మెల్‌బోర్న్‌లో గత రెండు పర్యాయాలు టీమిండియాదే పైచేయి
రోహిత్ బ్యాటింగ్ స్థానంపై కొనసాగుతున్న సందిగ్ధత
ఉదయం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు మరో కీలక పోరుకు సమాయత్తమైంది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో కంగారూలను కట్టిపడేసేందుకు టీమిండియా అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంది.
ఈ ఏడాదిని విజయంతో ముగించడం... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని చేజిక్కించుకోవడం... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మార్గం సుగమం చేసుకోవడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రోహిత్ బృందం మైదానంలో అడుగు పెట్టనుంది.
గత రెండు పర్యటనల్లో మెల్‌బోర్న్‌లో జయకేతనం ఎగరవేసిన టీమిండియా ఈ మైదానంలో ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేయగా... భారత జోరుకు అడ్డుకట్ట వేయాలని కంగారూలు కృతనిశ్చయంతో ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం రసవత్తర పోరును ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
మెల్‌బోర్న్: గత రెండు ‘బాక్సింగ్ డే’ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియాను చిత్తు చేసిన భారత జట్టు... ముచ్చటగా మూడోసారి కంగారూలను మట్టికరిపించేందుకు రెడీ అయింది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్న ఈ పోరుకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు తరలి రానుండగా... అశేష జనసందోహం ముందు ఆసీస్‌పై ఆధిపత్యం కనబర్చేందుకు రోహిత్ బృందం సిద్ధమైంది.
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగగా ... ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని చేజిక్కించుకుంటుంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్... అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు (డే–నైట్)లో పరాజయం చవిచూసింది.
బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించగా... చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమ ఉజ్జీగా ఉన్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే... ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ టీమిండియాకు విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో భారత జట్టు మెల్‌బోర్న్‌లో శక్తియుక్తులన్నీ ధారపోయడానికి సిద్ధమైంది.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న రోహిత్ ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. పేస్‌కు సహకరించే మెల్‌బోర్న్ పిచ్‌పై రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా... లేక మిడిలార్డర్‌లోనే కొనసాగుతాడా చూడాలి!
మరోవైపు అరంగేట్ర సిరీస్‌లోనే తీవ్రంగా తడబడ్డ ఓపెనర్ మెక్‌స్వీనీని తప్పించిన ఆ్రస్టేలియా... టీనేజర్ స్యామ్ కొంటాస్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన హాజల్‌వుడ్ స్థానంలో బోలండ్ జట్టులోకి రానున్నాడు.
రోహిత్ రాణించేనా!
‘జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధమే’ అని రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేసినా... ‘హిట్‌మ్యాన్’ మిడిలార్డర్‌లో బరిలోకి దిగడం వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. వికెట్లు పడుతున్న దశలో క్రీజులోకి వచ్చిన రోహిత్ కనీసం ఎదురుదాడి చేసి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
నాలుగో టెస్టులోనూ అతడు మిడిలార్డర్‌లోనే దిగే సూచనలున్నా... మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేసిన రోహిత్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. గత పదేళ్లుగా మెల్‌బోర్న్ స్టేడియంలో పరాజయం లేకుండా సాగుతున్న టీమిండియా... అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.
ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌పై భారీ అంచనాలు ఉండగా... యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. కోహ్లికి మెల్‌బోర్న్‌లో మంచి రికార్డు ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కోహ్లి... ఆ తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
పదే పదే ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతికి వికెట్ సమర్పించుకోవడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే ప్రాక్టీస్‌లో దీనిపై దృష్టి పెట్టిన విరాట్... ‘ఫోర్త్ స్టంప్’ లోపాన్ని అధిగమించేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. మిడిలార్డర్‌లో పంత్ మంచి టచ్‌లో ఉండగా... పేస్ ఆల్‌రౌండర్‌గా ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో ఉండటం ఖాయమే.
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రావచ్చు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఒంటి చేత్తో బౌలింగ్ భారాన్ని మోస్తున్న ఏస్ పేసర్ బుమ్రా మరోసారి కీలకం కానున్నాడు. బుమ్రాతో కలిసి సిరాజ్, ఆకాశ్‌దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లి, పంత్, జడేజా, నితీశ్ రెడ్డి/సుందర్, ఆకాశ్‌దీప్, బుమ్రా, సిరాజ్.
ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, సామ్ కొంటాస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్ , కేరీ, స్టార్క్, లయన్, బోలండ్.
హెడ్ ఆట కట్టిస్తేనే...
సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టు కూడా కొన్ని సమస్యలతో సతమతమవుతోంది. వార్నర్ రిటైరయ్యాక సరైన ప్రత్యామ్నాయం లభించక ఇబ్బంది పడుతున్న ఆసీస్... ఈ సిరీస్ తొలి మూడు టెస్టులకు మెక్‌స్వీనీని ప్రయతి్నంచింది. అతడు విఫలమవ్వడంతో మరో యువ ఆటగాడు కొంటాస్ ను ఎంపిక చేసింది.
లబుషేన్‌లో నిలకడ లోపించగా... గత మ్యాచ్‌లో సెంచరీతో స్టీవ్ స్మిత్ ఫామ్‌లోకి వచ్చాడు. వీళ్లంతా ఒకెత్తు అయితే... భారత్ పాలిట కొరకరాని కొయ్య మాత్రం ట్రవిస్ హెడ్ అనే చెప్పాలి. ఇటీవల టీమిండియాపై హెడ్ విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మరోసారి అతడి నుంచి రోహిత్ జట్టుకు ప్రమాదం పొంచి ఉంది.
బోలండ్‌కు సొంత మైదానమైన ఎంసీజీలో అతడికి ఘనమైన రికార్డు ఉంది. మరోవైపు స్టార్క్, కమిన్స్ బౌలింగ్‌లో ఏమరపాటుగా ఉంటే జరిగే నష్టం ఏంటో ఈ పాటికే టీమిండియాకు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఎంసీజీ టెస్టులో మళ్లీ గెలవాలంటే టీమిండియా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.
పిచ్, వాతావరణం
మెల్‌బోర్న్ పిచ్ పేస్‌కు అనుకూలం. వికెట్‌పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంటుందని క్యూరేటర్ వెల్లడించాడు. తొలి రోజుఎండ అధికంగా ఉండనుంది. రెండో రోజు చిరు జల్లులు కురవొచ్చు. వర్షం వల్ల ఆటకు పెద్దగా ఆటంకం కలగకపోవచ్చు.
4 భారత్ ఆ్రస్టేలియా మధ్య మెల్‌బోర్న్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 4 టెస్టుల్లో గెలిచింది. ఆ్రస్టేలియా 8 టెస్టుల్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
6 బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే (44 టెస్టుల్లో) భారత్ తరఫున వేగంగా 200 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అవుతాడు. అశ్విన్ 37 టెస్టుల్లో ఈ మైలురాయి దాటాడు.
6 గత ఆరేళ్ల కాలంలో మెల్‌బోర్న్ మైదానంలో ఆరు సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment