Phillip Hughes
-
IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు!
ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఫిలిప్ హ్యూస్ గనుక బతికి ఉంటే ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టేవాడని.. కానీ తను ఇప్పుడు ఈ లోకంలో లేడంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సౌదీ అరేబియాలో ఇటీవల ఐపీఎల్-2025 మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే.అమాంతం ఏడు కోట్లు పెంచిఇందులో భాగంగా రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీకి రాగా.. లక్నో సూపర్ జెయింట్స్ కళ్లు చెదిరే మొత్తానికి ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది. పంత్ ధర రూ. 20 కోట్లకు చేరినపుడు ఢిల్లీ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా పంత్‌ను తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచేసింది.దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డు సాధించాడు. ఈ నేపథ్యంలో లక్నో జట్టు హెడ్‌కోచ్, ఆసీస్ మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’కు రాసిన కాలమ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. మా ఫ్రాంఛైజీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడి సేవల కోసం ఐదు మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసింది. కేవలం ఎనిమిది వారాలకు ఇంత మొత్తం అంటే మాటలు కాదు.అతడే గనుక బతికి ఉంటేఒకవేళ హ్యూస్ గనుక బతికి ఉంటే.. ఐపీఎల్ వేలంలో అతడు కూడా భారీ ధర పలికేవాడు. కేవలం తన డైనమిక్ బ్యాటింగ్ మాత్రమే ఇందుకు కారణం కాదు.. తనలోని ఎనర్జీ కూడా ఇందుకు కారణం. కానీ.. విచారకరం ఏమిటంటే.. తను ఇప్పుడు మన మధ్యలేడు. ఎప్పటికీ వేలంలోకి రాలేడు’’ అంటూ ఆసీస్ దివంగత స్టార్ ఫిలిప్ హ్యూస్‌ను గుర్తుచేసుకున్నాడు. అదే విధంగా.. పంత్ క్రికెటింగ్ నైపుణ్యాలను కొనియాడిన లాంగర్.. ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా(2020-21)ను ఒంటిచేత్తో గెలిపించిన తీరు ఎన్నటికీ మరువలేనిదన్నాడు. కాగా 2014లో ఫిలిప్ హ్యూస్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచివెళ్లాడు. ఆసీస్ దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా న్యూ సౌత్‌వేల్స్- సౌత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి బలైన హ్యూస్ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి హ్యూస్ మెడకు బలంగా తాకడంతో అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. నవంబరు 27న హ్యూస్ పదో వర్ధంతి జరిగింది. ఈ నేపథ్యంలో అతడిని తలచుకుంటూ జస్టిన్ లాంగర్ ఉద్వేగానికి గురయ్యాడు.కాగా న్యూ సౌత్ వేల్స్లో జన్మించిన హ్యూస్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో 26 టెస్టులు, 25 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1535, 826 పరుగులు చేశాడు. తన 26వ పుట్టినరోజు కంటే మూడు రోజుల ముందు.. క్రికెట్ ఆడుతూ తుదిశ్వాస విడిచాడు. చదవండి: ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ.. -
క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ప్రతి ఆస్ట్రేలియా ఆటగాడు (దేశవాలీ, అంతర్జాతీయ ఆటగాళ్లు) నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్‌తో బ్యాటింగ్‌కు దిగడం తప్పనిసరి చేసింది. ఇటీవలికాలంలో బ్యాటర్లు తరుచూ ఫాస్ట్ బౌలింగ్‌లో గాయపడుతుండటంతో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. సీఏ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది ఆసీస్ క్రికెటర్లు తమ మునుపటి ప్రాక్టీస్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ తదితరులు నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడరు. సీఏ తాజా నిర్ణయంతో వీరంతా తప్పనిసరిగా మెడ భాగం సురక్షితంగా ఉండేలా హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. కాగా, నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఫిలిప్ హ్యూస్ మరణాంతరం (2012) ప్రత్యేకంగా తయారు చేయించింది. హ్యూస్ ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోయే వాడు కాదు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇంచుమించు ఇలాంటి ప్రమాదమే మరొకటి సంభవించి ఉండేది. నాడు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ స్టీవ్ స్మిత్‌ను మెడ భాగంలో బలంగా తాకింది. అంత జరిగాక కూడా స్మిత్ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడే వాడు కాదు. ఇది ధరిస్తే అతని హార్ట్ బీట్ అమాంతంగా పెరుగుతుందని అతను చెప్పుకొచ్చేవాడు. వార్నర్ సైతం నెక్ ప్రొటెక్టర్ ధరిస్తే, అది తన మెడలోకి చొచ్చుకుపోయేదని చెప్పి తప్పించుకునే వాడు. సీఏ తాజా నిర్ణయంతో వీరు కారణాలు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న సిరీస్ సందర్భంగా రబాడ వేసిన ఓ రాకాసి బౌన్సర్ కెమారూన్ గ్రీన్ మెడ భాగంలో బలంగా తాకింది. అయితే అతను ఈ నెక్ ప్రొటెక్టర్ ఉండటంతో బ్రతికి బయటపడ్డాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే క్రికెట్ ఆస్ట్రేలియా నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మరోవైపు స్వదేశంలోనూ బౌన్సీ పిచ్‌లు ఎక్కువగా ఉండటంతో దేశవాలీ క్రికెటర్లు కూడా ముందు జాగ్రత్తగా ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి బ్యాటింగ్‌కు దిగాలని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన జారీ చేసింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆసీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఆసీస్ సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు టీమిండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. తదనంతరం అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. -
మరోసారి సీన్ అబాట్ వేసిన బౌన్సర్ మరో క్రికెటర్‌ను
-
హ్యూస్ మరణానికి కారణమైన బౌలరే..!
మెల్బోర్న్: దాదాపు మూడేళ్లనాటి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. 2014 నవంబర్ లో మైదానంలో బంతి అతనికి బలంగా తాకడంతో క్రీజ్‌లో కూలిన హ్యూస్.. ఆ తరువాత రెండు రోజులకు తుదిశ్వాస విడిచాడు. 2014 నవంబర్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ బౌన్సర్ సంధించగా అది హ్యూస్ తలకు బలంగా తాకింది. దాంతో విలవిల్లాడిన హ్యూస్ క్రీజ్‌లో కుప్పకూలిపోయాడు. ఆపై చికిత్స చేయించినా హ్యూస్ మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. అయితే తాజాగా మరోసారి సీన్ అబాట్ వేసిన బౌన్సర్ మరో క్రికెటర్‌ను తీవ్రంగా గాయపరచడం ఆసీస్ క్రికెట్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఆసీస్ దేశవాళీ క్రికెట్లో భాగంగా ఆదివారం షెఫల్ షీల్డ్ టోర్నీలో న్యూసౌత్ వేల్స్ తరపున ఆడుతున్న సీన్ అబాట్ వేసిన షార్ట్ బాల్.. విక్టోరియా ఆటగాడు విల్ పీవుకోవ్‌స్కీ తలకు బలంగా తాకింది. బంతి తగిలిన మరుక్షణమే పీవుకోవ్‌స్కీ మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడ ఉన్న ఆటగాళ్లంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ క్రమంలోనే ఫిజియో బృందం, మెడికల్ స్టాఫ్ గ్రౌండ్లోకి ఉన్నపళంగా పరుగులు తీశారు. కాసేపు పీవుకోవ్స్కీకి చికిత్స చేసిన తర్వాత అతను తేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వైద్యుల సాయంతో పీవుకోవ్‌స్కీ గ్రౌండ్‌ను విడిచివెళ్లిపోయాడు. అతని తలకు స్కానింగ్ చేసిన తర్వాత పెద్ద గాయం కాలేదని తేలడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. ఆనాటి హ్యూస్ మరణానికి కారణమైన బౌలరే మరొకసారి బౌన్సర్ వేసి బ్యాట్స్‌మన్‌ను గాయపరచడం చర్చనీయాంశమైంది. -
'అతని మృతికి ఏ క్రికెటర్ కారణం కాదు'
సిడ్నీ: దాదాపు రెండేళ్ల క్రితంనాటి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. 2014 నవంబర్ లో మైదానంలో బంతి అతనికి బలంగా తాకడంతో క్రీజ్‌లో కూలిన హ్యూస్.. ఆ తరువాత రెండు రోజులకు తుదిశ్వాస విడిచాడు. అయితే హ్యూస్ మృతి విషయానికి సంబంధించి ఏ క్రికెటర్ తప్పిదం లేదంటూ న్యూసౌత్ వేల్స్ కారనర్స్ కోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన తరువాత తీర్పును వెలువరించిన కోర్టు.. హ్యూస్ మరణానికి ప్రధాన కారణం అతను బంతిని అంచనా వేయడంలో విఫలం కావడమేనని పేర్కొంది. ప్రత్యర్థి జట్టు వ్యూహ ప్రతివ్యూహాలు, స్లెడ్జింగ్‌కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేనందును ఆ మరణాన్ని యాక్సిడెంటల్ మృతిగా ధృవీకరిస్తూ తన తీర్పులో వెల్లడించింది. 'ప్రత్యర్థి జట్టు ద్వేషంతో కూడిన తీరును ఇక్కడ అవలంభించలేదు. ప్రమాదకరమైన బంతులను సంధించిమని చెప్పారనడానికి ఆధారాలు లేవు. హ్యూస్ మృతికి బౌలర్ కారణం కాదు.. మిగతా వేరు ఎవరూ కారణం కాదు. హ్యూస్ బంతిని అంచనా వేయడంలో చేసిన పొరపాటుతోనే అతనికి బంతికి బలంగా తాకి ప్రాణాలు కోల్పోయాడు'అని కోర్టు తీర్పులో తెలిపింది. దాంతో పాటు ఈ గేమ్‌కు సంబంధించిన చట్టాలు అతని మృతికి కారణం కాదని పేర్కొంది. కాకపోతే ప్రమాదకరమైన, ఆమోదయోగ్యం కాని బౌలింగ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్షించి, అందుకు తగిన చట్టాలను రూపొందించాలని న్యూసౌత్ వేల్స్ కారనర్స్ కోర్టు జడ్జి బార్న్స్ అభిప్రాయపడ్డారు. 2014 నవంబర్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా హ్యూస్కు సీన్ అబాట్ బౌన్సర్ విసిరిన బంతి బలంగా తలపై తాకింది. దాంతో విలవిల్లాడిన హ్యూస్ క్రీజ్‌లో కుప్పకూలిపోయాడు. ఆపై చికిత్స చేయించినా హ్యూస్ మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. కాగా, అతనిపై పదే పదే షార్ట్ పిచ్ బంతులు విసరాలని న్యూ సౌత్‌వేల్స్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ చెప్పినట్లు ఆరోపణలు రావడంతో ఆ దిశగా విచారణ సాగింది. దాంతో పాటు హ్యూస్ వద్దకు వచ్చి బొలింజర్ ’నేను నిన్ను చంపబోతున్నాను’ అని కూడా వ్యాఖ్యానించినట్లు ఒక క్రికెటర్ వెల్లడించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగిన అనంతరం హ్యూస్ మృతి ప్రత్యర్థి జట్టు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని వెల్లడైంది. -
మృత్యుహేల
ఫాస్ట్ బౌలర్ 150 కి.మీ వేగంతో విసిరే బంతి సెకనులోపే 22 గజాలు ప్రయాణం చేస్తుంది. బంతి వేగానికి, మనిషి నిశిత దృష్టికి మధ్య క్షణంలో ఏర్పడిన తేడాయే హ్యూస్ని ఆటకూ, జీవితానికీ దూరం చేసింది. మృత్యువు ఆట. లేదా ఆటలో మృత్యువు. దాదాపు 300 ఏళ్ల కిందట ప్రముఖ బ్రిటిష్ రచయిత డేనియల్ డెఫో ‘‘మాన్ ఫ్రైడే’’ అనే నవల రాశాడు. సరిగ్గా 254 సంవత్స రాల తర్వాత ఆడ్రియన్ మిచల్ అనే నాటక రచయిత దీన్ని నాటకంగా రాశాడు. 39 ఏళ్ల కిందట ఇది సినిమా అయింది. ఒక ద్వీపంలో నౌక ఇరుక్కుని ఏళ్ల తరబడి ఏకాకిగా ఉండిపోయిన నావికుడు రాబిన్సన్ క్రూసో. అతని దగ్గర బంగారం, డబ్బు, తుపాకులు ఉన్నాయి. కాని లేనిది-సాంగత్యం. ఎట్టకేలకు ఓ నల్లనివాడు- ఆ ద్వీపానికి కొట్టుకువచ్చాడు ఒక డింగీలో. అతను శుక్రవారం దొరికాడు కనుక అతనికి ‘‘మాన్ ఫ్రైడే’’ అని నామకరణం చేశాడు క్రూ సో. గొప్ప నవల. గొప్ప నాటకం. గొప్ప సినిమా. అందులో ఫ్రైడే నావికుడిని అడుగుతాడు- ‘‘క్రీడ అంటే ఏమిటి?’’ అని. తలగోక్కుని ‘‘ఎదుటివాడి వినోదానికి ఒకరినొ కరు హింసించుకోవడం’’ అంటాడు క్రూసో. ఆ హింస పరాకాష్ట మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన అతి హృదయ విదారకమైన సంఘటన. ఇటీవల అక్కడ జరిగిన లీగ్ క్రికెట్ ఆటలో న్యూ సౌత్‌వేల్స్ బౌలర్ షాన్ అబోట్ వేసిన బంతి ఫిలిప్ హ్యూస్ అనే బ్యాట్స్‌మన్ చెవి వెనకభాగంలో తగి లి, మెదడుకు రక్తప్రసారాన్ని అందించే రక్తనాళం తెగి, రెండు రోజులు కోమాలో ఉండి మరణించాడు. అతనికి కేవలం 25 ఏళ్లు. ఆ విపత్తుకి క్రికెట్ ప్రపం చం యావత్తూ దిగ్భ్రాంతి చెందింది. తోటి ఆటగాళ్లు శోక సముద్రంలో మునిగిపోయారు. అందరూ మరో కుర్రాడిని మరిచిపోయారు. కేవలం ఆటలో భాగంగానే తాను విసిరిన బంతి కారణంగా ప్రాణా లు కోల్పోయిన సాటి ఆటగాడు - అబోట్ దుఃఖం తో కరిగి నీరయ్యాడు. ఆట స్వరూపం గత 10 సంవత్సరాల్లో బొత్తిగా మారిపోయింది. 1971-87 మధ్య 16 ఏళ్లు క్రికెట్ ఆడిన సునీల్ గావస్కర్ రోజుల్లో ఈ ఉక్కు శిరస్త్రా ణాలు లేవు. గావస్కర్ ఏనాడూ తలకి ఉక్కు టోపీ పెట్టుకుని ఆడలేదు. అయినా ఒక్కసారీ గాయపడ లేదు. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ ఇంగ్లండులో కసిగా జరిగిన డగ్లస్ జార్డిన్ ‘బాడీలైన్’ సిరీస్‌లో ఆడారు. అయినా గాయపడలేదు. ఫాస్ట్ బౌలర్ 150 కిలోమీటర్ల వేగంతో విసిరే బంతి 22 గజాలు- దాదాపు ఒక సెకను కంటే తక్కు వ వ్యవధిలో ప్రయాణం చేస్తుంది. ఈ వ్యవధిలో ఆటగాడు తను ఎదుర్కొనే బంతి ఆడే పద్ధతినీ, తన శరీరాన్ని తాకకుండా తప్పించుకునే ఒడుపునీ నిర్ణ యించుకోవాలి. బౌలర్ చేతి నుంచి బంతి విడుదల య్యాక దక్షిణాఫ్రికా ఆటగాడు బారీ రిచర్డ్స్ బ్యాట్‌కి తాకే సెకను కన్న తక్కువ వ్యవధిలో ఆ బంతిని కొట్ట డానికి కనీసం అయిదు వ్యూహాలను అతని మెదడు సిద్ధం చేస్తుందట! అదీ గొప్ప ఆటగాడి reflexes. ఓసారి బ్రిటిష్ ఆటగాడు జెఫ్ బోయ్‌కాట్ మరో గొప్ప బ్యాట్స్‌మన్ లెన్ హట్టన్ని అడిగాడట. రే విండ్వాల్ గానీ కీత్మిల్లర్ గానీ వేసే బంతిని ఎప్పుడైనా గాలిలో ‘హుక్’ చేశావా? అని. సమా ధానం- ‘‘ఓవల్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు చెయ్యాలని పించింది కాని, బంతి బయలుదేరిన క్షణంలో కంటి కొనలో ఆసుపత్రి దృశ్యం కనిపించి మానుకున్నాను’’ అన్నాడట. సచిన్ తేండూల్కర్ తన ఆత్మకథలో రాసిన ఒక సంఘటన అత్యంత ఆశ్చర్యకరం. ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్నప్పుడు ఒకసారి ఇండియా కోచ్ గారీ కిర్‌స్టన్ తేండూల్కర్కి బంతి వేస్తున్నాడట. ఆరు బంతులు ఆడాక తేండూల్కర్ అడిగాడట- ‘‘నేనేం చేశానో గమనించారా?’’ అని. లేదన్నాడు కిర్‌స్టన్. బంతి కిర్‌స్టన్ చేతి నుంచి విడుదలయ్యాక- అతని బంతి నెట్ మీద వేలేసి పట్టుకున్నాడా, ఎర్ర తోలువేపు పట్టుకున్నాడా అన్నది గుర్తించాక- బంతి వదిలిన క్షణంలో తేండూల్కర్ కళ్లు మూసుకుని బంతిని కొట్టాడట. ఆ తర్వాత బంతి ఎటు, ఎలా, ఎంత వేగంతో వస్తుందో అతని అనుభవం నేర్పిన నైపు ణ్యం. నిర్ఘాంతపోయాడట కిర్‌స్టన్. ఏతావాతా, ఫిలిప్ హ్యూస్ మరణం అత్యంత విషాదకరం. క్రీడల్లో ఇలాంటి దుర్మరణాలు పది సార్లు జరిగాయి. బాగా గుర్తున్న సంఘటనలు- 1998 ఢాకాలో క్రికెట్ ఆటగాడు రమణ్ లంబా- ఆనాటి ఆట కేవలం మూడు బంతుల్లో ముగియ బోతోంది కదా అని అలసత్వంతో ఉక్కు టోపీ లేకుం డా షార్ట్ లెగ్ దగ్గర నిలబడ్డాడు. బంతి కణతకి కొట్టు కుంది. మూడు రోజుల తరువాత కన్నుమూశాడు. 2008లో వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ అల్లుడు సయ్యద్ అబిద్ అలీ (34) బ్యాటింగ్ చేస్తూ అలసి పోయి తనకు రన్నర్ కావాలన్నాడు. ఆ వెంటనే మైదానంలో కుప్పకూలి 15 నిమిషాలలో గుండె పోటుతో మరణించాడు. ఆట నిరంతరం సాగేది. ఆపద అరుదుగా జరి గినా హృదయాన్ని పట్టుకుని పీడించేది. ఫిలిప్ హ్యూస్ ఆత్మ శాంతించాలని, క్రికెట్ ఆట హింసా రహితంగా సాగాలని ఆశిద్దాం.! - గొల్లపూడి మారుతీరావు -
హ్యూస్కు 63 సెకండ్ల పాటు నివాళి
బౌన్సర్ బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్టు సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 63 పరుగులు చేసిన సమయంలో మొత్తం ఆటగాళ్లు, చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కలిసి 63 సెకండ్ల పాటు నిలబడి నివాళులు అర్పించారు. రెండు జట్ల సభ్యులు నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి హ్యూస్‌ను తలుచుకున్నారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండులో నవంబర్ 25వ తేదీన సీన్ అబాట్ విసిరిన బౌన్సర్ మెడభాగంలోని కీలకమైన నరానికి తగలడంతో మెదడుకు రక్తసరఫరా నిలిచిపోయి, రెండు రోజుల తర్వాత హ్యూస్ మరణించిన విషయం తెలిసిందే. సరిగ్గా 63 సెకండ్ల పాటు నివాళి కొనసాగింది. టాస్ గెలిచిన సమయంలో కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన సహచరుడిని తలుచుకున్నాడు. హ్యూస్ లేకపోవడం పెద్దలోటేనని, అతడు ఎప్పుడూ తన మదిలో ఉంటాడని అన్నాడు. -
మనమే గెలిచి అంకితమిద్దాం!
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు రంగం సిద్ధం రేపటి నుంచి తొలి టెస్టు ధోని సారథ్యంలోనే బరిలోకి భారత్ బౌలర్ల విషయంలో రాని స్పష్టత అంతా సాధారణంగానే ఉంటే ఈ పాటికి తొలి టెస్టు మొదలై ఐదో రోజు కావలసింది. కానీ ఫిలిప్ హ్యూస్ దుర్మరణం కారణంగా టెస్టు వాయిదా పడటం, షెడ్యూల్ మారడం, రెండు జట్లలోనూ ఆటకంటే భావోద్వే గాలకు ప్రాధాన్యం పెరగడం... ఇలా గత పది రోజులుగా అంతా నాటకీయ పరిణా మాలు జరిగాయి. ఇక మ్యాచ్‌ల మీద దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. సిరీస్ గెలిచి హ్యూస్కు అంకితమివ్వాలని ఆసీస్ క్రికెటర్లు కసిగా ఉన్నారు. అయితే ఎన్నడూ ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవని భారత్... ఈసారైనా ఆ అరుదైన ఘనతను సాధించి... మనమే సిరీస్ విజయాన్ని హ్యూస్కు అంకితమిస్తే ఘనంగా ఉంటుంది. సాక్షి క్రీడావిభాగం ఆస్ట్రేలియాలో పరిస్థితులకు అలవాటు పడటానికి పది రోజుల ముందే వెళ్లిన భారత జట్టుకు అనుకోకుండా మరో ఐదు రోజులు అదనంగా కలిసొచ్చింది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల ద్వారా లభించిన అవకాశాన్ని బ్యాట్స్‌మెన్, బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. అయితే కాస్త అనిశ్చితి మాత్రం చివరిదాకా కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం తొలి టెస్టుకు కోహ్లి సారథ్యం వహించాలి. కానీ గాయం నుంచి కోలుకున్న ధోని ఇప్పటికే జట్టుతో చేరాడు. ఆదివారం ప్రాక్టీస్ కూడా చేశాడు. ప్రాక్టీస్ సెషన్లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా బ్యాటింగ్ చేశాడు. కాబట్టి ధోని తొలి టెస్టు ఆడటం దాదాపుగా ఖాయమైనట్లే. ఈ నేపథ్యంలో టెస్టు సారథ్యం కోసం కోహ్లి కొంతకాలం వేచి చూడాలి. ఒకవేళ ధోని మరింత విశ్రాంతి కావాలనుకుంటే మాత్రం కోహ్లి సారథ్యంలో భారత్ సిరీస్‌ను మొదలుపెడుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ విషయంలో ఆ శిబిరంలోనూ అనిశ్చితి ఉంది. క్లార్క్ ఆడకపోతే హాడిన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఇలా సారథుల విషయంలో సందిగ్ధం మధ్య భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాయి. మంగళవారం (రేపు) నుంచి అడిలైడ్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. జట్టు కూర్పు ఏమిటి? భారత్‌కు జట్టు కూర్పు విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రానట్లు కనిపిస్తోంది. కెప్టెన్‌గా ధోని ఆడకపోతే వృద్ధిమాన్ సాహా కీపర్‌గా తుది జట్టులోకి వస్తాడు. ఓపెనర్లుగా ధావన్, విజయ్ ఆడటంలో సందేహం లేదు. లోకేశ్ రాహుల్‌కు అప్పుడే అరంగేట్రం చేసే అవకాశం రాకపోవచ్చు. పుజారా, కోహ్లి, రహానే కూడా తుది జట్టులో ఉండటం ఖాయం. ఇక మరో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ, రైనాలలో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. స్వదేశంలో వన్డే డబుల్ సెంచరీ, ప్రాక్టీస్ మ్యాచ్‌లలో రాణించడం వల్ల రోహిత్ తుది జట్టులో ఉంటానని నమ్మకంతో ఉన్నాడు. అయితే రైనాకు జట్టు మేనేజ్మెంట్ నుంచి మంచి మద్దతు ఉంది. రైనాను టెస్టు ఆడించాలని కోరింది టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కావడం విశేషం. ఇక బౌలింగ్ విషయానికొస్తే ముగ్గురు పేసర్లు ఒక స్పిన్నర్ తుది జట్టులో ఉంటారు. ఇంగ్లండ్‌లో ఐదుగురు బౌలర్లతో ప్రయోగం చేసినా... ఇక్కడ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. భువనేశ్వర్ కుమార్ ఎడమ కాలి చీలమండలో చిన్నపాటి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. తను తొలి టెస్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని భారత జట్టు మేనేజ్మెంట్ చెబుతోంది. ఒకవేళ భువనేశ్వర్ అందుబాటులో లేకపోతే... ఇషాంత్, ఆరోన్, షమీ తుది జట్టులో ఉంటారు. భువనేశ్వర్ ఉంటే షమీ బెంచ్‌కు పరిమితం కావచ్చు. ఒక స్పిన్నర్ స్లాట్‌లో ఎవరు తుది జట్టులోకి వస్తారనేది ఆసక్తికరం. ఇంతకాలం జడేజా, అశ్విన్‌ల మధ్యే పోటీ ఉండేది. తాజాగా లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ రేసులోకి వచ్చాడు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలోనూ కరణ్ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ అతను లోయర్ ఆర్డర్లో బాగా ఉపయోగకరంగా ఆడతాడు. కాబట్టి కరణ్ శర్మను అరంగేట్రం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి. కోలుకున్నట్లే (నా)! మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు హ్యూస్ మరణం విషాదం నుంచి కోలుకున్నట్లే కనిపిస్తున్నారు. ప్రాక్టీస్ మొదలుపెట్టిన రెండు రోజులకే తమదైన తరహాలో మాటలు మొదలుపెట్టారు. క్లార్క్ పూర్తి ఫిట్నెస్తో ఉంటే షాన్ మార్ష్ బెంచ్‌కు పరిమితమవుతాడు. లేదంటే అతనికి అవకాశం వస్తుంది. ఓపెనర్లుగా వార్నర్, రోజర్స్ ఆడతారు. ఆ తర్వాత వాట్సన్, మిషెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, హాడిన్లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్‌గా లియోన్ జట్టులోకి వస్తాడు. పేస్ విభాగంలో జాన్సన్, సిడిల్లతో పాటు హారిస్, హాజిల్‌వుడ్‌లలో ఒకరు తుది జట్టులో ఉంటారు. గెలిస్తే మూడో ర్యాంక్‌కు ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 4-0 లేదా 3-1తో గెలిస్తే భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ధోని సేన ఆరో ర్యాంక్‌లో, ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉన్నాయి. ఒకవేళ ఆసీస్ జట్టు సిరీస్ గెలిస్తే ఇరు జట్ల ర్యాంక్‌లలో మార్పు ఉండదు. -
వెళ్లిరా...నేస్తమా!
హ్యూస్ అంత్యక్రియలు పూర్తి ఆస్ట్రేలియా ప్రధానితో పాటు వేలాదిమంది హాజరు నిన్నమొన్నటిదాకా మాతో కలసి ఆడావు, పాడావు, తిరిగావు... ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ మాలో ఒకడిలా కలసిపోయావు... ఏం తొందరొచ్చిందని అప్పుడే వెళ్లిపోయావ్... ఏం అనుభవించావని సెలవు తీసుకున్నావ్... ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే ఆటే నిన్ను మింగేసిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం... ఆధునిక పరిజ్ఞానం ఉన్నా.. అనుభవజ్ఞులైన వైద్యులున్నా... నిన్ను బతికించుకోలేకపోయామన్న క్షోభ మనసును దహిస్తోంది... భౌతికంగా నువ్వు దూరంకావొచ్చు... కానీ నీ జ్ఞాపకాలు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి... వెళ్లిరా నేస్తమా... నువ్వు ప్రేమించిన ఆటను మళ్లీ ఆడేందుకు! వెళ్లిరా నేస్తమా... ఈ కుటుంబ బాధ్యతను మరో జన్మలోనైనా తీర్చుకునేందుకు! వెళ్లిరా నేస్తమా... నిన్ను మరవలేని నీ స్నేహితులతో కలసి ఆడేందుకు, పాడేందుకు! ...ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ అంత్యక్రియలకు హాజరైన వందలాది క్రికెటర్లు, వేలాది మంది అభిమానుల మూగవేదన ఇది. మాక్స్‌విలే (ఆస్ట్రేలియా): కన్నీళ్లతో కళ్లు చెమ్మగిల్లుతుంటే.. బాధతో హృదయం బరువెక్కుతుంటే... మనసు అంతరాల్లో ఎగసిపడుతున్న ఆందోళనను దిగమింగుకుంటూ... రాకాసి బౌన్సర్‌కు ప్రాణాలు కోల్పోయిన తమ సహచరుడు ఫిలిప్ జోయల్ హ్యూస్కు ఆస్ట్రేలియా తుది వీడ్కోలు పలికింది. బుధవారం వేలాదిమంది సమక్షంలో మాక్స్‌విలేలోని తన వ్యవసాయ క్షేత్రం 408లో క్రికెటర్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. దేశ ప్రధాని టోనీ అబాట్‌తో పాటు ఆసీస్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హ్యూస్కు కడసారి నివాళులు అర్పించారు. భారత తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మురళీ విజయ్, టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి, మేనేజర్ అర్షద్ అయూబ్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. * క్రికెటర్ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరుకావడంతో మాక్స్‌విలే కిక్కిరిసిపోయింది. * మాక్స్‌విలే హైస్కూల్ స్పోర్ట్స్ హాల్లో పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. క్రికెటర్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు హాల్లో 80 శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు. * క్లార్క్, ఇతర ప్రముఖులు ముందు వరుసలో కూర్చొని ఉండగా, ఫాదర్ మైకేల్ అల్కాక్ నేతృత్వంలో చివరి ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టడంతో హాల్లో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి.శవపేటిక ముందు హ్యూస్ ధరించిన క్రికెట్ ఆస్ట్రేలియా డ్రెస్, బ్యాగీ గ్రీన్ క్యాప్‌లను వికెట్లపై తగిలించి ఉంచారు. * హ్యూస్ కుటుంబ సభ్యులు, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్‌లు పక్కన నిలబడి ఉండగా, క్రికెటర్ గురించి హృదయ వేదన కలిగించే సంతాప సందేశాన్ని క్లార్క్ చదివి వినిపించాడు. తర్వాత హ్యూస్ తోబుట్టువులు, స్నేహితులు తమ సంతాప సందేశాలను చదివారు. * హాల్లో ఉన్నవారందరూ తమ నివాళులు అర్పించిన తర్వాత హ్యూస్ పార్థీవ దేహాన్ని మాక్స్‌విలే వీధుల్లో ఊరేగించారు. ప్రధాని అబాట్, ఆటగాళ్లు, స్నేహితులు, ఇతర అభిమానులు పెద్ద ఎత్తున దీన్ని అనుసరించారు. ఈ సందర్భంగా స్థానికులు చివరిసారిగా క్రికెటర్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. * ఆసీస్ ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ చేసిన తర్వాత క్రికెటర్ శవ పేటికను వ్యవసాయ క్షేత్రానికి తరలించారు.హ్యూస్ తండ్రి గ్రెగ్, సోదరుడు జాసన్, క్లార్క్, ఫించ్, లోనెర్గాన్, మ్యాథ్యూ డే, టామ్ కూపర్లు మాక్స్‌విలే స్పోర్ట్స్ హాల్ నుంచి శవ పేటికను మోసుకెళ్లారు. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న అరటి తోటలో పార్థివ దేహాన్ని ఖననం చేశారు. * మోదీ, సచిన్ నివాళి భారత ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్... హ్యూస్కు నివాళి అర్పించారు. ‘హ్యూస్ మేం నిన్ను మిస్ అవుతున్నాం. * ఆట పట్ల నీ అంకితభావం, నేర్చుకోవాలనే తపన ఎందరికో స్ఫూర్తినిస్తాయి’ అని సచిన్ ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్‌కు 2013లో హ్యూస్ ఆడినప్పుడు అతనితో కలసి ఉన్న ఫొటోను సచిన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా హ్యూస్కు నివాళి అర్పించాడు.పాకిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే రెండు టి20ల సిరీస్ ట్రోఫీని హ్యూస్కు అంకితం చేశారు. గురు, శుక్రవారాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన క్రికెట్ మైదానాల్లో హ్యూస్ అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. వేలాదిమంది బిగ్ స్క్రీన్‌పై దీనిని చూస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లోపల 63 బ్యాట్లను వరుసగా నిలబెట్టి తనకు నివాళి అర్పించారు. చివరిసారి ఈ మైదానంలోనే ఆడి 63 పరుగులు చేశాక హ్యూస్ తలకు బంతి తగిలింది. హ్యూస్ చివరిసారి ఆడిన రాండ్విక్ ఎండ్‌లో పువ్వులు ఉంచారు. వికెట్ల మీద నుంచి ఒక బెయిల్ తీసి కిందపెట్టారు. ‘సిడ్నీ క్రికెట్ మైదానం నిన్నెప్పటికీ మరవదు’ అని రాశారు. అబాట్‌కు అండగా... హ్యూస్ అంత్యక్రియల సందర్భంగా అందరి దృష్టీ బౌలర్ అబాట్‌పై ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించిన టీవీ చానల్ సిబ్బంది అతనిపైకి కెమెరా వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. తనని చిత్రీకరించి ఇంకా ఎక్కువ ఇబ్బందిపెట్టకూడదని భావించారు. మీడియా కూడా చాలావరకు అతనికి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ముదురు నీలం రంగు సూట్ ధరించిన 22 ఏళ్ల అబాట్ తన తల్లి జార్జియానా, తండ్రి నాథన్, గర్ల్‌ఫ్రెండ్ బ్రియర్ నీల్‌తో కలసి అంత్యక్రియలకు హాజరయ్యాడు. మృతదేహాన్ని చూడటానికి స్కూల్ ఆవరణలోకి వెళ్లి వచ్చేవరకు నీల్... అబాట్ నడుమును గట్టిగా పట్టుకుని ధైర్యాన్నిచ్చింది. డీన్జోన్స్తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు అబాట్‌ను సముదాయించారు. హ్యూస్ స్నేహితులు, బంధువులు అబాట్‌కు ధైర్యం చెప్పారు. -
హ్యూస్కు కన్నీటి వీడ్కోలు
మెల్బోర్న్: అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ జోయల్ హ్యూస్ అంత్యక్రియలు ముగిశాయి. మాక్స్‌విలేలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయం క్షేత్రం 408లో ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. దేశవాళీ మ్యాచ్ సందర్భంగా తలకు బౌన్సర్ తగలడంతో తీవ్రంగా గాయపడిన హ్యూస్ మృతి చెందిన విషయం తెలిసిందే. హ్యూస్ అంత్యక్రియలకు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ హాజరయ్యారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్‌తో పాటు ఇతర క్రికెటర్లు, అధికారులు, భారత్ జట్టు తరపున రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వేలాది మంది అభిమానులు, స్నేహితులు, బంధువులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో హ్యూస్ మృతికి సంతాపం తెలియజేశారు. (ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి) -
ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు
-
హ్యూస్ వియ్ మిస్ యూ: మోదీ
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ జోయల్ హ్యూస్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈమేరకు తన సందేశాన్ని ట్విటర్ పోస్ట్ చేశారు. 'అందరి హృదయాలను కలచివేస్తూ ఆస్ట్రేలియాలో హ్యూస్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. హ్యూస్ నిన్ను మిస్సవుతున్నాం. నీ ఆటతీరు, విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నావు. నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు. హ్యూస్ కు యావత్ క్రికెట్ ప్రపంచం కన్నీటి వీడ్కోలు పలికింది. హ్యూస్ అంతిమయాత్రలో ఆస్ట్రేలియా, భారత క్రికెటర్లతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Heart-rending funeral in Australia. Phil Hughes, we will miss you. Your game & exuberance won you fans all over! RIP. — Narendra Modi (@narendramodi) December 3, 2014 -
నేడు క్రికెటర్ హ్యూస్ అంత్యక్రియలు
-
హ్యూస్ అంత్యక్రియలు నేడు
భారీ సంఖ్యలో హాజరుకానున్న అభిమానులు క్రికెటర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా.. శవపేటిక మోయనున్న క్లార్క్, ఫించ్ ఆసీస్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం మెల్బోర్న్: రాకాసి బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ జోయల్ హ్యూస్ అంత్యక్రియలు నేడు (బుధవారం) మాక్స్‌విలేలో జరగనున్నాయి. మాక్స్‌విలే హైస్కూల్ స్పోర్ట్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న అంతిమ సంస్కారాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరుకావాలని క్రికెటర్ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో పాటు 300 నుంచి 400 మంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు... 5 వేలమందికిపైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. న్యూసౌత్ వేల్స్, ఆసీస్ టెస్టు జట్లు మొత్తం మాక్స్విలేకు రానున్నాయని హ్యూస్ మేనేజర్ జేమ్స్ హెండర్సన్ వెల్లడించారు. క్రికెటర్‌ను చివరిసారిగా చూడాలనుకుంటున్న వారందరూ హాల్లోకి రావొచ్చని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆటగాళ్ల ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ తొలుత క్రికెటర్లు హ్యూస్కు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ సమర్పించనున్నారు. తర్వాత ఆటగాడి పార్థివ దేహాన్ని మాక్స్‌విలేలో ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ హాల్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ గ్రామంలోని వీధుల వెంబడి వరుసగా నిలబడి హ్యూస్కు ప్రత్యేక వీడ్కోలు పలకనున్నారు. మాక్స్‌విలేలో ప్రసిద్ధి చెందిన ‘టైలర్స్ ఆర్మ్ హోటల్’కు కొద్ది దూరంలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయం క్షేత్రం 408లో క్రికెటర్ దేహాన్ని ఖననం చేయనున్నారు. ఆసీస్ తరఫున బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను అందుకున్న 408వ క్రికెటర్ కావడంతో తన క్షేత్రానికి హ్యూస్ అదే సంఖ్యను పెట్టుకున్నాడు. క్రికెట్ లేనప్పుడు వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువగా గడిపే హ్యూస్ ఇక శాశ్వతంగా అక్కడే ఉండిపోనున్నాడు. శవపేటిక మోయనున్న క్లార్క్, ఫించ్ హ్యూస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న ఆసీస్ కెప్టెన్ క్లార్క్... ఫించ్, టామ్ కూపర్లతో కలిసి క్రికెటర్ పార్థివ దేహా (శవపేటిక)న్ని మోయనున్నాడు. అంత్యక్రియల ఏర్పాట్లలో హ్యూస్ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే కెప్టెన్ భాగం పంచుకుంటున్నాడు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆసీస్ స్పోర్టింగ్ కలర్స్ అయిన ఆకుపచ్చ, బంగారు వర్ణాలతో మాక్స్‌విలేలోని స్టోర్స్, పబ్లిక్ బిల్డింగ్‌లను అలంకరించనున్నారు. వీధుల్లో పూలతో అలంకరించిన హ్యూస్ ఫొటోలను ఏర్పాటు చేశారు. హ్యూస్ అంత్యక్రియలను పలు చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్సీజీ, అడిలైడ్, వాకా, ఓవల్ మైదానాల్లోని బిగ్స్క్రీన్లపై కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ‘బౌండరీ’ నిండిన పుష్పాలు మాక్స్‌విలేలోని బౌండరీ స్ట్రీట్ లైన్లో ఉన్న హ్యూస్ ఇంటికి ఇంకా పుష్పగుచ్చాలు అందుతూనే ఉన్నాయి. హ్యూస్ పార్థివ దేహం కోసం మాక్స్‌విలే ఎదురుచూస్తోందని ప్రాథమిక పాఠశాల టీచర్, క్రికెటర్ తల్లి విర్జినీయా స్నేహితురాలు నోర్మా చెప్పింది. ‘గ్రామంలోని ప్రతి ఒక్కరికి రాబోయే రోజులు చాలా భారంగా గడుస్తాయి. మాక్స్‌విలే అందరి దృష్టిలో పడటం ఇది రెండోసారి. 1964లో రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుడు ఫ్రాంక్ ప్యాట్రిడ్జ్ వీసీ అంత్యక్రియల్లో చాలా మంది పెద్దవాళ్లు పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడు అలాంటి వాతావరణమే ఇక్కడ నెలకొంది’ అని నోర్మా వ్యాఖ్యానించింది. గ్రామానికి గుర్తింపు తెచ్చిన హ్యూస్ అంటే అక్కడి వారు ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. చిన్నప్పుడు హ్యూస్కు బౌలింగ్ యంత్రాన్ని కొనిపెట్టిన మాక్స్విల్లే ఎక్స్ సర్వీస్‌మెన్ క్లబ్ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
హ్యూస్ 'హోం గ్రౌండ్'లో తొలిటెస్టు?
సిడ్నీ: భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలిటెస్టు వేదికను మార్చే యోచనలో ఉన్నారు. దివంగత క్రికెటర్ ఫిలిప్స్ హ్యూస్ కు నివాళిగా తొలి టెస్టును అడిలైడ్ లో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సన్నద్దమైనట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4 వ తేదీ నుంచి తొలి టెస్టు బ్రిస్బేన్ లో నూ, రెండో టెస్టు డిసెంబర్ 12వ తేదీ నుంచి అడిలైడ్ లో ఆరంభం కావాలి. అయితే తొలి టెస్టు ను హ్యూస్ సొంత గ్రౌండ్ అడిలైడ్ కు మారిస్తే ఎలా ఉంటుంది అనే యోచనలో సీఏ ఉంది. తొలి టెస్టు రద్దయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినా.. అందుకు బదులుగా తొలిటెస్టును అడిలైడ్ ఏర్పాటు చేస్తేనే హ్యూస్ కు సరైన నివాళిగా ఉంటుందని క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు. బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం (డిసెంబర్ 3న) జరగనున్నాయి. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన హ్యూస్ గురువారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఫిల్ హ్యూస్కు ఘన నివాళి
-
అంత్యక్రియలు 3న
సిడ్నీ: రాకాసి బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం (డిసెంబర్ 3న) జరగనున్నాయి. ఈ మేరకు నార్తర్న్ న్యూసౌత్ వేల్స్‌లోని తమ సొంతూరు మాక్స్‌విలేలో ఏర్పాట్లు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిల్ చదువుకున్న పాఠశాలలోని స్పోర్ట్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు క్రికెటర్‌కు అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని చానెల్ నైన్‌తో పాటు ఇతర టీవీ, రేడియో ప్రసార సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెబ్సైట్, యాప్‌లో కూడా ఇది అందుబాటులో ఉండనుంది. అన్ని వైపుల నుంచి హ్యూస్ కుటుంబానికి మద్దతిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. ‘ఫిల్ ఆత్మకు శాంతి కలగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంతిమ సంస్కారాలకు ఎక్కువ మంది హాజరుకావడానికి హాల్లో స్థలం సరిపోదు. కాబట్టి దేశం మొత్తం అంతిమ సంస్కారాలను చూసేందుకు ఈ లైవ్ ఉపయోగపడుతుంది’ అని సదర్లాండ్ వ్యాఖ్యానించారు. అంత్యక్రియల్లో హ్యూస్ కుటుంబాన్ని ఏకాంతంగా వదిలేయాలని సీఏ కోరింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, అడిలైడ్, ఓవల్ మైదానాల్లోని బిగ్ స్క్రీన్లపై కూడా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అంత్యక్రియలకు హాజరుకావాలనుకునే అభిమానుల కోసం సిడ్నీ, కోఫ్స్ హార్బర్ల మధ్య ‘క్వాంటాస్' అదనంగా రెండు ప్రత్యేక విమానాలను నడపనుంది. హార్బర్ నుంచి మాక్స్విలేకు కారులో 45 నిమిషాల ప్రయాణం. ఆసీస్ జట్టు ఘన నివాళి చెంపలపై చెరగని చిరునవ్వు... కళ్లలో ఓ రకమైన మెరుపు.. పక్కనుంటే అదోరకమైన ఆహ్లాదం... అంటూ సహచరుడు హ్యూస్కు ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ జట్టు తరఫున ఘనంగా నివాళులు అర్పించాడు. ఇక నుంచి ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ మునుపటిలా ఉండదని వ్యాఖ్యానించిన కెప్టెన్ ఓ దశలో భావోద్వేగాన్ని అణుచుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘మేం కోల్పోయిన దాన్ని మాటల్లో చెప్పలేం. హ్యూస్కు క్రికెట్ అంటే పిచ్చి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పశువులను బాగా ఇష్టపడేవాడు. సహచరులతో కలిసి దేశం తరఫున ఆడటాన్ని ఆస్వాదించేవాడు. ప్రస్తుతం మేం అతని చిరునవ్వును, మెరుపును కోల్పోతున్నాం. హ్యూస్ మరణంతో ప్రపంచ క్రికెట్ నిరాశలో కూరుకుపోయింది, క్రికెటర్ అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం’ అని కెప్టెన్ పేర్కొన్నాడు. వన్డేల్లో హ్యూస్ ధరించే 46వ నంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు సీఏ అంగీకరించిందన్నాడు. -
హ్యూస్ 'జెర్సీ నెంబర్ 64' రిటైర్
మెల్బోర్న్: ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ గౌరవార్థం అతని అంతర్జాతీయ వన్డే జెర్సీని రిటైర్ చేశారు. హ్యూస్ జెర్సీ నెంబర్ 64ను ఇకమీదట ఎవరికీ కేటాయించరు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ చెప్పాడు. హ్యూస్ జెర్సీని రిటర్ చేయాలని ప్రతిపాదించగా, క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించిందని క్లాక్ వెల్లడించాడు. హ్యూస్ లేని లోటు తీర్చలేనిదని, డ్రెస్సింగ్ రూమ్ మునుపటిలా ఉండదని క్లార్క్ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశవాళీ మ్యాచ్‌లో తలకు బౌన్సర్ తగిలి హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. -
దిగ్భ్రాంతి... విషాదం...
హ్యూస్ మృతికి సంతాపాల వెల్లువ అడిలైడ్ / న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతితో ప్రపంచ క్రీడా ప్రేమికులతో పాటు క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకుంటున్న క్రమంలో పాతికేళ్ల వయస్సులోనే అనూహ్య పరిస్థితిలో ప్రాణాలు వదిలిన హ్యూస్‌పై విశ్వవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. ఇది క్రికెట్‌కే దారుణమైన రోజుగా పలువురు అభివర్ణించారు. కొందరు తమ ఆవేదనను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పంచుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఎబాట్, ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐలతో పాటు ఇతర బోర్డులు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, భారత్, ఆసీస్ ఆటగాళ్లు, ఇతర జట్ల ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు, బాలీవుడ్ నటులు ఇలా ప్రతీ ఒక్కరు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తమ ఆటగాడి మృతికి నివాళి ఘటిస్తూ ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆసీస్ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ‘ఫిలిప్ మరణంతో మేమంతా షాక్‌కు గురయ్యాం. మొత్తం క్రికెట్ ప్రపంచం తరఫున అతడి కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ - ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ ‘మరో రెండు రోజుల్లో పుట్టిన రోజును జరుపుకోవాల్సిన హ్యూస్ మృతి ఆవేదన కలిగించింది. క్రికెట్ సమాజంలో చెరగని ముద్ర వేస్తూ వెళ్లిపోయిన అతడి కుటుంబానికి మా సానుభూతి’ - బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ‘ఫిలిప్ మరణ వార్త విని షాకయ్యాను. క్రికెట్‌కు ఇది విచారకరమైన రోజు. అతడి కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు నా సంతాపం తెలుపుతున్నాను’ - సచిన్ టెండూల్కర్ ‘తొలి టెస్టును రద్దు చేస్తే బావుంటుంది’ ‘హ్యూస్ మరణంతో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆటపై వంద శాతం మనస్సును పెట్టలేరనేది నా అభిప్రాయం. ఇది నిజంగా చాలా కష్టకాలం. ఇరు జట్ల మధ్య తొలి టెస్టుకు కేవలం వారం రోజుల సమయం ఉంది. అయితే ఎవరూ కూడా ఇప్పుడు ఆడే స్థితిలో లేరనిపిస్తోంది. అందుకే ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలా? లేదా? అనే విషయాన్ని ఇరు బోర్డులు ఓసారి పరిశీలించాల్సి ఉంది’ - సునీల్ గవాస్కర్ ‘క్రీడలో విషాదం అనే మాట తరచుగా వాడుతున్నా ఇది మాత్రం నిజ జీవిత విషాదం. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇది ఊహించని దెబ్బ. అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులకు మా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది’ - సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ -
నాటౌట్‌గా ‘ఆట' ముగించాడు!
ఐదేళ్ల క్రితం... ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనేందుకు ఫిలిప్ హ్యూస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాతా అదే బలహీనత వెంటాడటంతో ఆసీస్ జట్టులో సుస్థిర స్థానం సాధించలేకపోయాడు. క్రికెట్ పుస్తకంలో ఉండే, సంప్రదాయ షాట్లకు భిన్నంగా ఊళ్లలో ఆడుకునే తరహాలో ఉండే హ్యూస్ శైలికి బౌన్సర్లు కొరుకుడు పడలేదు. దాంతో జట్టులో ఎవరో గాయపడితే తప్ప అవకాశం రాని పరిస్థితి. అయితే ఫిల్ దీనిని సులువుగా వదిలి పెట్టలేదు. పట్టుదలగా పోరాడాడు. బిగ్బాష్లాంటి టోర్నీలను కాదని కౌంటీల బాట పట్టాడు. ఆసీస్ దేశవాళీ మ్యాచ్‌లలో బౌన్సర్లను ఆడటం సాధన చేశాడు. అందులో పర్ఫెక్షనిస్ట్గా మారాడు. షెఫీల్డ్ షీల్డ్ పోటీల్లో కూడా అలవోకగా బౌన్సర్లను ఎదుర్కొన్నాడు. అయితే ఈసారి మాయదారి బౌన్సర్ కెరీర్‌నే కాదు ప్రాణాలనే తీసుకుపోయింది. ఆ ఒక్క బంతి హ్యూస్కు ఆఖరిది అయింది. దానిని సరిగా అంచనా వేయడంలో జరిగిన వైఫల్యం ఈ యువ క్రికెటర్ జీవితాన్ని అర్ధంతరంగా ముగించింది. క్రికెట్‌పై పిచ్చితో... న్యూసౌత్‌వేల్స్‌లో కేవలం 7 వేల మంది జనాభా ఉన్న మాక్స్‌విలేలో హ్యూస్ పుట్టాడు. తండ్రి అరటికాయలు పండించే రైతు. పాఠశాల స్థాయిలో రగ్బీతో పాటు క్రికెట్లో రాణించిన హ్యూస్లో ఉత్సాహం చూసిన తల్లిదండ్రులు అతని కోసమే సిడ్నీకి మకాం మార్చారు. అక్కడి పాఠశాలలో చేరింది మొదలు అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న హ్యూస్, ఆ తర్వాత అదే వేగంతో దూసుకుపోయాడు. దాంతో న్యూసౌత్‌వేల్స్ కాంట్రాక్ట్ దక్కడం, ఆ తర్వాత 2008 అండర్-19 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్‌గా ఆడటం చకచకా జరిగిపోయాయి. అన్నీ నంబర్వన్లే 19 ఏళ్ల వయసులోనే షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఫైనల్లో సెంచరీతో ఆ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా హ్యూస్ ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలితమే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు స్థానం. కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగే బంతులాడి డకౌట్! అయితే ఫిల్ అసలు ప్రతిభ రెండో టెస్టులో బయటపడింది. డర్బన్లాంటి ఫాస్టెస్ట్ వికెట్‌పై స్టెయిన్, మోర్కెల్‌లాంటి బౌలర్లనూ ఎదుర్కొంటూ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతను సెంచరీలు బాదాడు. ఇక్కడా తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన రికార్డు అతనిదే. గత ఏడాది ఆడిన తొలి వన్డేలోనూ సెంచరీ చేసి హ్యూస్ మరే ఇతర ఆస్ట్రేలియన్‌కు సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. ఈ ఏడాది జూలైలో మరో ‘మొదటి’ రికార్డు అతని ఖాతాలో చేరింది. లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొని తన వన్డే సత్తా కూడా బయటపెట్టాడు. 23 ఏళ్ల వయసులో ఆర్కీ జాక్సన్ (1933) టీబీతో చనిపోయిన తర్వాత ఇంత చిన్న వయసులో తనువు చాలించిన ఆస్ట్రేలియన్‌గా హ్యూస్ మరణంలోనూ పిన్న వయస్కుడిగానే నిలవడం విషాదం! ఆగిన ఆశ...శ్వాస కొన్నాళ్ల క్రితమే హ్యూస్ ఆటతీరులో వచ్చిన మార్పును గమనించిన అతని మిత్రుడు, ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ‘100 టెస్టుల వీరుడు’ అంటూ ప్రశంసలు కురిపించాడు. తొందరగా తప్పులు దిద్దుకొని అగ్రస్థానానికి ఎదిగే సత్తా అతనిలో ఉందంటూ హేడెన్, లాంగర్లాంటి ఓపెనర్లతో అంతా అతడిని పోల్చారు. హ్యూస్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. రెండేళ్ల క్రితమే అతను సొంత జట్టు న్యూసౌత్‌వేల్స్‌ను వదిలి సౌత్ ఆస్ట్రేలియాతో చేరాక మరింత రాటుదేలాడు. తుది జట్టులో స్థానం రాకపోయినా వరుస సిరీస్‌లలో జట్టుతో ఉంటూ వచ్చిన అతను దానిని నామోషీగా భావించలేదు. ‘నేను రిజర్వ్ ఆటగాడినే కావచ్చు. కానీ నా సహచరులకు సర్వీస్ చేయడం తప్పుగా భావించను. జట్టుతో ఉండటమే ముఖ్యమని నేను భావిస్తా. నా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. వచ్చిన రోజు నిరూపించుకోవడమే నా పని’ అని అతను చెప్పేవాడు. ఇటీవలే ఆస్ట్రేలియా ‘ఎ' తరఫున 243 పరుగులు చేయడం అతని అవకాశాలను మెరుగుపర్చింది. మంగళవారం కూడా అతను అదే లక్ష్యంతో బరిలోకి దిగాడు. ఆ సమయంలో మరో వారం రోజుల్లో మళ్లీ టెస్టు క్రికెట్ ఆడతాననే విశ్వాసంతో కనిపించిన హ్యూస్ జీవిత ఇన్నింగ్స్ ఇంతలోనే ముగిసిపోవడం నిజంగా బాధాకరం. - సాక్షి క్రీడావిభాగం -
దేవుడు కరుణించలేదు
మైదానంలో ఎంతో సాధించాలని కలలుగన్నాడు... బంగారంలాంటి భవిష్యత్‌ను ఊహించుకున్నాడు...ప్రాణం కంటే మిన్నగా ఆటను ప్రేమించాడు...బంతులతో ఆడుకున్నాడు... బ్యాట్లతో సావాసం చేశాడు... కానీ ఎన్నడూ జరగని.. ఎప్పుడూ ఊహించని రీతిలో...విధి ఆడిన వింత ‘ఆట'లో ఓడిపోయాడు. సొంత మైదానం.. అదే ఆట.. అదే బంతి...25 ఏళ్ల యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌ను శాశ్వతంగా ఈ లోకం నుంచి తీసుకుపోయింది. విధి ఆడిన ఈ క్రూర నాటకంలో... భగవంతుడూ దయ చూపలేదు... దేవుళ్లుగా భావించే డాక్టర్లూ ప్రాణం నిలుపలేదు. ఇది ఆ కుటుంబానికి కోలుకోలేని విషాదం... క్రికెట్‌కు దుర్దినం. సిడ్నీ: మెదడుకు గాయంతో రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) మరణాన్ని జయించలేకపోయాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యాన్ని అందించినా ఫలితం లేకపోయింది. శస్త్రచికిత్స అనంతరం కృత్రిమ కోమాలో ఉన్న హ్యూస్... కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య గురువారం ఆసుపత్రి బెడ్ మీదే కన్నుమూశాడు. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం దక్షిణ ఆస్ట్రేలియా-న్యూ సౌత్ వేల్స్‌ల మధ్య జరిగిన దేశవాళీ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బంతి హ్యూస్ మెడను బలంగా తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయం తర్వాత అతను స్పృహలోకి రాలేకపోయాడని డాక్టర్లు వెల్లడించారు. ఆసుపత్రికి ఆటగాళ్లు ఇక హ్యూస్ మరణం ఖాయమని తెలియగానే ఆసీస్ క్రికెటర్లందరూ ఆసుపత్రికి వచ్చారు. హాడిన్, స్మిత్, వాట్సన్, వార్నర్, లియోన్, హెన్రిక్, స్టార్క్, డానియెల్ స్మిత్, కోచ్ డారెన్ లీమన్లతో పాటు హ్యూస్కు అత్యంత సన్నిహితుడు కెప్టెన్ క్లార్క్ ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడుపుతూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెదడులో రక్తం వరద హ్యూస్కు అయిన గాయాన్ని వైద్య భాషలో ‘వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్’ అంటారని ఆస్ట్రేలియా టీమ్ డాక్టర్ పీటర్ బ్రూక్నెర్ వెల్లడించారు. ఈ గాయం ‘సబ్అర్కానైడ్ హేమరెజ్’కు దారితీస్తుందని చెప్పారు. ‘బంతి క్రికెటర్ మెడను తగిలినప్పుడు మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే వెన్నుపూస ప్రధాన ధమనుల్లో ఒకటి కుంచిం చికుపోయి తెగిపోయింది. దీంతో మెదడులో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇలాంటి ఉదంతాల్లో ఈ సంఘటన చాలా అరుదుగా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే మెడ మీద గాయమైనప్పుడు మెదడులో రక్తస్రావం కావడమనేది అరుదు. ఇప్పటి వరకు వైద్య చరిత్రలో ఇలాంటి కేసులు 100 నమోదైతే అందులో క్రికెట్ బంతి తగిలి గాయపడటం ఇది రెండోసారి మాత్రమే’ అని బ్రూక్నెర్ తెలిపారు. మరోవైపు ఇలాంటి సంఘటనల్లో తరచుగా లేదా తక్షణమే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని హ్యూస్కు చికిత్స అందించిన సెయింట్ విన్సెంట్ ఆసుపత్రి ట్రూమా విభాగం అధిపతి డాక్టర్ టోనీ గ్రాబ్స్ అన్నారు. గతంలో ఇలాంటి వాటికి ఆసుపత్రిలో చికిత్స అందించిన దాఖలాలు లేవన్నారు. ‘హ్యూస్ గాయం ఓ విపత్తులాంటిది. దాన్ని అంచనా వేయడానికి అత్యవసరంగా స్కానింగ్‌లు తీశాం. మెదడుపై ఒత్తిడి తగ్గించేందుకు శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు నిర్ణయించారు. కొన్నిసార్లు రోగిని మగతలో ఉంచేందుకు తక్కువ మొత్తంలో రక్తాన్ని మెదడు చుట్టూ ఉంచాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. కాబట్టి ఈ పరిస్థితిని నివారించడానికి ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స ద్వారా హ్యూస్ పుర్రెలో కొంత భాగాన్ని తొలగించాం. మెదడు వ్యాకోచం చెందడానికి వీలుగా ఇది చేయాల్సి వచ్చింది. గంటా 20 నిమిషాల్లో దీన్ని ముగించి హ్యూస్‌ను కృత్రిమ కోమాలో ఉంచాం. 48 గంటల్లో అతను కోలుకోవాల్సి ఉంది. కానీ క్రికెటర్ పరిస్థితిలో పెద్దగా మెరుగుదల కనిపించలేదు. మెదడు యథాస్థితికి రాలేకపోయింది. దీంతో హ్యూస్కు ప్రాణాపాయం తప్పలేదు’ అని గ్రాబ్స్ వెల్లడించారు. మైదానంలో హ్యూస్కు అందించిన చికిత్స బాగుందని ఇద్దరు డాక్టర్లు స్పష్టం చేశారు. -
క్రికెటే ప్రాణం అనుకున్నాడు!
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు క్రికెటే శ్వాస. క్రికెటే ప్రాణం అనుకున్నాడు. క్రికెట్ తోడిదే జీవితం అనుకున్నాడు. చివరకు మరణంలోనూ క్రికెట్‌నే శ్వాసించాడు. మైదానంలో అడుగు పెట్టే ప్రొఫెషనల్ ఆటగాళ్లందరికీ ఆటే జీవితకాలపు సహచరి. అందుకే పాతికేళ్ల వయసులోనే ప్రపంచం గర్వపడేస్థాయి ఆటగాడయ్యాడు. మొదటి టెస్టులోనే రాణించి సెహభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాతి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాది వహ్వా అనిపించుకున్నాడు. అగ్రశ్రేణి క్రికెటర్లంతా ఎవడీ కుర్రాడు అని అబ్బుర పడేలా ఆటలో లీనమైపోయాడు. రెండు రోజుల క్రితం న్యూ సౌత్ వేల్స్ జట్టుతో షెఫిన్ షీల్డ్ మ్యాచ్‌లోనూ హ్యూస్ అదరగొట్టేలాగే ఆడాడు. 60 పై చిలుకు పరుగులు చేసి మరో సెంచరీ వైపు చూస్తున్నాడు. అంతలో న్యూ సౌత్ వేల్స్ బౌలర్ సీన్ అబాట్ విసిరిన ఓ బౌన్సర్‌ను హుక్ చేద్దామనుకున్న హ్యూస్ అంచనా తప్పింది. బంతి నేరుగా తలకు మెడకు మధ్య సున్నితమైన భాగాన్ని వేగంగా వచ్చి తాకింది. అంతే హ్యూస్ కుప్ప కూలిపోయాడు. వెంటనే హెలికాప్టర్‌పై హ్యూస్‌ను సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌కు తరలించారు. తలకు సర్జరీ చేయాలని వైద్యులు తేల్చారు. హ్యూస్ అప్పటికే కోమాలోకి వెళ్లిపోయాడు. చికిత్స పొందుతూ హ్యూస్ ఈ రోజు తుది శ్వాస విడిచాడు. కెరీర్లో ఇప్పటి వరకు 26 టెస్టులు ఆడిన హ్యూస్ వచ్చే నెల 4 నుంచి ఆరంభం కానున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మొదటి టెస్ట్‌కు ఆసీస్ జట్టులో స్థానం పొందాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. హ్యూస్కు గాయం అయ్యిందని తెలియగానే ప్రపంచ క్రీడా ప్రముఖులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. హ్యూస్ త్వరగా కోలుకోవాలని బ్రియన్ లారా వంటి దిగ్గజాలంతా ప్రార్ధించారు. క్రికెట్ ఆస్ట్రేలియా అంతా హ్యూస్ కోలుకోవాలని ప్రార్ధనలు చేసింది. అందరి ఆకాంక్షలు, ప్రార్ధనలూ ఫలించి హ్యూస్ ప్రాణం పోసుకుని లేచి వస్తాడని అందరూ కలలు కన్నారు. కానీ చివరి బంతి వరకూ క్రమశిక్షణతో ఆడే అలవాటున్న హ్యూస్, ఆసుపత్రిలోనే చివరి శ్వాస విడిచాడు. గతంలో భారత బ్యాట్స్ మన్ రామన్ లంబా కూడా ఇలాగే క్రికెట్ మైదానంలోనే తలకు గాయమై ప్రాణాలు విడిచాడు. కాకపోతే రామన్ లంబా సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తూ తలకు గాయమై మరణించాడు. ఇపుడు హ్యూస్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. హ్యూస్, రామన్ లంబాలు తుది శ్వాస వరకు క్రికెట్‌నే ప్రేమించారు. క్రికెటే జీవితం అనుకున్నారు. క్రికెట్ అంటే అంత పిచ్చి వారికి. ఆట అంటే అంత అభిమానం వారికి. ఆ ఆటతోనే అంతిమ యాత్రకూ సిద్ధమయ్యారు. ** -
బంతి తగిలితేనే మరణించాడా?
ఫిల్ హ్యూగ్స్ మరణంతో క్రికెట్ అభిమానులే కాదు.. యావత్ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. కానీ, కేవలం చిన్న బంతి తగిలితేనే ప్రాణాలు పోతాయా అని చాలామందికి అనుమానం వచ్చింది. అసలే ఏం జరిగిందోనన్న ఆత్రుత, ఆసక్తి చాలామందిలో కనిపించాయి. మరి హ్యూగ్స్ మరణానికి కారణం ఏంటో ఒక్కసారి చూద్దామా.. నవంబర్ 25వ తేదీన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆడుతుండగా హ్యూగ్స్ తలకు ఓ బౌన్సర్ వచ్చి తగిలింది. వెంటనే రెండు క్షణాల్లోనే పడిపోయిన హ్యూగ్స్ మరి లేవలేదు. అటునుంచి అటే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. మెడకు ఒక పక్క ఉండే వెర్టెబ్రల్ ఆర్టెరీకి బంతి వచ్చి బలంగా తగలడం వల్ల అది బాగా నలిగిపోయిందని వైద్యులు తెలిపారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఇది చాలా కీలకం. అయితే అది నలిగిపోవడం వల్ల మెదడులోకి రక్తసరఫరా సరిగా జరగలేదు. ఇది అత్యంత ప్రమాదకరం. దీన్ని వైద్యపరిభాషలో వెర్టెబ్రల్ ఆర్టెరీ డిసెక్షన్ అంటారు. ఈ తరహా ప్రమాదం అత్యంత అరుదైనదని, ఎప్పుడో గానీ జరగదని హ్యూగ్స్కు చికిత్స చేసిన సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మెదడు చుట్టూ ఉండే పుర్రెలో కొంత భాగాన్ని తొలగించి మెదడుకు రక్తసరఫరా పెంచేందుకు ప్రయత్నించారు. తర్వాత మెదడుకు తగినంత విశ్రాంతి ఇవ్వడానికి హ్యూగ్స్‌ను బలవంతంగా కోమాలోకి పంపారు. అయినా ఫలితం లేకపోవడంతో.. హ్యూగ్స్ ప్రాణాలు వదిలాడు. -
హ్యూస్ మృతితో పలుమ్యాచ్ లు పాక్షికంగా రద్దు!
సిడ్నీ: ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతితో పలు మ్యాచ్ లు పాక్షికంగా రద్దయ్యాయి. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా ఎలెవన్ తో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో తొలి రోజును రద్దు వేస్తున్నట్లు జట్టు మేనేజ్ మెంట్ స్సష్టం చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ ను ఒక రోజు పాటు రద్దు చేస్తున్నట్లు టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్, డైరెక్టర్ రవిశాస్త్రిలు ఆటగాళ్లకు తెలిపారు. దీంతో రేపు ఆరంభం కావాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ శనివారానికి వాయిదా పడింది. ఇదిలా ఉండగా పాకిస్థాస్, న్యూజిలాండ్ ల మధ్య జరిగే చివరి టెస్టు కూడా ఒక రోజు పాటు రద్దుచేశారు.షెడ్యూల్ ప్రకారం పాక్-కివీస్ ల మ్యాచ్ శుక్రవారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది. ఇరు బోర్డుల అంగీకారంతో ఆ టెస్ట్ మ్యాచ్ లో ఒక రోజు మ్యాచ్ ను రద్దు చేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈరోజు తుదిశ్వాస విడిచాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ హ్యూస్ మంగళవారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. -
క్రికెట్ 'గాయాలు'
సిడ్నీ:క్రికెట్ లో గాయాలు కావడం సర్వసాధారణమే అయినా.. కొన్నిసందర్భాల్లో క్రికెటర్లు మృత్యువుతో సాహసం చేస్తుంటారు. నాటి నుంచి నేటి వరకూ క్రికెటర్లను 'గాయాలు' బాధిస్తూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ ను అప్పుడప్పుడూ మరణాలు షాక్ కు గురి చేస్తుంటాయి. తాజాగా ఆసీస్ క్రికెటర్ హ్యూస్ తలకు తీవ్రంగా గాయం కావడంతో మృత్యువుతో రెండు రోజులు పోరాడి అసువులు బాసాడు. గతంలో కొంతమంది క్రికెటర్లు మృతి చెందగా, మరి కొందరు క్రికెట్ తీవ్ర గాయాలతో ఆట నుంచి వైదొలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. *1959 లో అబ్దుల్ అజీజ్.. 19 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతూ బాల్ తన ఛాతికి బలంగా తగలడంతో కుప్పకూలిపోయాడు. చివరకు ఆస్పత్రిలో మరణించాడు. *1960లో వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫ్రిత్ వేసిన బౌన్సర్ భారత క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ తలకు తగలడంతో ఆరు రోజులు కోమాలు ఉన్నాడు. ఆ మ్యాచ్ అనంతరం నారీ కాంట్రాక్టర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. *1975 లో న్యూజిలాండ్ ఆటగాడు ఈవెన్ ఛాట్ ఫీల్డ్ కు ఇంగ్లండ్ పేసర్ పీటర్ లీవర్ వేసిన బంతి తగలడంతో అతనికి నాలుకకు తీవ్రగాయమైంది. అనంతరం అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. *1986లో వెస్టిండీస్ స్పీడ్ స్టార్ మైకేల్ మార్షల్ వేసిన బంతి ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్ ముక్కుకు తగిలి అతనికి తీవ్ర గాయమయ్యింది. *భారత ఆటగాడు రమణ్ లాంబా షార్ట్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఆటగాడు మెహ్రబ్ హుస్సేన్ కొట్టిన షాట్ కు కుప్పకూలిపోయాడు. మూడు రోజుల కోమాలో ఉన్న అనంతరం లాంబా మృతి చెందాడు. -
క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కన్నుమూత
-
హ్యూస్ మరణంపై క్రికెటర్ల స్పందన
ఆసీస్ క్రికెటర్ ఫిలిప్స్ హ్యూస్ మరణ వార్తతో యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. హ్యూస్ కు తలకు గాయం కావడంతో కోలుకుంటాడని అందరూ భావించారు. ఆ ఆశలను నిరాశపరుస్తూ హ్యూస్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతని మరణం నిజంగా క్రికెట్ కు ఒక గాయం. రెండు రోజుల క్రితం క్రికెట్ ఆడుతూ తీవ్ర్గంగా గాయపడిన హ్యూస్ మృత్యువుతో పోరాడలేకపోయాడు. క్రికెట్ లో ప్రత్యర్థులపై పోరాడిన హ్యూస్.. మరణాన్ని జయించడంలో విఫలమయ్యాడు. హ్యూస్ మరణవార్తపై పలువురు క్రికెటర్ల ట్విట్టర్లో తమ స్పందన తెలియజేశారు. హ్యస్ కు ఆత్మకు శాంతి చేకూరాలని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రార్థించాడు. ఆ మరణవార్తను జీర్ణించుకునే శక్తి అతని కుటుంబానికి ఇవ్వాలంటూ శ్రీశాంత్ తన ట్వీట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు 'హ్యూస్ ఇంత తొందరగా వెళ్లిపోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు శాంతి చేకూరాలి' అని పీర్స్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఈ మరణవార్త తనను చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోహ్లీ ట్వీట్ చేశాడు. హ్యూస్ కుటుంబానికి అతని ఆత్మకు శాంతి చేకూరాలంటూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. -
మరో మూడు రోజుల్లో బర్త్ డే.. అంతలోనే విషాదం
-
మరో మూడు రోజుల్లో బర్త్ డే.. అంతలోనే విషాదం
సిడ్నీ:ఆసీస్ టాప్ ఆర్డర్ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మరణం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. రెండు రోజుల క్రితం దేశవాళీ టోర్నీ ఆడుతూ గాయపడిన హ్యూస్ మృత్యువుతో పోరాడి గురువారం తుదిశ్వాస విడిచాడు. మరో మూడు రోజుల్లో(నవంబర్ 30) హ్యూస్ పుట్టినరోజు ఉండగా ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత్ తో బ్రిస్బేన్ లో జరిగే తొలిటెస్టులో ఆడటానికి దాదాపు మార్గం సుగుమం చేసుకున్న వేళ హ్యూస్ ఇకలేడన్న చేదు వార్త క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు ఆడిన హ్యూగ్స్ తన మొదటి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లోనే 72 పరుగులు చేశాడు. ఆ తరువాతి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అతని బెస్ట్ స్కోరు 160 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 138. -
తీవ్రమైన నొప్పిలేదుకానీ... అప్పటికే విషమం
సిడ్నీ : సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కుటుంబ సభ్యులకు వైద్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స జరిగినన్ని రోజులు హ్యూస్ కోలుకునే పరిస్థితిలో లేడని వైద్యులు పేర్కొన్నారు. తీవ్రమైన నొప్పి లేనప్పటికీ...అప్పటికే పరిస్థితి విషమించిందని వారు తెలిపారు. చికిత్స జరిగిన చివరి క్షణం వరకూ అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఉన్నారన్నారు. కాగా హ్యూస్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. మంగళవారం సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ మ్యాచ్‌లో ఫిల్ హ్యూస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫాస్ట్ బౌలర్ అబాట్ వేసిన బౌన్సర్ బలంగా మెడ, తలకు తగలడంతో హ్యూస్ అక్కడిక క్కడే కుప్పకూలి పోయాడు. దాదాపు నలభై నిమిషాల పాటూ హ్యూస్ నోటిలో నోరుపెట్టి శ్వాస అందించే ప్రయత్నం చేసి అనంతరం అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. హ్యూస్ శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోవడంతో వెంటిలేటర్‌ను అమర్చారు. కృత్రిమ కోమాలో ఉన్న హ్యూస్ గురువారం తుది శ్వాస విడిచాడు. మరోవైపు హ్యూస్ మృతితో ఆసీస్ క్రికెట్ జట్టు విషాదంలో మునిగిపోయింది. -
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి
-
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈరోజు తుదిశ్వాస విడిచాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ హ్యూస్ మంగళవారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్కు తీవ్ర గాయం కావడం గమనార్హం. 2009 లో అరంగేట్రం చేసిన హ్యూస్ 26 టెస్టులు ఆడిన ఆనుభవం ఉంది. ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు ఆడిన హ్యూగ్స్ తన మొదటి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లోనే 72 పరుగులు చేశాడు. ఆ తరువాతి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అతని బెస్ట్ స్కోరు 160 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 138. *పూర్తి పేరు-ఫిలిప్ జోల్ హ్యూస్ *జననం- 30 నవంబర్, 1988 *మరణం-27 నవంబర్ 2014 *ముద్దు పేరు-హ్యూస్సీ *బ్యాటింగ్ శైలి-ఎడమ చేతి వాటం *బౌలింగ్ శైలి-కుడి చేతి వాటం *టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, సబ్ స్టిట్యూల్ వికెట్ కీపర్ *టెస్టుల్లో ఆరంగేట్రం - దక్షిణాఫ్రికాపై (ఫిబ్రవరి 29, 2009) *చివరి టెస్టు-ఇంగ్లండ్ పై (జూలై 18,2013) *వన్డేల్లో ఆరంగేట్రం-శ్రీలంకపై ( జనవరి 11,2013) *చివరి వన్డే-పాకిస్థాన్(అక్టోబర్ 12,2014) -
ఎలాంటి మార్పూ లేదు
సిడ్నీ: తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఆరోగ్య పరిస్థితిలో బుధవారం ఎలాంటి మెరుగుదల రాలేదు. ఇప్పటికీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ‘ఫిల్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. ఇంకా విషమంగానే ఉంది. స్కానింగ్ నివేదికలు వచ్చిన తర్వాత, ఏదైనా మెరుగుదల ఉంటే తెలియజేస్తాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. మంగళవారం షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడుతూ అబాట్ బౌలింగ్‌లో బంతి తలకు తగలడంతో హ్యూస్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలోని ప్రస్తుత రౌండ్ అన్ని మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు సీఏ ప్రకటించింది. ‘హ్యూస్ ఆరోగ్యం గురించి ఆటగాళ్లంతా ఆందోళనగా ఉన్నారు. ఇది క్రికెట్ ఆడేందుకు తగిన సమయం కాదు. ఈ విషయాన్ని ఆటగాళ్లతో చర్చించిన అనంతరం మ్యాచ్‌లు రద్దు చేశాం’ అని సీఏ ఈజీఎం హోవార్డ్ చెప్పారు. హ్యూస్ పాత హెల్మెట్ ధరించాడు... మ్యాచ్ ఆడుతున్న సమయంలో హ్యూస్ తమ సంస్థ రూపొందించిన కొత్త తరహా మోడల్ కాకుండా పాత హెల్మెట్‌ను ధరించినట్లు తయారీదారు ‘మసూరి’ సంస్థ ప్రకటించింది. దాంతో కాస్త ఎక్కువ రక్షణ లభించేదన్న సదరు సంస్థ... కొత్త మోడల్ హెల్మెట్, హ్యూస్‌ను కాపాడేదా అనే ప్రశ్నకు మాత్రం తగిన సమాధానమివ్వలేదు. మరోవైపు ఫిల్ త్వరగా కోలుకోవాలంటూ సచిన్ తేందూల్కర్, గిల్‌క్రిస్ట్, లారావంటి ప్రముఖులు ఆకాంక్షించారు. ‘క్రికెట్ ప్రమాదకర క్రీడ. రగ్బీ, రేసింగ్లాగే ఇందులోనూ ఎల్లప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి ఘటన మరోసారి జరగదని అనుకోలేము. హ్యూస్ ఘటన దురదృష్టకరం. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని లారా అభిప్రాయపడ్డారు. -
పాత హెల్మెట్ ధరించడం వల్లే...
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూస్ పాత మోడల్ హెల్మెట్ ధరించడం వల్లే అతడు తీవ్రంగా గాయపడటానికి కారణమని హెల్మెట్ తయారీ దారులు చెబుతున్నారు. యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన హెల్మెట్ తయారీ సంస్థ ప్రతినిథి మసూర్ మీడియాతో మాట్లాడుతూ హ్యూస్ ..షెఫిల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ధరించిన హెల్మెట్ లేటెస్ట్ మోడల్‌ది కాదన్నారు. హ్యూస్ ధరించిన హెల్మెట్ గత ఏడాది విడుదలైన మోడల్ అని వివరించారు. లేటెస్ట్ మోడల్లో తలకు పూర్తి రక్షణ ఇచ్చేలా డిజైన్ చేసినట్లు మనూర్ చెప్పారు. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆకాంక్షించారు. కాగా హ్యూస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అతడు ప్రస్తుతం కృత్రిమ కోమాలో ఉన్నాడు. -
క్రికెట్ చాలా డేంజరస్ గేమ్: లారా
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూస్ త్వరగా కోలుకోవాలని వెస్టిండీస్ క్రికెటర్ బ్రయాన్ లారా ఆకాంక్షించాడు. క్రికెట్లో ఇటువంటి ప్రమాదకర సంఘటనలు జరుగుతూనే ఉంటాయని అతను అభిప్రాయపడ్డాడు. హ్యూస్ కోలుకోవాలని మొత్తం ప్రపంచంలోని క్రికెట్ ఆటగాళ్లంతా ప్రార్థిస్తున్నారని లారా పేర్కొన్నాడు. క్రికెట్ చాలా ప్రమాదకరమైన ఆట అని... ఎల్లప్పుడూ రిస్క్ ఉంటుందని లారా అభిప్రాయపడ్డాడు. కాగా 2004లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ వేసిన బాలు తగిలి లారా ....మైదానంలో కిందపడిపోయిన విషయం తెలిసిందే. -
కృత్రిమ కోమాలోనే క్రికెటర్ హ్యూస్
సిడ్నీ : ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి ఐసీయూలో అతను చికిత్స పొందుతున్నాడు. చికిత్స కోసం అతడిని వైద్యులు కృత్రిమ కోమాలోకి తీసుకెళ్లిన విషమం తెలిసిందే. ఈ ఘటనపై వెస్టిండీస్ క్రికెటర్ బ్రయాన్ లారా మాట్లాడుతూ 'హ్యూస్' ఘటన ప్రపంచవ్యాప్తంగా బౌలర్లపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. హ్యూస్కు గాయం కావటం దురదృష్టకరమన్నాడు. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపాడు. కాగా దేశవాళీ టోర్నీలో ఆడుతున్న టెస్టు క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మైదానంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్కు తీవ్ర గాయం కావడం గమనార్హం. -
హ్యూస్ పరిస్థితి విషమం!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్లో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. దేశవాళీ టోర్నీలో ఆడుతున్న టెస్టు క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మైదానంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్కు తీవ్ర గాయం కావడం గమనార్హం. మెదడుకు ఆపరేషన్: స్ట్రెచర్‌పై హ్యూస్‌ను మైదానం బయటికి తీసుకెళ్లి న్యూసౌత్‌వేల్స్ జట్టు డాక్టర్లు తాత్కాలికంగా చికిత్స అందించారు. అయినా తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో వారు నోటి ద్వారా శ్వాసను అందించే ప్రయత్నం చేశారు. అయితే కొద్ది సేపటికే ఎయిర్ అంబులెన్స్‌తో పాటు మరో రెండు అంబులెన్స్‌లు రావడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం హ్యూస్కు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే ఇప్పటికీ అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను కోమాలోకి వెళ్లకుండా డాక్టర్లు శ్రమిస్తున్నారు. గాయం సంగతి తెలిసిన వెంటనే మైకేల్ క్లార్క్‌తో పాటు పలువురు క్రికెటర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. టెస్టు రేసులో...: ఈ ఆదివారం 26వ పుట్టిన రోజు జరుపుకోనున్న హ్యూస్ భారత్‌తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా టెస్టు జట్టులో స్థానం సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. తొలి టెస్టులో స్థానం లభించకపోయినా... షెఫీల్డ్ షీల్డ్ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ క్లార్క్ గాయం కారణంగా హ్యూస్కు అవకాశాలు కూడా మెరుగయ్యాయి. గాయపడే సమయానికి అతని జట్టు సౌత్ ఆస్ట్రేలియా స్కోరు 136/2 కాగా... హ్యూస్ 63 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ఆసీస్ తరఫున 26 టెస్టులు ఆడిన హ్యూస్, ఆఖరిసారి గత ఏడాది జులైలో బరిలోకి దిగాడు. త్వరగా కోలుకోవాలి: భారత జట్టు ఆకాంక్ష ఫిల్ హ్యూస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ జట్టు ఆకాంక్షించింది. ‘హ్యూస్ గాయం దురదృష్టకరం. అతను తొందరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం. ఫిల్ కుటుంబ సభ్యులకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. క్రికెట్ సమాజంతో పాటు ఆస్ట్రేలియాలోని మా భారత మిత్రులు కూడా హ్యూస్ ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరుతున్నాం’ అని భారత టీమ్ మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
హ్యూగ్స్ కుటుంబానికి అండగా ఉంటాం: టీమిండియా
అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్కు ఎలాంటి సహకారాన్నైనా అందిస్తామని భారత క్రికెట్ జట్టు ప్రకటించింది. సిడ్నీలో స్థానిక జట్లతో క్రికెట్ ఆడుతున్న సందర్భంగా అతని తలకు బంతి తగిలి బలమైన గాయమైన విషయం తెలిసిందే. బంతి తలకు తాకగానే అతడు కుప్పకూలిపోయాడు. దాంతో హ్యూగ్స్‌ను హుటాహుటీన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో సెయింట్ విన్సెంట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. కాగా హ్యూగ్స్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా టూర్లో ఉన్న భారత్ జట్టు ఫిల్ హ్యూగ్స్కు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేసింది. కష్టకాలంలో ఉన్న హ్యూగ్స్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. **