'అతని మృతికి ఏ క్రికెటర్ కారణం కాదు'
సిడ్నీ: దాదాపు రెండేళ్ల క్రితంనాటి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాద మరణాన్ని ఎవరూ మరచిపోలేదు. 2014 నవంబర్ లో మైదానంలో బంతి అతనికి బలంగా తాకడంతో క్రీజ్లో కూలిన హ్యూస్.. ఆ తరువాత రెండు రోజులకు తుదిశ్వాస విడిచాడు.
అయితే హ్యూస్ మృతి విషయానికి సంబంధించి ఏ క్రికెటర్ తప్పిదం లేదంటూ న్యూసౌత్ వేల్స్ కారనర్స్ కోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన తరువాత తీర్పును వెలువరించిన కోర్టు.. హ్యూస్ మరణానికి ప్రధాన కారణం అతను బంతిని అంచనా వేయడంలో విఫలం కావడమేనని పేర్కొంది. ప్రత్యర్థి జట్టు వ్యూహ ప్రతివ్యూహాలు, స్లెడ్జింగ్‌కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేనందును ఆ మరణాన్ని యాక్సిడెంటల్ మృతిగా ధృవీకరిస్తూ తన తీర్పులో వెల్లడించింది.
'ప్రత్యర్థి జట్టు ద్వేషంతో కూడిన తీరును ఇక్కడ అవలంభించలేదు. ప్రమాదకరమైన బంతులను సంధించిమని చెప్పారనడానికి ఆధారాలు లేవు. హ్యూస్ మృతికి బౌలర్ కారణం కాదు.. మిగతా వేరు ఎవరూ కారణం కాదు. హ్యూస్ బంతిని అంచనా వేయడంలో చేసిన పొరపాటుతోనే అతనికి బంతికి బలంగా తాకి ప్రాణాలు కోల్పోయాడు'అని కోర్టు తీర్పులో తెలిపింది. దాంతో పాటు ఈ గేమ్కు సంబంధించిన చట్టాలు అతని మృతికి కారణం కాదని పేర్కొంది. కాకపోతే ప్రమాదకరమైన, ఆమోదయోగ్యం కాని బౌలింగ్ను క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్షించి, అందుకు తగిన చట్టాలను రూపొందించాలని న్యూసౌత్ వేల్స్ కారనర్స్ కోర్టు జడ్జి బార్న్స్ అభిప్రాయపడ్డారు.
2014 నవంబర్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా హ్యూస్‌కు సీన్ అబాట్ బౌన్సర్ విసిరిన బంతి బలంగా తలపై తాకింది. దాంతో విలవిల్లాడిన హ్యూస్ క్రీజ్లో కుప్పకూలిపోయాడు. ఆపై చికిత్స చేయించినా హ్యూస్ మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. కాగా, అతనిపై పదే పదే షార్ట్ పిచ్ బంతులు విసరాలని న్యూ సౌత్‌వేల్స్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ చెప్పినట్లు ఆరోపణలు రావడంతో ఆ దిశగా విచారణ సాగింది. దాంతో పాటు హ్యూస్ వద్దకు వచ్చి బొలింజర్ ’నేను నిన్ను చంపబోతున్నాను’ అని కూడా వ్యాఖ్యానించినట్లు ఒక క్రికెటర్ వెల్లడించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగిన అనంతరం హ్యూస్ మృతి ప్రత్యర్థి జట్టు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని వెల్లడైంది.