వెళ్లిరా...నేస్తమా! | Phillip Hughes’s funeral is a Princess Diana moment for Australia | Sakshi
Sakshi News home page

వెళ్లిరా...నేస్తమా!

Published Thu, Dec 4 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

వెళ్లిరా...నేస్తమా!

వెళ్లిరా...నేస్తమా!

హ్యూస్ అంత్యక్రియలు పూర్తి  
ఆస్ట్రేలియా ప్రధానితో పాటు వేలాదిమంది హాజరు

నిన్నమొన్నటిదాకా మాతో కలసి ఆడావు, పాడావు, తిరిగావు...
 ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ మాలో ఒకడిలా కలసిపోయావు...
 ఏం తొందరొచ్చిందని అప్పుడే వెళ్లిపోయావ్...
 ఏం అనుభవించావని సెలవు తీసుకున్నావ్...
 ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే ఆటే నిన్ను
 మింగేసిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక
 పోతున్నాం... ఆధునిక పరిజ్ఞానం ఉన్నా.. అనుభవజ్ఞులైన వైద్యులున్నా... నిన్ను బతికించుకోలేకపోయామన్న క్షోభ మనసును దహిస్తోంది...
 భౌతికంగా నువ్వు దూరంకావొచ్చు... కానీ నీ జ్ఞాపకాలు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి...
 వెళ్లిరా నేస్తమా... నువ్వు ప్రేమించిన ఆటను
 మళ్లీ ఆడేందుకు!
 వెళ్లిరా నేస్తమా... ఈ కుటుంబ బాధ్యతను మరో జన్మలోనైనా తీర్చుకునేందుకు!
 వెళ్లిరా నేస్తమా... నిన్ను మరవలేని నీ స్నేహితులతో కలసి ఆడేందుకు, పాడేందుకు!
 ...ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ అంత్యక్రియలకు హాజరైన వందలాది క్రికెటర్లు, వేలాది మంది అభిమానుల మూగవేదన ఇది.
 
మాక్స్‌విలే (ఆస్ట్రేలియా): కన్నీళ్లతో కళ్లు చెమ్మగిల్లుతుంటే.. బాధతో హృదయం బరువెక్కుతుంటే... మనసు అంతరాల్లో ఎగసిపడుతున్న ఆందోళనను దిగమింగుకుంటూ... రాకాసి బౌన్సర్‌కు ప్రాణాలు కోల్పోయిన తమ సహచరుడు ఫిలిప్ జోయల్ హ్యూస్‌కు ఆస్ట్రేలియా తుది వీడ్కోలు పలికింది. బుధవారం వేలాదిమంది సమక్షంలో మాక్స్‌విలేలోని తన వ్యవసాయ క్షేత్రం 408లో క్రికెటర్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. దేశ ప్రధాని టోనీ అబాట్‌తో పాటు ఆసీస్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హ్యూస్‌కు కడసారి నివాళులు అర్పించారు. భారత తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మురళీ విజయ్, టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి, మేనేజర్ అర్షద్ అయూబ్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
క్రికెటర్ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరుకావడంతో మాక్స్‌విలే కిక్కిరిసిపోయింది.
* మాక్స్‌విలే హైస్కూల్ స్పోర్ట్స్ హాల్‌లో పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. క్రికెటర్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు హాల్‌లో 80 శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు.
 
* క్లార్క్, ఇతర ప్రముఖులు ముందు వరుసలో కూర్చొని ఉండగా, ఫాదర్ మైకేల్ అల్‌కాక్ నేతృత్వంలో చివరి ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టడంతో హాల్‌లో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి.శవపేటిక ముందు హ్యూస్ ధరించిన క్రికెట్ ఆస్ట్రేలియా డ్రెస్, బ్యాగీ గ్రీన్ క్యాప్‌లను వికెట్లపై తగిలించి ఉంచారు.  
 
* హ్యూస్ కుటుంబ సభ్యులు, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్‌లు పక్కన నిలబడి ఉండగా, క్రికెటర్ గురించి హృదయ వేదన కలిగించే సంతాప సందేశాన్ని క్లార్క్ చదివి వినిపించాడు. తర్వాత హ్యూస్ తోబుట్టువులు, స్నేహితులు తమ సంతాప సందేశాలను చదివారు.

* హాల్‌లో ఉన్నవారందరూ తమ నివాళులు అర్పించిన తర్వాత హ్యూస్ పార్థీవ దేహాన్ని మాక్స్‌విలే వీధుల్లో ఊరేగించారు. ప్రధాని అబాట్, ఆటగాళ్లు, స్నేహితులు, ఇతర అభిమానులు పెద్ద ఎత్తున దీన్ని అనుసరించారు. ఈ సందర్భంగా స్థానికులు చివరిసారిగా క్రికెటర్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.
 
* ఆసీస్ ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ చేసిన తర్వాత క్రికెటర్ శవ పేటికను వ్యవసాయ క్షేత్రానికి తరలించారు.హ్యూస్ తండ్రి గ్రెగ్, సోదరుడు జాసన్, క్లార్క్, ఫించ్, లోనెర్‌గాన్, మ్యాథ్యూ డే, టామ్ కూపర్‌లు మాక్స్‌విలే స్పోర్ట్స్ హాల్ నుంచి శవ పేటికను మోసుకెళ్లారు. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న అరటి తోటలో పార్థివ దేహాన్ని ఖననం చేశారు.

* మోదీ, సచిన్ నివాళి భారత ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్... హ్యూస్‌కు నివాళి అర్పించారు. ‘హ్యూస్ మేం నిన్ను మిస్ అవుతున్నాం.
 
* ఆట పట్ల నీ అంకితభావం, నేర్చుకోవాలనే తపన ఎందరికో స్ఫూర్తినిస్తాయి’ అని సచిన్ ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్‌కు 2013లో హ్యూస్ ఆడినప్పుడు అతనితో కలసి ఉన్న ఫొటోను సచిన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా హ్యూస్‌కు నివాళి అర్పించాడు.పాకిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే రెండు టి20ల సిరీస్ ట్రోఫీని హ్యూస్‌కు అంకితం చేశారు. గురు, శుక్రవారాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.
 
దేశవ్యాప్తంగా వేలాదిమంది
ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన క్రికెట్ మైదానాల్లో హ్యూస్ అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. వేలాదిమంది బిగ్ స్క్రీన్‌పై దీనిని చూస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
 
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లోపల 63 బ్యాట్లను వరుసగా నిలబెట్టి తనకు నివాళి అర్పించారు. చివరిసారి ఈ మైదానంలోనే ఆడి 63 పరుగులు చేశాక హ్యూస్ తలకు బంతి తగిలింది. హ్యూస్ చివరిసారి ఆడిన రాండ్‌విక్ ఎండ్‌లో పువ్వులు ఉంచారు. వికెట్ల మీద నుంచి ఒక బెయిల్ తీసి కిందపెట్టారు. ‘సిడ్నీ క్రికెట్ మైదానం నిన్నెప్పటికీ మరవదు’ అని రాశారు.
 
అబాట్‌కు అండగా...
హ్యూస్ అంత్యక్రియల సందర్భంగా అందరి దృష్టీ బౌలర్ అబాట్‌పై ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించిన టీవీ చానల్ సిబ్బంది అతనిపైకి కెమెరా వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. తనని చిత్రీకరించి ఇంకా ఎక్కువ ఇబ్బందిపెట్టకూడదని భావించారు. మీడియా కూడా చాలావరకు అతనికి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ముదురు నీలం రంగు సూట్ ధరించిన 22 ఏళ్ల అబాట్ తన తల్లి జార్జియానా, తండ్రి నాథన్, గర్ల్‌ఫ్రెండ్ బ్రియర్ నీల్‌తో కలసి అంత్యక్రియలకు హాజరయ్యాడు. మృతదేహాన్ని చూడటానికి స్కూల్ ఆవరణలోకి వెళ్లి వచ్చేవరకు నీల్... అబాట్ నడుమును గట్టిగా పట్టుకుని ధైర్యాన్నిచ్చింది. డీన్‌జోన్స్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు అబాట్‌ను సముదాయించారు. హ్యూస్ స్నేహితులు, బంధువులు అబాట్‌కు ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement