
కాలం
జీవన కాలమ్
ఇప్పుడిప్పుడు 90 నుంచి 100 సంవత్సరాలు బతుకు తున్నవారిని చూస్తున్నాం. మొన్న మా మిత్రుడు అంటు న్నాడు- ఈ తరంలో పుట్టిన పిల్లలు తేలికగా 110 సంవత్స రాలు జీవిస్తారని. విత్తనాల కల్తీ, కులాంతర, దేశాంతర వివాహాల కారణంగా జీవక ణాల ఆరోగ్యం-ఏదైనా కావచ్చు.
జానీ ట్రువాంట్ అనే రచయిత తన పుస్తకానికి ఒక బూతు శీర్షికని ఉంచాడు. ఆయన చెప్పాడూ- ఈ విశ్వాంతరాళంలో-భూమి వయసు కొన్ని కోట్ల సంవత్స రాలు అనుకుంటే- మానవుని జీవన పరిమాణం ఒక నానో సెకను. అంటే ఒక సెకనులో నూరుకోట్ల వం తుట! ఈ వ్యవధిలోనే మన మతాలు, పదవులు, సుఖా లు, భవిష్యత్తు- ఆ పరిధిలో ఆలోచిస్తే ఇవన్నీ హాస్యా స్పదంగా కనిపిస్తాయి. అయితే సృష్టిలో అత్యంత సుని శితమైన ఆలోచనా సరళి గల ప్రాణి- మానవుడయితే, అత్యంత క్రమశిక్షణ, అనూహ్యమైన సామాజిక స్పృహ, సామాజిక జీవనాన్ని గడిపే ప్రాణి- చీమ. చీమ నుంచి ఇప్పటికీ-ఈ మాట పొరపాటు- ఎప్పటికీ నేర్చుకోవల సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.
అయితే చీమ ఆయుః ప్రమాణమెంత? ఎంత సులువుగా, ఎంత ప్రయత్న రహితంగా చచ్చిపోతుంది? కొన్ని వేల చీమలు, కొన్ని గంటలు, రోజుల పాటు సామూహికంగా కృషి చేసి ఒక పాముని చంపెయ్య గలవు. మనం? రెండు కులాలు, రెండు రాష్ట్రాలు, రెండు వర్గాలు, రెండు మనుషులు కలసి జీవించలేం. కలిస్తే మానభంగమయినా, పక్క వాడి బతుకుని నాశనం చేయడమయినా జరుగుతుంది. మన దృక్పథంలోనే ఏదో లోపం చచ్చింది.
కాలం గురించి మాట్లాడుతున్నాను కనుక- దాదా పు 45 సంవత్సరాల కిందట చూసిన ఒక సినీమా ఇప్ప టికీ నా మనసులో గిరికీలు కొడుతూనే ఉంటుంది. హైద రాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చిక్కడపల్లిలో ఉన్న ఏదో థియేటర్‌లో చూశాను. నా పక్కన అన్నపూర్ణా సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూ దనరావుగారున్నారు. ఇప్పటికీ ఆ సినీమా పేరు, దేశం పేరూ, వివ రాలూ గుర్తు పెట్టుకోలేకపోయినం దుకు ఎంతగానో కుంగిపోతుం టాను. దురదృష్టం.
రెండవ ప్రపంచయుద్ధం, తత్కారణంగా జర్మన్ నియంత హిట్లర్ చేసిన దారుణ మారణకాం డని గురించిన కథలు, నవలలు, చిత్రాలు కోకొల్లలు. సెల్యూలాయిడ్ మీద ఎన్నో మహాకావ్యాలు అవత రించాయి. ఒక మనిషిని హింసిం చడానికి మార్గాలేవీ? శారీరకమైన హింస, తన ఆత్మీయులను తన ముందే హింసించడం, ప్రాణం తీయడం, జైల్లో మగ్గే టట్టు చూడడం, ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం పైన ఉటంకించిన వేటి జోలికీ పోలేదు. మరేమిటి మానవుడిని హింసించేది? ఏది మానవుని జీవన సర ళిని, చైతన్యాన్ని పూర్తిగా అణగదొక్కి-అతని చేతనని స్తబ్దం చేయగలుగుతుంది? ఏది భయంకరమైన హింస? మనిషిలో ‘కాల’గమన చైతన్యాన్ని ఆపగలిగితే అది భయం కరమైన హింస-అంటాడు కథకుడు. అద్భుతం. బహుశా కారాగారాల్లో బంధించి, చీకటికోణాల్లో నేర గాళ్లని మగ్గేటట్టు చేసి, బయట ప్రపంచంలో ఏం జరు గుతుందో తెలియకుండా వారి‘కాల’ం స్పృహని ఘనీ భవింపచేయడమే శిక్షగా మనం నిర్దేశిస్తున్నాం.
ఇదీ చిత్రం. ఇరవై ముప్పయ్ మందిని జైల్లో పెట్టారు. అందరూ కలసే ఉన్నారు. బయట కాలం స్పృహ వారికి చేరకుండా చేశారు. కానీ జైల్లో ఖైదీలు కాలాన్ని తమకు తామే పునరుద్ధరించుకున్నారు. కాలం స్పృహ జారిపోకుండా నిలుపుకున్నారు. ఎలా? నిరంత రాయంగా ఇద్దరు సెకన్లు లెక్కపెడుతు న్నారు. ‘‘ఒకటి- రెండు, ఒకటి-రెండు, ఒకటి - రెండు(వన్, టూ; వన్, టూ; వన్, టూ) ఇలాగ. మరొకరు నిమిషాలని లెక్కవే స్తున్నారు. అందరూ కలసి- సామూహికంగా ఉద యాన్ని గుర్తుపట్టారు. సాయంకాలాన్ని గుర్తు పట్టారు. రాత్రిని గుర్తుపట్టారు. రోజులు తెలుస్తున్నాయి. కాలం గడుస్తోంది. నిలిచిపోలేదు. వారి మనస్సుల్లో ‘కాల చైతన్యం' నశించలేదు. వారి జీవితాలు చలనవంతంగా ఉన్నాయి. ఇప్పుడు శత్రువు- వాళ్ల లెక్కని- అంటే కాలాన్ని గుర్తించడానికి వారు చేసే ప్రయత్నాన్ని చెడగొట్టాలని ప్రయ త్నించాడు.
కాలచైతన్యం- వారి ఆక లినీ, ఒంటరితనాన్నీ, స్తబ్దతనీ జయించింది. శత్రువు- వాళ్లని ఒకా నొక ప్లేన్‌లో శిక్షించాలనుకున్నాడు. ఖైదీ తెలివిగా ఆ ప్లేన్‌ని అధిగమించి ‘‘కాలం’’ కాన్సెప్ట్‌ని నష్టపోకుండా పట్టుకున్నాడు. కేవలం శారీరకమైన, లౌకికమైన స్థాయిని దాటి మరొక ప్లేన్‌లో హింసని నిలిపిన చిత్రం. రోటీన్ మారణహోమాన్ని గురించిన ఇన్ని చిత్రాల మధ్య ఇది నాకు తల మానికంగా తోస్తుంది.
మానవ జీవన సరళికి- కాలం పెద్ద ఊతం. ఒక సెకనులో 10 కోట్ల వంతు జీవిత ప్రమాణం ఉన్న మాన వుడు- అయిదేళ్ల పదవిని, పాతికేళ్ల కీర్తిని, 50 ఏళ్ల ఆనం దాన్ని మరొక కోణంలో చూడగలిగితే- దృక్పథం ఎంత సాంద్రమో, ఎంత ఉదారమూ, ఎంత గంభీరమూ అవుతుందో!
చీమల్లో ఐన్‌స్టీన్, రమణ మహర్షి ఉండి ఉండరు. కానీ అదే తన జీవన పరమార్థం, అదే ఆఖరిక్షణం అన్నట్టు చీమ శ్రద్ధగా, సామూహికంగా, కమిటెడ్‌గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది తీసే పరుగు సైన్యం మీద ఒక్క నీటి చుక్క పడితే చెల్లాచెదురై, మళ్లీ అంతలో తన ఐకమత్యాన్ని ప్రోది చేసుకుంటుంది.
ఆలోచనని అనితర సాధ్యంగా సాధించిన మాన వుడు- ఈ ఒక్క గుణాన్ని గుర్తు పట్టగలిగితే ఈ ప్రపం చం ఎంత హృద్యంగా ఉంటుంది? ఒక హిరోషిమా, ఒక బాబ్రీ మసీదు, ఒక బొంబాయి మారణహోమం- ఎంత అర్థరహితంగా కనిపిస్తాయి? వరస తప్పక నడిచే చీమల దండులో ఒక చీమ మరొక చీమను చంపడం ఏనాడ యినా చూశామా?
కాలం స్పృహ సంస్కారాన్ని పెంచుతుంది. మానవ స్వభావానికి ఉదాత్తతని మప్పుతుంది. అన్ని టికీ మించి జీవితానికి ఒక విలువనీ, పరమార్థాన్నీ సం తరిస్తుంది. అది హాస్యాస్పదమైనంత బుద్బుదప్రాయం కనుక.
- గొల్లపూడి మారుతీరావు