అచ్చొచ్చిన సొంత మైదానంలో స్టీవ్ స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... టీమిండియాపై దంచి కొట్టే హెడ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు! టీనేజ్ కుర్రాడు కొన్‌స్టాస్ మెరుపులు 3 బౌండరీలకే పరిమితం కాగా... మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా వైఫల్యాన్ని కొనసాగించాడు! ఆదుకుంటాడనుకున్న లబుషేన్ ఆరంభంలోనే చేతులెత్తేయగా... అలెక్స్ కేరీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు!
అయినా ఆ్రస్టేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది అంటే అదంతా అరంగేట్ర ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ చలవే. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న మిషెల్ మార్ష్ ను తప్పించి... చివరి టెస్టులో వెబ్‌స్టర్‌కు అవకాశం ఇవ్వగా... అతడు భారత జట్టుకు ప్రధాన అడ్డంకిగా నిలిచి భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. ఆఫ్‌స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించి... ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్‌గా మారిన ఆ్రస్టేలియా నయా తార వెబ్‌స్టర్‌పై ప్రత్యేక కథనం... – సాక్షి, క్రీడావిభాగం
సుదీర్ఘ దేశవాళీ అనుభవం... వేలకొద్దీ ఫస్ట్‌క్లాస్ పరుగులు... బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉన్నా... ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయిన వెబ్‌స్టర్... ఎట్టకేలకు జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లే నిలవలేకపోతున్న చోట... చక్కటి సంయమనంతో ఆడుతూ విలువైన పరుగులు చేశాడు. గత మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్యామ్ కొన్‌స్టాస్ తన బ్యాటింగ్ విన్యాసాలతో పాటు నోటి దురుసుతో వార్తల్లోకెక్కగా... వెబ్‌స్టర్ మాత్రం నింపాదిగా ఆడి తనదైన ముద్ర వేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన అతడు... 2.23 ఎకానమీతో 29 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. బౌలింగ్‌లో వికెట్ తీయలేకపోయినా... స్టార్క్, కమిన్స్ వంటి స్టార్ బౌలర్ల కంటే తక్కువ పరుగులు ఇచ్చుకొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులో అడుగుపెట్టిన వెబ్‌స్టర్... తనలో మంచి బ్యాటర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు.
మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ ఉండటంతో ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ అతడికే ఎక్కువ స్ట్రయిక్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించిన అనంతరం స్మిత్ అవుట్ కాగా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత భూజానెత్తుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నది తొలి మ్యాచే అయినా... దేశవాళీల్లో వందల మ్యాచ్‌ల అనుభవం ఉండటంతో లోయర్ ఆర్డర్‌తో కలిసి జట్టును నడిపించాడు. అతడు ఒక్కో పరుగు జోడిస్తుంటే... టీమిండియా ఆధిక్యం కరుగుతూ పోయింది.
ఆరో వికెట్‌కు అలెక్స్ కెరీతో 41 పరుగులు, ఏడో వికెట్‌కు కెపె్టన్ కమిన్స్‌తో కలిసి 25 పరుగులు జోడించాడు. ఇక కింది వరుస బ్యాటర్ల అండతో పరుగులు చేయడం కష్టమని భావించి భారీ షాట్లకు యత్నించిన వెబ్‌స్టర్... చివరకు తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. గత నాలుగు టెస్టుల్లో పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న మిషెల్ మార్‡్ష ఒక్క మ్యాచ్‌లోనూ అటు బ్యాట్‌తో కానీ, ఇటు బంతితో కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... తొలి మ్యాచ్‌లోనే వెబ్‌స్టర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అనూహ్య బౌన్స్, అస్థిర పేస్ కనిపించిన సిడ్నీ పిచ్‌పై వెబ్‌స్టర్ గొప్ప సంయమనం చూపాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా 40 పరుగులు దాటి చేయలేకపోయిన చోట ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ శతకం నమోదు చేసిన వెబ్‌స్టర్... ఆ తర్వాత బంతితోనూ ఆకట్టుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు వేసిన వెబ్‌స్టర్ అందులో కీలకమైన శుబ్‌మన్ గిల్ వికెట్ పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టాడు.
కామెరూన్ గ్రీన్ వంటి ప్రధాన ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడంతో మిషెల్ మార్ష్ జట్టులోకి రాగా... ఇప్పుడు వెబ్‌స్టర్ ప్రదర్శన చూస్తుంటే ఇక మార్ష్ జట్టులో చోటుపై ఆశలు వదులుకోవడమే మేలనిపిస్తోంది.
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం...
స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన 31 ఏళ్ల వెబ్‌స్టర్... ఆ తర్వాత పేస్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 6 అడుగుల 7 అంగుళాలున్న వెబ్‌స్టర్‌కు బంతిని స్పిన్ చేయడం కంటే... వేగంగా విసరడం సులువు అని కోచ్‌లు సూచించడంతో తన దిశ మార్చుకున్నాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచే నిలకడ కొనసాగించిన వెబ్‌స్టర్... 2014లో తన 20 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ భారీగా పరుగులు రాబట్టినా... జాతీయ జట్టులో పోటీ కారణంగా అతడికి ఆసీస్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా దేశవాళీల్లో రాణించిన వెబ్‌స్టర్ ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ తరఫున బరిలోకి దిగి అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించాడు.
2023–24 షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెబ్‌స్టర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సీజన్ ఆసాంతం ఒకే తీవ్రత కొనసాగించిన అతడు... 58.62 సగటుతో 938 పరుగులు చేయడంతో పాటు... 30.80 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ చరిత్రలో గ్యారీ సోబర్స్ తర్వాత ఒకే సీజన్‌లో రెండు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాకిస్తాన్‌తో జరిగిన ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్ జట్టుకు ఎంపిక చేశారు.
అక్కడ కూడా రాణించిన వెబ్‌స్టర్ తనను పక్కన పెట్టలేని పరిస్థితి కల్పించాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 93 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన వెబ్‌స్టర్ 5297 పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 24 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 148 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment