ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఫిలిప్ హ్యూస్ గనుక బతికి ఉంటే ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టేవాడని.. కానీ తను ఇప్పుడు ఈ లోకంలో లేడంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సౌదీ అరేబియాలో ఇటీవల ఐపీఎల్-2025 మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే.
అమాంతం ఏడు కోట్లు పెంచి
ఇందులో భాగంగా రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీకి రాగా.. లక్నో సూపర్ జెయింట్స్ కళ్లు చెదిరే మొత్తానికి ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది. పంత్ ధర రూ. 20 కోట్లకు చేరినపుడు ఢిల్లీ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా పంత్‌ను తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచేసింది.
దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డు సాధించాడు. ఈ నేపథ్యంలో లక్నో జట్టు హెడ్‌కోచ్, ఆసీస్ మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’కు రాసిన కాలమ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. మా ఫ్రాంఛైజీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడి సేవల కోసం ఐదు మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసింది. కేవలం ఎనిమిది వారాలకు ఇంత మొత్తం అంటే మాటలు కాదు.
అతడే గనుక బతికి ఉంటే
ఒకవేళ హ్యూస్ గనుక బతికి ఉంటే.. ఐపీఎల్ వేలంలో అతడు కూడా భారీ ధర పలికేవాడు. కేవలం తన డైనమిక్ బ్యాటింగ్ మాత్రమే ఇందుకు కారణం కాదు.. తనలోని ఎనర్జీ కూడా ఇందుకు కారణం. కానీ.. విచారకరం ఏమిటంటే.. తను ఇప్పుడు మన మధ్యలేడు. ఎప్పటికీ వేలంలోకి రాలేడు’’ అంటూ ఆసీస్ దివంగత స్టార్ ఫిలిప్ హ్యూస్‌ను గుర్తుచేసుకున్నాడు.
అదే విధంగా.. పంత్ క్రికెటింగ్ నైపుణ్యాలను కొనియాడిన లాంగర్.. ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా(2020-21)ను ఒంటిచేత్తో గెలిపించిన తీరు ఎన్నటికీ మరువలేనిదన్నాడు. కాగా 2014లో ఫిలిప్ హ్యూస్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచివెళ్లాడు. ఆసీస్ దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా న్యూ సౌత్‌వేల్స్- సౌత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.
సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి బలైన హ్యూస్
ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి హ్యూస్ మెడకు బలంగా తాకడంతో అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. నవంబరు 27న హ్యూస్ పదో వర్ధంతి జరిగింది. ఈ నేపథ్యంలో అతడిని తలచుకుంటూ జస్టిన్ లాంగర్ ఉద్వేగానికి గురయ్యాడు.
కాగా న్యూ సౌత్ వేల్స్‌లో జన్మించిన హ్యూస్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 26 టెస్టులు, 25 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1535, 826 పరుగులు చేశాడు. తన 26వ పుట్టినరోజు కంటే మూడు రోజుల ముందు.. క్రికెట్ ఆడుతూ తుదిశ్వాస విడిచాడు.
చదవండి: ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ..
Comments
Please login to add a commentAdd a comment