
నాటౌట్‌గా ‘ఆట' ముగించాడు!
ఐదేళ్ల క్రితం... ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనేందుకు ఫిలిప్ హ్యూస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాతా అదే బలహీనత వెంటాడటంతో ఆసీస్ జట్టులో సుస్థిర స్థానం సాధించలేకపోయాడు. క్రికెట్ పుస్తకంలో ఉండే, సంప్రదాయ షాట్లకు భిన్నంగా ఊళ్లలో ఆడుకునే తరహాలో ఉండే హ్యూస్ శైలికి బౌన్సర్లు కొరుకుడు పడలేదు.
దాంతో జట్టులో ఎవరో గాయపడితే తప్ప అవకాశం రాని పరిస్థితి. అయితే ఫిల్ దీనిని సులువుగా వదిలి పెట్టలేదు. పట్టుదలగా పోరాడాడు. బిగ్‌బాష్‌లాంటి టోర్నీలను కాదని కౌంటీల బాట పట్టాడు. ఆసీస్ దేశవాళీ మ్యాచ్‌లలో బౌన్సర్లను ఆడటం సాధన చేశాడు. అందులో పర్‌ఫెక్షనిస్ట్‌గా మారాడు. షెఫీల్డ్ షీల్డ్ పోటీల్లో కూడా అలవోకగా బౌన్సర్లను ఎదుర్కొన్నాడు.
అయితే ఈసారి మాయదారి బౌన్సర్ కెరీర్‌నే కాదు ప్రాణాలనే తీసుకుపోయింది. ఆ ఒక్క బంతి హ్యూస్‌కు ఆఖరిది అయింది. దానిని సరిగా అంచనా వేయడంలో జరిగిన వైఫల్యం ఈ యువ క్రికెటర్ జీవితాన్ని అర్ధంతరంగా ముగించింది.
క్రికెట్‌పై పిచ్చితో...
న్యూసౌత్‌వేల్స్‌లో కేవలం 7 వేల మంది జనాభా ఉన్న మాక్స్‌విలేలో హ్యూస్ పుట్టాడు. తండ్రి అరటికాయలు పండించే రైతు. పాఠశాల స్థాయిలో రగ్బీతో పాటు క్రికెట్‌లో రాణించిన హ్యూస్‌లో ఉత్సాహం చూసిన తల్లిదండ్రులు అతని కోసమే సిడ్నీకి మకాం మార్చారు. అక్కడి పాఠశాలలో చేరింది మొదలు అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న హ్యూస్, ఆ తర్వాత అదే వేగంతో దూసుకుపోయాడు. దాంతో న్యూసౌత్‌వేల్స్ కాంట్రాక్ట్ దక్కడం, ఆ తర్వాత 2008 అండర్-19 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్‌గా ఆడటం చకచకా జరిగిపోయాయి.
అన్నీ నంబర్‌వన్‌లే
19 ఏళ్ల వయసులోనే షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఫైనల్లో సెంచరీతో ఆ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా హ్యూస్ ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలితమే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు స్థానం. కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగే బంతులాడి డకౌట్! అయితే ఫిల్ అసలు ప్రతిభ రెండో టెస్టులో బయటపడింది. డర్బన్‌లాంటి ఫాస్టెస్ట్ వికెట్‌పై స్టెయిన్, మోర్కెల్‌లాంటి బౌలర్లనూ ఎదుర్కొంటూ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతను సెంచరీలు బాదాడు.
ఇక్కడా తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన రికార్డు అతనిదే. గత ఏడాది ఆడిన తొలి వన్డేలోనూ సెంచరీ చేసి హ్యూస్ మరే ఇతర ఆస్ట్రేలియన్‌కు సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. ఈ ఏడాది జూలైలో మరో ‘మొదటి’ రికార్డు అతని ఖాతాలో చేరింది. లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొని తన వన్డే సత్తా కూడా బయటపెట్టాడు. 23 ఏళ్ల వయసులో ఆర్కీ జాక్సన్ (1933) టీబీతో చనిపోయిన తర్వాత ఇంత చిన్న వయసులో తనువు చాలించిన ఆస్ట్రేలియన్‌గా హ్యూస్ మరణంలోనూ పిన్న వయస్కుడిగానే నిలవడం విషాదం!
ఆగిన ఆశ...శ్వాస
కొన్నాళ్ల క్రితమే హ్యూస్ ఆటతీరులో వచ్చిన మార్పును గమనించిన అతని మిత్రుడు, ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ‘100 టెస్టుల వీరుడు’ అంటూ ప్రశంసలు కురిపించాడు. తొందరగా తప్పులు దిద్దుకొని అగ్రస్థానానికి ఎదిగే సత్తా అతనిలో ఉందంటూ హేడెన్, లాంగర్‌లాంటి ఓపెనర్లతో అంతా అతడిని పోల్చారు. హ్యూస్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు.
రెండేళ్ల క్రితమే అతను సొంత జట్టు న్యూసౌత్‌వేల్స్‌ను వదిలి సౌత్ ఆస్ట్రేలియాతో చేరాక మరింత రాటుదేలాడు. తుది జట్టులో స్థానం రాకపోయినా వరుస సిరీస్‌లలో జట్టుతో ఉంటూ వచ్చిన అతను దానిని నామోషీగా భావించలేదు. ‘నేను రిజర్వ్ ఆటగాడినే కావచ్చు. కానీ నా సహచరులకు సర్వీస్ చేయడం తప్పుగా భావించను. జట్టుతో ఉండటమే ముఖ్యమని నేను భావిస్తా. నా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. వచ్చిన రోజు నిరూపించుకోవడమే నా పని’ అని అతను చెప్పేవాడు.
ఇటీవలే ఆస్ట్రేలియా ‘ఎ' తరఫున 243 పరుగులు చేయడం అతని అవకాశాలను మెరుగుపర్చింది. మంగళవారం కూడా అతను అదే లక్ష్యంతో బరిలోకి దిగాడు. ఆ సమయంలో మరో వారం రోజుల్లో మళ్లీ టెస్టు క్రికెట్ ఆడతాననే విశ్వాసంతో కనిపించిన హ్యూస్ జీవిత ఇన్నింగ్స్ ఇంతలోనే ముగిసిపోవడం నిజంగా బాధాకరం.
- సాక్షి క్రీడావిభాగం