మనమే గెలిచి అంకితమిద్దాం!
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు రంగం సిద్ధం
రేపటి నుంచి తొలి టెస్టు
ధోని సారథ్యంలోనే బరిలోకి భారత్
బౌలర్ల విషయంలో రాని స్పష్టత
అంతా సాధారణంగానే ఉంటే ఈ పాటికి తొలి టెస్టు మొదలై ఐదో రోజు కావలసింది. కానీ ఫిలిప్ హ్యూస్ దుర్మరణం కారణంగా టెస్టు వాయిదా పడటం, షెడ్యూల్ మారడం, రెండు జట్లలోనూ ఆటకంటే భావోద్వే గాలకు ప్రాధాన్యం పెరగడం... ఇలా గత పది రోజులుగా అంతా నాటకీయ పరిణా మాలు జరిగాయి. ఇక మ్యాచ్‌ల మీద దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. సిరీస్ గెలిచి హ్యూస్‌కు అంకితమివ్వాలని ఆసీస్ క్రికెటర్లు కసిగా ఉన్నారు. అయితే ఎన్నడూ ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవని భారత్... ఈసారైనా ఆ అరుదైన ఘనతను సాధించి... మనమే సిరీస్ విజయాన్ని హ్యూస్‌కు అంకితమిస్తే ఘనంగా ఉంటుంది.
సాక్షి క్రీడావిభాగం
ఆస్ట్రేలియాలో పరిస్థితులకు అలవాటు పడటానికి పది రోజుల ముందే వెళ్లిన భారత జట్టుకు అనుకోకుండా మరో ఐదు రోజులు అదనంగా కలిసొచ్చింది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల ద్వారా లభించిన అవకాశాన్ని బ్యాట్స్‌మెన్, బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. అయితే కాస్త అనిశ్చితి మాత్రం చివరిదాకా కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం తొలి టెస్టుకు కోహ్లి సారథ్యం వహించాలి. కానీ గాయం నుంచి కోలుకున్న ధోని ఇప్పటికే జట్టుతో చేరాడు. ఆదివారం ప్రాక్టీస్ కూడా చేశాడు. ప్రాక్టీస్ సెషన్‌లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా బ్యాటింగ్ చేశాడు.
కాబట్టి ధోని తొలి టెస్టు ఆడటం దాదాపుగా ఖాయమైనట్లే. ఈ నేపథ్యంలో టెస్టు సారథ్యం కోసం కోహ్లి కొంతకాలం వేచి చూడాలి. ఒకవేళ ధోని మరింత విశ్రాంతి కావాలనుకుంటే మాత్రం కోహ్లి సారథ్యంలో భారత్ సిరీస్‌ను మొదలుపెడుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ విషయంలో ఆ శిబిరంలోనూ అనిశ్చితి ఉంది. క్లార్క్ ఆడకపోతే హాడిన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఇలా సారథుల విషయంలో సందిగ్ధం మధ్య భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాయి. మంగళవారం (రేపు) నుంచి అడిలైడ్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
జట్టు కూర్పు ఏమిటి?
భారత్‌కు జట్టు కూర్పు విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రానట్లు కనిపిస్తోంది. కెప్టెన్‌గా ధోని ఆడకపోతే వృద్ధిమాన్ సాహా కీపర్‌గా తుది జట్టులోకి వస్తాడు. ఓపెనర్లుగా ధావన్, విజయ్ ఆడటంలో సందేహం లేదు. లోకేశ్ రాహుల్‌కు అప్పుడే అరంగేట్రం చేసే అవకాశం రాకపోవచ్చు. పుజారా, కోహ్లి, రహానే కూడా తుది జట్టులో ఉండటం ఖాయం. ఇక మరో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ, రైనాలలో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. స్వదేశంలో వన్డే డబుల్ సెంచరీ, ప్రాక్టీస్ మ్యాచ్‌లలో రాణించడం వల్ల రోహిత్ తుది జట్టులో ఉంటానని నమ్మకంతో ఉన్నాడు.
అయితే రైనాకు జట్టు మేనేజ్‌మెంట్ నుంచి మంచి మద్దతు ఉంది. రైనాను టెస్టు ఆడించాలని కోరింది టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కావడం విశేషం. ఇక బౌలింగ్ విషయానికొస్తే ముగ్గురు పేసర్లు ఒక స్పిన్నర్ తుది జట్టులో ఉంటారు. ఇంగ్లండ్‌లో ఐదుగురు బౌలర్లతో ప్రయోగం చేసినా... ఇక్కడ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. భువనేశ్వర్ కుమార్ ఎడమ కాలి చీలమండలో చిన్నపాటి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. తను తొలి టెస్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని భారత జట్టు మేనేజ్‌మెంట్ చెబుతోంది.
ఒకవేళ భువనేశ్వర్ అందుబాటులో లేకపోతే... ఇషాంత్, ఆరోన్, షమీ తుది జట్టులో ఉంటారు. భువనేశ్వర్ ఉంటే షమీ బెంచ్‌కు పరిమితం కావచ్చు. ఒక స్పిన్నర్ స్లాట్‌లో ఎవరు తుది జట్టులోకి వస్తారనేది ఆసక్తికరం. ఇంతకాలం జడేజా, అశ్విన్‌ల మధ్యే పోటీ ఉండేది. తాజాగా లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ రేసులోకి వచ్చాడు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలోనూ కరణ్ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ అతను లోయర్ ఆర్డర్‌లో బాగా ఉపయోగకరంగా ఆడతాడు. కాబట్టి కరణ్ శర్మను అరంగేట్రం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి.
కోలుకున్నట్లే (నా)!
మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు హ్యూస్ మరణం విషాదం నుంచి కోలుకున్నట్లే కనిపిస్తున్నారు. ప్రాక్టీస్ మొదలుపెట్టిన రెండు రోజులకే తమదైన తరహాలో మాటలు మొదలుపెట్టారు. క్లార్క్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే షాన్ మార్ష్ బెంచ్‌కు పరిమితమవుతాడు. లేదంటే అతనికి అవకాశం వస్తుంది. ఓపెనర్లుగా వార్నర్, రోజర్స్ ఆడతారు. ఆ తర్వాత వాట్సన్, మిషెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, హాడిన్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్‌గా లియోన్ జట్టులోకి వస్తాడు. పేస్ విభాగంలో జాన్సన్, సిడిల్‌లతో పాటు హారిస్, హాజిల్‌వుడ్‌లలో ఒకరు తుది జట్టులో ఉంటారు.
గెలిస్తే మూడో ర్యాంక్‌కు
ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 4-0 లేదా 3-1తో గెలిస్తే భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ధోని సేన ఆరో ర్యాంక్‌లో, ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉన్నాయి. ఒకవేళ ఆసీస్ జట్టు సిరీస్ గెలిస్తే ఇరు జట్ల ర్యాంక్‌లలో మార్పు ఉండదు.