టీమిండియా అద్భుత ప్రదర్శనలు | Team India five Tests wins on Australian soil | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ గడ్డపై ‘పంచ రత్నాలు’

Published Tue, Dec 15 2020 4:06 AM | Last Updated on Tue, Dec 15 2020 3:43 PM

Team India five Tests wins on Australian soil - Sakshi

2019లో తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ సాధించిన భారత జట్టు (ఫైల్‌)

భారత జట్టు 2018–2019లో తొలిసారి ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి మొదటిసారి సిరీస్‌ సొంతం చేసుకున్నా... ఈ సిరీస్‌ తుది ఫలితంతో సంబంధం లేకుండా ఆసీస్‌ గడ్డపై మన అభిమానులు మరచిపోలేని కొన్ని అద్భుత ప్రదర్శనలు టీమిండియా ఆటగాళ్ల నుంచి వచ్చాయి. ఆస్ట్రేలియాలాంటి పటిష్ట జట్టును వారి మైదానాల్లో సాధారణ టీమ్‌గా మార్చేస్తూ సాగిన మన క్రికెటర్ల ఆట చిరస్మరణీయం. గురువారం నుంచి బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో అలాంటి ఐదు జ్ఞాపకాలను ఎంచుకుంటే...

2007–08 సిరీస్‌ (మూడో టెస్టు–పెర్త్‌)
ఫలితం: 72 పరుగులతో భారత్‌ విజయం
విశేషాలు: ఈ మ్యాచ్‌ ఫలితం మన జట్టు భావోద్వేగాలతో ముడిపడటం విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. అంతకుముందు సిడ్నీ టెస్టు సందర్భంగా హర్భజన్‌–సైమండ్స్‌ మధ్య జరిగిన ‘మంకీ గేట్‌’ వివాదం, ఒక దశలో టూర్‌ నుంచి తప్పుకోవాలనుకున్న భారత్‌ ఆలోచన, విచారణ తదితర పరిణామాల తర్వాత కుంబ్లే నాయకత్వంలో జట్టు ఒక్కటై సర్వం ఒడ్డి గెలుపు కోసం పోరాడింది. ద్రవిడ్‌ (93), సచిన్‌ (71)ల బ్యాటింగ్‌తో భారత్‌ 330 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 212 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్మణ్‌ (79) ఆటతో టీమిండియా 294 పరుగులు సాధించి ఆసీస్‌ ముందు 413 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆతిథ్య జట్టు 340 పరుగులకు కుప్పకూలడం, భారత జట్టు సంబరాల్లో మునగడం చకచకా జరిగిపోయాయి.


2003–04 సిరీస్‌ (రెండో టెస్టు–అడిలైడ్‌)
ఫలితం: 4 వికెట్లతో భారత్‌ గెలుపు
విశేషాలు: సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు దక్కిన విజయమిది. పాంటింగ్‌ (242) డబుల్‌ సెంచరీతో ఆస్ట్రేలియా 556 పరుగులు చేయగా... ద్రవిడ్‌ (233), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (148)ల మధ్య 303 పరుగుల భాగస్వామ్యం భారత్‌నూ దాదాపు సమంగా (523 పరుగులు) నిలిపింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అగార్కర్‌ (6/41) ధాటికి ఆసీస్‌ అనూహ్యంగా 196 పరుగులకే కుప్పకూలింది. 233 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి భారత్‌ ఛేదించిన క్షణాన తన సహజ శైలికి భిన్నంగా ద్రవిడ్‌ ఆవేశంగా గాల్లోకి విసిరిన విజయపు పంచ్‌ను ఎవరూ మరచిపోలేరు.


1977–78 సిరీస్‌ (మూడో టెస్టు–మెల్‌బోర్న్‌)
ఫలితం: 222 పరుగులతో భారత్‌ ఘన విజయం  
విశేషాలు: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు సాధించిన తొలి టెస్టు విజయమిది. రెండు ఇన్నింగ్స్‌లలో లెగ్‌స్పిన్నర్‌ భగవత్‌ చంద్రశేఖర్‌ ఆరేసి వికెట్లతో (6/52, 6/52) చెలరేగి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. మొహిందర్‌ అమర్‌నాథ్‌ (72), గుండప్ప విశ్వనాథ్‌ (59) అర్ధ సెంచరీలతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 213 పరుగులకు పరిమితమైంది. గావస్కర్‌ (118) సెంచరీ సహాయంతో రెండో ఇన్నింగ్స్‌లో 343 పరుగులు చేసిన భారత్‌ ప్రత్యర్థి ముందు 387 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆసీస్‌ 164 పరుగులకే కుప్పకూలింది.


1985–86 సిరీస్‌ (తొలి టెస్టు–అడిలైడ్‌)
ఫలితం: మ్యాచ్‌ ‘డ్రా’
విశేషాలు: భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టడం మ్యాచ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. ఇప్పటికీ ఆస్ట్రేలియా గడ్డపై భారత బౌలర్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే (8/106) కావడం విశేషం. కపిల్‌ కెప్టెన్‌గా ఉన్న ఈ మ్యాచ్‌లో ముందుగా ఆస్ట్రేలియా గ్రెగ్‌ రిచీ (128), డేవిడ్‌ బూన్‌ (123) సెంచరీలతో 381 పరుగులు చేయగా... గావస్కర్‌ (166 నాటౌట్‌) అజేయ శతకంతో భారత్‌ 520 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 8 ఓవర్లే ఆడే అవకాశం దక్కగా, మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది.


1991–92 సిరీస్‌ (ఐదో టెస్టు–పెర్త్‌)
ఫలితం: 300 పరుగులతో భారత్‌ ఓటమి
విశేషాలు: మ్యాచ్‌లో భారత్‌కు భారీ పరాజయం ఎదురైనా... ఒక్క ఆటగాడి ప్రదర్శన మాత్రం తదనంతర కాలంలో అతను ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా మారడానికి కావాల్సిన పునాదిని వేసింది. 19 ఏళ్ల సచిన్‌ టెండూల్కర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 161 బంతుల్లో 16 ఫోర్లతో 114 పరుగులు చేయడం విశేషం. ఇదే సిరీస్‌లో అంతకుముందు సిడ్నీ టెస్టులో కూడా సచిన్‌ అజేయంగా 148 పరుగులు చేసి ఆస్ట్రేలియాలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచినా... దానికంటే ఆ సమయంలో ప్రపంచంలో ఫాస్టెస్ట్‌ పిచ్‌గా గుర్తింపు పొందిన ‘వాకా’ మైదానంలో సచిన్‌ చేసిన ఈ ప్రత్యేక శతకం అతని స్థాయిని పెంచింది. సచిన్‌ బౌండరీలన్నీ దాదాపుగా చూడచక్కటి స్క్వేర్‌ కట్‌లే. బూన్‌ (107) సెంచరీతో ఆస్ట్రేలియా 346 పరుగులు చేయగా, భారత్‌ 272 పరుగులకు పరిమితమైంది. అనంతరం డీన్‌ జోన్స్‌ (150 నాటౌట్‌), మూడీ (101) శతకాలతో ఆసీస్‌ 367 పరుగులకు డిక్లేర్‌ చేసి సవాల్‌ విసిరింది. అయితే భారత్‌ 141 పరుగులకే కుప్పకూలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement