన్నిక సమయంలో టీడీపీ చేసిన దౌర్జన్యకాండతో ఎన్నిక వాయిదా పడింది. ఈ లోగా వైసీపీ అభ్యర్థులను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయటం వంటి వాటి తో ఇద్దరిని తమవైపు లాక్కోవటంలో టీడీపీ నాయకత్వం సఫలమైంది.పలువురు మంత్రుల బెదిరిం పులు, ప్రలోభాల మేరకు జిల్లా క్వారీక్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆండ్రు రమేష్‌బాబు వైసీపీకి వెన్నుపోటు పొడిచారు. వైఎస్సార్ సీపీకి చెందిన లక్ష్మీపురం ఎంపీటీసీ పోలుమాటి విజయనిర్మల, గౌరీపట్నం-1 ఎంపీటీసీ చెరుకూరి కృష్ణకుమారిలను టీడీపీవైపు తిరిగిపోయారు. దీంతో వైసీపీ, టీడీపీలకు సమానంగా 11 మంది ఎంపీటీసీ సభ్యులయ్యారు.
 
 ఆర్వోతో టీడీపీ సభ్యుల వాగ్వివాదం
 ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపీటీసీ సభ్యులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించేందుకు రిటర్నింగ్ అధికారి ఆర్.గోవిందరావు సమాయత్తమయ్యారు. ఆ సమయంలో తమ పార్టీ సభ్యులు ఇద్దరు రావాల్సి ఉన్నందున ఎన్నిక ప్రక్రియను కొద్ది సేపు నిలపాలని టీడీపీకి చెందిన ఎంపీటీసీలు ఆర్‌వోను కోరారు. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని ఆర్‌వో స్పష్టం చేయడంతో వారు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎన్నికల హాల్‌లోకి పోలీసులు రావడంపై గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు గది బయటకు వెళ్లిపోయారు.
 
 అనంతరం ప్రమాణ స్వీకారం కొనసాగింది. కొంత సేపటికి రిమాండ్‌లో ఉన్న టీడీపీ ఎంపీటీసీలు ఇద్దరూ వచ్చారు. తర్వాత కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ నుంచి అక్బర్ పఠాన్ ఖాన్, టీడీపీ నుంచి షేక్ అబ్దుల్‌ఘని పేర్లు ప్రతిపాదించగా ఇద్దరికి చెరో 11 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో ఎన్నికను లాటరీ పద్ధతిలో నిర్వహించాల్సి వచ్చింది. రిటర్నింగ్ అధికారి లాటరీ తీశారు. ఇద్దరి పేర్లు ఐదు చీటీలపై రాసి లాటరీ తీయగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి అక్బర్ పఠాన్‌ఖాన్‌ను పదవి వరించింది. ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
 
 మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీపీ పదవికి వైఎస్సార్ సీపీ నుంచి పల్లంట్ల ఎంపీటీసీ గన్నమని జనార్దనరావు, టీడీపీ నుంచి దేవరపల్లి ఎంపీటీసీ శ్రీకాకోళపు నరసింహమూర్తి పోటీపడ్డారు. టీడీపీకి, వైఎస్సార్ సీపీకి చెరో 11 మంది ఎంపీటీసీ సభ్యుల బలం లభించింది. లాటరీ తీయగా  టీడీపీ అభ్యర్ధి నర్శింహమూర్తిని అదృష్టం వరించింది. ఉపాధ్యక్ష ఎన్నికకు వైఎస్సార్ సీపీ నుంచి బొంత భరత్‌బాబు, టీడీపీ నుంచి బాదంపూడి ఇందిర పేర్లు ప్రతిపాధించగా లాటరీలో బాదంపూడి ఇందిరకు పదవి లభించింది.
 
 ఈ నెల 4న ఎంపీపీ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారిపై దాడి చేసిన ఘటనపై  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ సభ్యులు బి.ఇందిర, సీహెచ్.నాగమణిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో వారికి కోర్టు రిమాండ్ విధించింది. అప్పుడు నిలిచిన ఎన్నిక భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం నిర్వహించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement