విశాఖపట్నం: ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత జట్టు విజయంలో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. చివర్లో దూకుడుగా ఆడాల్సిన స్థితిలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిలబడి అతను ఫినిషర్‌గా మ్యాచ్ పూర్తి చేశాడు. ఈ లక్షణాన్ని తాను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకున్నట్లు రింకూ సింగ్ చెప్పాడు. ‘నేను ఇంత ప్రశాంతంగా ఉండగలిగానంటే అందుకు ప్రత్యేక కారణం ఉంది.
ఇలాంటి స్థితిలో ఎలా ఆడాలని నేను మహి భాయ్ (ధోని)తో మాట్లాడాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఒత్తిడికి లోను కాకపోవడానికి ఆయన ఇచ్చిన సూచనలే కారణం. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటంతో పాటు నేరుగా బౌలర్‌పైనే పూర్తి దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు’ అని రింకూ సింగ్ వెల్లడించాడు. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా రింకూ ఆత్మవిశ్వాసంతో దానిని చక్కటి సిక్సర్‌గా మలిచాడు.
అయితే అబాట్ వేసిన ఆ బంతి నోబాల్ కావడంతో సిక్స్ లెక్కలోకి రాలేదు. ‘డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాక అక్షర్ చెప్పే వరకు ఈ విషయం నాకు తెలీదు. అయితే సిక్స్ కాలేకపోవడం పెద్ద అంశం కాదు. మ్యాచ్ గెలవడమే మనకు ముఖ్యం. అది జరిగింది చాలు’ అని రింకూ సింగ్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment