మెల్‌బోర్న్: దాదాపు మూడేళ్లనాటి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. 2014 నవంబర్ లో మైదానంలో బంతి అతనికి బలంగా తాకడంతో క్రీజ్‌లో కూలిన హ్యూస్.. ఆ తరువాత రెండు రోజులకు తుదిశ్వాస విడిచాడు.
2014 నవంబర్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ బౌన్సర్ సంధించగా అది హ్యూస్ తలకు బలంగా తాకింది. దాంతో విలవిల్లాడిన హ్యూస్ క్రీజ్లో కుప్పకూలిపోయాడు. ఆపై చికిత్స చేయించినా హ్యూస్ మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. అయితే తాజాగా మరోసారి సీన్ అబాట్ వేసిన బౌన్సర్ మరో క్రికెటర్‌ను తీవ్రంగా గాయపరచడం ఆసీస్ క్రికెట్‌ను ఉలిక్కిపడేలా చేసింది.
ఆసీస్ దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ఆదివారం షెఫల్ షీల్డ్ టోర్నీలో న్యూసౌత్ వేల్స్ తరపున ఆడుతున్న సీన్ అబాట్ వేసిన షార్ట్ బాల్.. విక్టోరియా ఆటగాడు విల్ పీవుకోవ్‌స్కీ తలకు బలంగా తాకింది. బంతి తగిలిన మరుక్షణమే పీవుకోవ్‌స్కీ మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడ ఉన్న ఆటగాళ్లంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ క‍్రమంలోనే ఫిజియో బృందం, మెడికల్ స్టాఫ్ గ్రౌండ్‌లోకి ఉన్నపళంగా పరుగులు తీశారు. కాసేపు పీవుకోవ్‌స్కీకి చికిత్స చేసిన తర్వాత అతను తేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వైద్యుల సాయంతో పీవుకోవ్‌స్కీ గ్రౌండ్‌ను విడిచివెళ్లిపోయాడు. అతని తలకు స్కానింగ్ చేసిన తర్వాత పెద్ద గాయం కాలేదని తేలడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. ఆనాటి హ్యూస్ మరణానికి కారణమైన బౌలరే మరొకసారి బౌన్సర్ వేసి బ్యాట్స్‌మన్‌ను గాయపరచడం చర‍్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment