
మృత్యుహేల
ఫాస్ట్ బౌలర్ 150 కి.మీ వేగంతో విసిరే బంతి సెకనులోపే 22 గజాలు ప్రయాణం చేస్తుంది. బంతి వేగానికి, మనిషి నిశిత దృష్టికి మధ్య క్షణంలో ఏర్పడిన తేడాయే హ్యూస్‌ని ఆటకూ, జీవితానికీ దూరం చేసింది.
మృత్యువు ఆట. లేదా ఆటలో మృత్యువు. దాదాపు 300 ఏళ్ల కిందట ప్రముఖ బ్రిటిష్ రచయిత డేనియల్ డెఫో ‘‘మాన్ ఫ్రైడే’’ అనే నవల రాశాడు. సరిగ్గా 254 సంవత్స రాల తర్వాత ఆడ్రియన్ మిచల్ అనే నాటక రచయిత దీన్ని నాటకంగా రాశాడు. 39 ఏళ్ల కిందట ఇది సినిమా అయింది. ఒక ద్వీపంలో నౌక ఇరుక్కుని ఏళ్ల తరబడి ఏకాకిగా ఉండిపోయిన నావికుడు రాబిన్సన్ క్రూసో. అతని దగ్గర బంగారం, డబ్బు, తుపాకులు ఉన్నాయి. కాని లేనిది-సాంగత్యం. ఎట్టకేలకు ఓ నల్లనివాడు- ఆ ద్వీపానికి కొట్టుకువచ్చాడు ఒక డింగీలో. అతను శుక్రవారం దొరికాడు కనుక అతనికి ‘‘మాన్ ఫ్రైడే’’ అని నామకరణం చేశాడు క్రూ సో. గొప్ప నవల. గొప్ప నాటకం. గొప్ప సినిమా.
అందులో ఫ్రైడే నావికుడిని అడుగుతాడు- ‘‘క్రీడ అంటే ఏమిటి?’’ అని. తలగోక్కుని ‘‘ఎదుటివాడి వినోదానికి ఒకరినొ కరు హింసించుకోవడం’’ అంటాడు క్రూసో. ఆ హింస పరాకాష్ట మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన అతి హృదయ విదారకమైన సంఘటన. ఇటీవల అక్కడ జరిగిన లీగ్ క్రికెట్ ఆటలో న్యూ సౌత్‌వేల్స్ బౌలర్ షాన్ అబోట్ వేసిన బంతి ఫిలిప్ హ్యూస్ అనే బ్యాట్స్‌మన్ చెవి వెనకభాగంలో తగి లి, మెదడుకు రక్తప్రసారాన్ని అందించే రక్తనాళం తెగి, రెండు రోజులు కోమాలో ఉండి మరణించాడు. అతనికి కేవలం 25 ఏళ్లు. ఆ విపత్తుకి క్రికెట్ ప్రపం చం యావత్తూ దిగ్భ్రాంతి చెందింది. తోటి ఆటగాళ్లు శోక సముద్రంలో మునిగిపోయారు. అందరూ మరో కుర్రాడిని మరిచిపోయారు. కేవలం ఆటలో భాగంగానే తాను విసిరిన బంతి కారణంగా ప్రాణా లు కోల్పోయిన సాటి ఆటగాడు - అబోట్ దుఃఖం తో కరిగి నీరయ్యాడు.
ఆట స్వరూపం గత 10 సంవత్సరాల్లో బొత్తిగా మారిపోయింది. 1971-87 మధ్య 16 ఏళ్లు క్రికెట్ ఆడిన సునీల్ గావస్కర్ రోజుల్లో ఈ ఉక్కు శిరస్త్రా ణాలు లేవు. గావస్కర్ ఏనాడూ తలకి ఉక్కు టోపీ పెట్టుకుని ఆడలేదు. అయినా ఒక్కసారీ గాయపడ లేదు. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ ఇంగ్లండులో కసిగా జరిగిన డగ్లస్ జార్డిన్ ‘బాడీలైన్’ సిరీస్‌లో ఆడారు. అయినా గాయపడలేదు.
ఫాస్ట్ బౌలర్ 150 కిలోమీటర్ల వేగంతో విసిరే బంతి 22 గజాలు- దాదాపు ఒక సెకను కంటే తక్కు వ వ్యవధిలో ప్రయాణం చేస్తుంది. ఈ వ్యవధిలో ఆటగాడు తను ఎదుర్కొనే బంతి ఆడే పద్ధతినీ, తన శరీరాన్ని తాకకుండా తప్పించుకునే ఒడుపునీ నిర్ణ యించుకోవాలి. బౌలర్ చేతి నుంచి బంతి విడుదల య్యాక దక్షిణాఫ్రికా ఆటగాడు బారీ రిచర్డ్స్ బ్యాట్‌కి తాకే సెకను కన్న తక్కువ వ్యవధిలో ఆ బంతిని కొట్ట డానికి కనీసం అయిదు వ్యూహాలను అతని మెదడు సిద్ధం చేస్తుందట! అదీ గొప్ప ఆటగాడి reflexes. ఓసారి బ్రిటిష్ ఆటగాడు జెఫ్ బోయ్‌కాట్ మరో గొప్ప బ్యాట్స్‌మన్ లెన్ హట్టన్‌ని అడిగాడట. రే విండ్‌వాల్ గానీ కీత్‌మిల్లర్ గానీ వేసే బంతిని ఎప్పుడైనా గాలిలో ‘హుక్’ చేశావా? అని. సమా ధానం- ‘‘ఓవల్ గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు చెయ్యాలని పించింది కాని, బంతి బయలుదేరిన క్షణంలో కంటి కొనలో ఆసుపత్రి దృశ్యం కనిపించి మానుకున్నాను’’ అన్నాడట.
సచిన్ తేండూల్కర్ తన ఆత్మకథలో రాసిన ఒక సంఘటన అత్యంత ఆశ్చర్యకరం. ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్నప్పుడు ఒకసారి ఇండియా కోచ్ గారీ కిర్‌స్టన్ తేండూల్కర్‌కి బంతి వేస్తున్నాడట. ఆరు బంతులు ఆడాక తేండూల్కర్ అడిగాడట- ‘‘నేనేం చేశానో గమనించారా?’’ అని. లేదన్నాడు కిర్‌స్టన్. బంతి కిర్‌స్టన్ చేతి నుంచి విడుదలయ్యాక- అతని బంతి నెట్ మీద వేలేసి పట్టుకున్నాడా, ఎర్ర తోలువేపు పట్టుకున్నాడా అన్నది గుర్తించాక- బంతి వదిలిన క్షణంలో తేండూల్కర్ కళ్లు మూసుకుని బంతిని కొట్టాడట. ఆ తర్వాత బంతి ఎటు, ఎలా, ఎంత వేగంతో వస్తుందో అతని అనుభవం నేర్పిన నైపు ణ్యం. నిర్ఘాంతపోయాడట కిర్‌స్టన్.
ఏతావాతా, ఫిలిప్ హ్యూస్ మరణం అత్యంత విషాదకరం. క్రీడల్లో ఇలాంటి దుర్మరణాలు పది సార్లు జరిగాయి. బాగా గుర్తున్న సంఘటనలు- 1998 ఢాకాలో క్రికెట్ ఆటగాడు రమణ్ లంబా- ఆనాటి ఆట కేవలం మూడు బంతుల్లో ముగియ బోతోంది కదా అని అలసత్వంతో ఉక్కు టోపీ లేకుం డా షార్ట్ లెగ్ దగ్గర నిలబడ్డాడు. బంతి కణతకి కొట్టు కుంది. మూడు రోజుల తరువాత కన్నుమూశాడు. 2008లో వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ అల్లుడు సయ్యద్ అబిద్ అలీ (34) బ్యాటింగ్ చేస్తూ అలసి పోయి తనకు రన్నర్ కావాలన్నాడు. ఆ వెంటనే మైదానంలో కుప్పకూలి 15 నిమిషాలలో గుండె పోటుతో మరణించాడు. ఆట నిరంతరం సాగేది. ఆపద అరుదుగా జరి గినా హృదయాన్ని పట్టుకుని పీడించేది. ఫిలిప్ హ్యూస్ ఆత్మ శాంతించాలని, క్రికెట్ ఆట హింసా రహితంగా సాగాలని ఆశిద్దాం.!
- గొల్లపూడి మారుతీరావు