'బెంగ' తీర్చాల్సిన సమయం
► నేటి నుంచి రెండో టెస్టు
► భారత్‌పైనే ఒత్తిడి
► ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా
► టీమిండియాలో మార్పులు!
అంతా అనుకున్నట్లు సాగితే ఈ సమయానికి భారత జట్టు 1–0 ఆధిక్యంతో అమితోత్సాహంతో రెండో టెస్టు బరిలోకి దిగేది. కానీ ‘రెండున్నర రోజుల’ పతనం తర్వాత ఆ షాక్ నుంచి కోలుకొని నిలబడాల్సిన స్థితి ఇప్పుడు మన జట్టుది. ఒక మ్యాచ్‌లో జట్టు ఓడటం అసాధారణం ఏమీ కాకపోయినా, ఘోర వైఫల్యం సహజంగానే మానసికంగా కూడా జట్టును దెబ్బ తీసింది. అయితే ఇప్పుడు తమలో అసలు సత్తాను బయట పెట్టి పుణే పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. బెంగళూరులోనైనా మన ఆట మారుతుందా అనేది ఆసక్తికరం.
సిరీస్‌కు ముందు అన్ని వైపుల నుంచి అండర్‌డాగ్ ముద్ర పడటంతో ఒక రకమైన ఆందోళనతో కనిపించిన ఆస్ట్రేలియాను తొలి మ్యాచ్ విజయం ఆకాశంలో నిలిపింది. ‘భారత బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొట్టము’ అంటూ మర్యాద చూపిన కంగారూలు ఇప్పుడు తమ సహజశైలిలో మాటల దాడి చేసేందుకు కావాల్సిన ధైర్యాన్ని పుణే విజయం ఇచ్చింది. పైగా భారత గడ్డపై వారికి మెరుగైన రికార్డు ఉన్న వేదికపై జరగబోతున్న మ్యాచ్ ఆసీస్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. మరి ఆ జట్టు అదే జోరు కొనసాగిస్తుందా లేక ప్రత్యర్థి ముందు సాగిలపడుతుందా!
బెంగళూరు: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భాగంగా నేటి (శనివారం) నుంచి ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో వెనుకబడిన భారత్ ఇక్కడ విజయం సాధించి సమంగా నిలవాలని పట్టుదలగా ఉండగా... ఈ మ్యాచ్ గెలిస్తే ట్రోఫీని నిలబెట్టుకునే అవకాశం ఉన్న ఆసీస్ మరో గెలుపు అందుకోవాలని భావిస్తోంది. పుణే పిచ్‌పై వివాదం చెలరేగడంతో ఈ వికెట్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. అయితే ఇక్కడ వికెట్ గురించి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఆశ్చర్యకర మార్పులు...
భారత జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా గత 22 టెస్టుల్లో విరాట్ కోహ్లి ఒక మ్యాచ్‌లో ఆడిన తుది జట్టును తర్వాతి మ్యాచ్‌లో కొనసాగించలేదు. ప్రతీసారి కనీసం ఒక ఆటగాడినైనా మారుస్తూ వచ్చాడు. పుణేలో సమష్టి వైఫల్యం నేపథ్యంలో ఇప్పుడు కూడా జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లి స్వయంగా చెప్పినట్లు ఇవి ‘ఆశ్చర్యకరంగా’ ఉండవచ్చు. అందుకోసం తాను మొదటి నుంచి జపిస్తున్న ఐదుగురు బౌలర్ల మంత్రాన్ని పక్కన పెడతాడా అనేది చూడాలి. తొలి టెస్టులో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. కాబట్టి అదనపు బ్యాట్స్‌మన్ అవసరం కనిపిస్తోంది. అప్పుడు కరుణ్ నాయర్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది. అదే జరిగితే గత మ్యాచ్‌లో విఫలమైన ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి భారత్ సాధ్యమై నంత భారీ స్కోరు సాధిస్తేనే మ్యాచ్‌పై పట్టు చిక్కు తుంది. ఈ మైదానంలో చక్కటి రికార్డు ఉన్న విజయ్, పుజారాలతో పాటు ‘హోం బాయ్’ లోకేశ్ రాహుల్ కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
ఇంగ్లండ్ సిరీస్ నుంచి చూస్తే బంగ్లాదేశ్‌తో టెస్టు మినహా అన్నింటిలో విఫలమైన రహానేకు ప్రస్తుతానికైతే కెప్టెన్, కోచ్ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. కానీ దీనిని నిలబెట్టుకునేందుకు రహానే ఆ స్థాయి ఇన్నింగ్స్ ఒకటి ఆడాల్సి ఉంది. ఇక విరాట్ కూడా గత మ్యాచ్ అరుదైన వైఫల్యం తర్వాత తనకూ సొంత గ్రౌండ్‌లాంటి ఈ వేదికపై గొప్ప ఇన్నింగ్స్ ఆడితే భారత్‌కు మ్యాచ్‌లో విజయావకాశాలు ఖాయంగా ఉంటాయి. పిచ్ మారుతున్న కొద్దీ చివర్లో కీలకపాత్ర పోషించాల్సిన అశ్విన్, జడేజాలు గత మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. పేసర్లలో ఉమేశ్ ఖాయం కాగా, రివర్స్ స్వింగ్‌కు అవకాశం ఉంటే ఇషాంత్ స్థానంలో భువనేశ్వర్ రావచ్చు. ఏదేమైనా గత మ్యాచ్‌లో కలిసికట్టుగా విఫలమైన టీమిం డియా, ఈసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తేనే ఈ టెస్టులో ఆధిక్యం ప్రదర్శించవచ్చు.
జోరు కొనసాగుతుందా...
పుణే టెస్టులో గెలిచిన జట్టునే ఏ మాత్రం మార్పులు లేకుండా కొనసాగిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించేసింది. అద్భుత విజయంతో ఆ జట్టులో ఉత్సాహం కనిపిస్తున్నా... ఏమరుపాటుగా వ్యవహరిస్తే పరాభవం తప్పదని ఆసీస్‌కు బాగా తెలుసు. అందుకే సిరీస్‌పై పట్టు సాధించేందుకు వచ్చిన కీలక అవకాశాన్ని ఆ జట్టు కోల్పోరాదని భావిస్తోంది. బ్యాటింగ్‌లో స్మిత్ ముందుండి నడిపిస్తుండగా, కొత్త కుర్రాడు రెన్‌షా ఆకట్టుకున్నాడు. అద్భుతంగా ఆడకపోయినా షాన్ మార్‡్ష, హ్యాండ్స్‌కోంబ్ కూడా మెరుగ్గానే ఆడారు. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేలా ఈసారి మరింత బాగా ఆడాల్సిన బాధ్యత మరో ప్రధాన బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌పై ఉంది. ఈ విధ్వంసకర ఓపెనర్ ఒక్కసారి క్రీజ్‌లో నిలదొక్కుకుంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. పుణేలో తొలి సెషన్‌లో అతని శైలిలో దూకుడు కూడా కనిపించింది. ఇక 12 వికెట్లతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన స్పిన్నర్ ఒకీఫ్ తనపై ఉన్న ఒత్తిడిని అధిగమించి మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌ను నిరోధించగలడా చూడాలి. భారత్‌తో పోలిస్తే ఆసీస్ అదనపు బలం పేస్ బౌలింగ్‌లో కూడా ఉంది. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ల జాబితాలో ఉన్న మిషెల్ స్టార్క్, హాజల్‌వుడ్‌లు భారత్‌ను ఏ సమయంలోనైనా దెబ్బ తీయగల సమర్థులు. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లలో ఎవరూ కూడా బెంగళూరులో టెస్టు మ్యాచ్ ఆడలేదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజారా, రహానే, సాహా, జయంత్/నాయర్, అశ్విన్, జడేజా, ఉమేశ్, ఇషాంత్/భువనేశ్వర్.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), రెన్‌షా, వార్నర్, షాన్ మార్‡్ష, హ్యాండ్స్‌కోంబ్, మిషెల్ మార్‡్ష, వేడ్, స్టార్క్, ఒకీఫ్, లయోన్, హాజల్‌వుడ్.
ఒత్తిడా... నాపైనా లేక జట్టు పైనా! నేను ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నానా? నేను చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. అంతా బాగుంది. అందుకే చిరునవ్వులు కూడా చిందిస్తున్నాను! మాపై ఒత్తిడి ఉందంటూ ఆసీస్ కెప్టెన్ చెప్పడం అతని వ్యక్తిగత అభిప్రాయం. మీడియా సమావేశాల్లో ఈ తరహా మాటల యుద్ధం చేయడంలో వారు నిష్ణాతులు అని నాకు బాగా తెలుసు. అయితే వారి మాటలకంటే కూడా మేం మా ఆటపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. పుణే టెస్టులో కనబర్చిన చెత్త ఆటను మేం మళ్లీ ప్రదర్శించబోమని హామీ ఇస్తున్నాను. ఆ మ్యాచ్ ఓడినంత మాత్రాన అన్నీ ఓడతామని కాదు. గత రెండేళ్లుగా మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఇక్కడా అలాంటి ఆటనే చూపిస్తాం. ఫలితం ఎలా ఉంటుందో సిరీస్ ముగిశాక చూద్దాం. మా లోపాలు సరిదిద్దుకునేందుకు తొలి టెస్టు అవకాశం ఇచ్చింది. మ్యాచ్ ఫలితాన్ని బట్టి మా సన్నాహకాల్లో మార్పు ఉండదు. అదే పట్టుదలతో మేం సాధన చేస్తాం. ప్రత్యేకంగా ఏ ఒక్క ఆటగాడిపైనో దృష్టి పెట్టడం లేదు. టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సిందే. ఈ మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడాను కాబట్టి వికెట్ గురించి బెంగ లేదు. మ్యాచ్ ముందు పరిస్థితులను బట్టే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటాం.
– విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
తొలి టెస్టులో పిచ్ కూడా మా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈసారి మాత్రం పిచ్ చాలా భిన్నంగా ఉంది కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మమ్మల్ని మేం మార్చుకోవాల్సి ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ ప్రతీ మ్యాచ్‌లో 400కు పైగా స్కోరు చేసినా సరిపోలేదు. మేం గెలవాలంటే కనీసం 550– 600 పరుగులైనా చేయాలి. ట్రోఫీని నిలబెట్టుకునేందుకు మాకు మరో విజయం కావాలి. చాలా వేగంగా ఒకటి, రెండు సెషన్‌లలో కూడా మ్యాచ్ మావైపు మొగ్గు చూపవచ్చు. కాబట్టి భారత్‌పై చాలా ఒత్తిడి ఉంటుంది. వారు బలంగా కోలుకునే ప్రయత్నం చేస్తారని తెలుసు కానీ మేం సిద్ధంగా ఉన్నాం. అశ్విన్‌తో పోటీ బాగుంది. గతం లో అతడిని నెట్స్‌లో ఎదుర్కొన్న సమయంలో అతను నాకు లెగ్ స్పిన్ బంతులేసి తన బలం బయటపడకుండా చూసుకున్నాడు కూడా.
– స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్
► 2 చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా 2 టెస్టులు గెలిచింది. భారత్‌లో ఎక్కడా ఆ జట్టు ఒక మ్యాచ్‌కు మించి గెలవలేదు. ఇక్కడ ఆడిన 4 టెస్టుల్లో మరొకటి ఓడి, ఒక మ్యాచ్‌ను ఆసీస్ ‘డ్రా’ చేసుకుంది.
► 4 ఈ మైదానంలో భారత్ గత 20 ఏళ్లలో 4 మ్యాచ్‌లలో ఓడి 2 మాత్రమే గెలవగలిగింది. సొంతగడ్డపై భారత్‌కు ఒక మైదానంలో ఇదే పేలవమైన రికార్డు.
► 50 మురళీ విజయ్‌కు ఇది 50వ టెస్టు మ్యాచ్.
► 112 స్టీవెన్ స్మిత్ మరో 112 పరుగులు చేస్తే టెస్టుల్లో ఐదువేల పరుగులు పూర్తవుతాయి.
పిచ్, వాతావరణం
సాధారణ ఉపఖండపు వికెట్. ఆరంభంలో కనీసం రెండు రోజుల పాటు బ్యాటింగ్‌కు అనుకూలించి ఆ తర్వాత టర్న్ అవుతుంది. ఇలాంటి చోట తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించడమే కీలకమవుతుంది. కాబట్టి టాస్‌కు అమిత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక్కడ జరిగిన ఆఖరి టెస్టు (భారత్–దక్షిణాఫ్రికా) వర్షం కారణంగా ఒక రోజు తర్వాత రద్దయింది. ఆ తర్వాత అవుట్‌ఫీల్డ్‌ను కొత్త తరహా టెక్నాలజీలో పూర్తిగా ఆధునీకరించారు. మ్యాచ్ రెండో రోజు ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. గత మ్యాచ్ వివాదం నేపథ్యంలో బీసీసీఐ పిచెస్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ ఈసారి బెంగళూరు పిచ్ ఛాయలకే రాకుండా పూర్తిగా స్థానిక సంఘానికే అప్పగించారు.