హ్యూస్ అంత్యక్రియలు నేడు | phillip hughes console To day | Sakshi
Sakshi News home page

హ్యూస్ అంత్యక్రియలు నేడు

Published Wed, Dec 3 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

హ్యూస్ అంత్యక్రియలు నేడు

హ్యూస్ అంత్యక్రియలు నేడు

భారీ సంఖ్యలో హాజరుకానున్న అభిమానులు
 క్రికెటర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా..
 శవపేటిక మోయనున్న క్లార్క్, ఫించ్
  ఆసీస్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం

 
 మెల్‌బోర్న్:  రాకాసి బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ జోయల్ హ్యూస్ అంత్యక్రియలు నేడు (బుధవారం) మాక్స్‌విలేలో జరగనున్నాయి. మాక్స్‌విలే హైస్కూల్ స్పోర్ట్స్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న అంతిమ సంస్కారాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరుకావాలని క్రికెటర్ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
 
  ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో పాటు 300 నుంచి 400 మంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు... 5 వేలమందికిపైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. న్యూసౌత్ వేల్స్, ఆసీస్ టెస్టు జట్లు మొత్తం మాక్స్‌విలేకు రానున్నాయని హ్యూస్ మేనేజర్ జేమ్స్ హెండర్సన్ వెల్లడించారు. క్రికెటర్‌ను చివరిసారిగా చూడాలనుకుంటున్న వారందరూ హాల్‌లోకి రావొచ్చని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
 
 ఆటగాళ్ల ‘గార్డ్ ఆఫ్ ఆనర్’
 తొలుత క్రికెటర్లు హ్యూస్‌కు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ సమర్పించనున్నారు. తర్వాత ఆటగాడి పార్థివ దేహాన్ని మాక్స్‌విలేలో ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ హాల్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ గ్రామంలోని వీధుల వెంబడి వరుసగా నిలబడి హ్యూస్‌కు ప్రత్యేక వీడ్కోలు పలకనున్నారు.
 
 మాక్స్‌విలేలో ప్రసిద్ధి చెందిన ‘టైలర్స్ ఆర్మ్ హోటల్’కు కొద్ది దూరంలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయం క్షేత్రం 408లో క్రికెటర్ దేహాన్ని ఖననం చేయనున్నారు. ఆసీస్ తరఫున బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను అందుకున్న 408వ క్రికెటర్ కావడంతో తన క్షేత్రానికి హ్యూస్ అదే సంఖ్యను పెట్టుకున్నాడు. క్రికెట్ లేనప్పుడు వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువగా గడిపే హ్యూస్ ఇక శాశ్వతంగా అక్కడే ఉండిపోనున్నాడు.
 
 శవపేటిక మోయనున్న క్లార్క్, ఫించ్
 హ్యూస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న ఆసీస్ కెప్టెన్ క్లార్క్... ఫించ్, టామ్ కూపర్‌లతో కలిసి క్రికెటర్ పార్థివ దేహా (శవపేటిక)న్ని మోయనున్నాడు. అంత్యక్రియల ఏర్పాట్లలో హ్యూస్ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే కెప్టెన్ భాగం పంచుకుంటున్నాడు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.
 

 ఆసీస్ స్పోర్టింగ్ కలర్స్ అయిన ఆకుపచ్చ, బంగారు వర్ణాలతో మాక్స్‌విలేలోని స్టోర్స్, పబ్లిక్ బిల్డింగ్‌లను అలంకరించనున్నారు. వీధుల్లో పూలతో అలంకరించిన హ్యూస్ ఫొటోలను ఏర్పాటు చేశారు. హ్యూస్ అంత్యక్రియలను పలు చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్‌సీజీ, అడిలైడ్, వాకా, ఓవల్ మైదానాల్లోని బిగ్‌స్క్రీన్లపై కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు.
 
 ‘బౌండరీ’ నిండిన పుష్పాలు
 మాక్స్‌విలేలోని బౌండరీ స్ట్రీట్ లైన్‌లో ఉన్న హ్యూస్ ఇంటికి ఇంకా పుష్పగుచ్చాలు అందుతూనే ఉన్నాయి. హ్యూస్ పార్థివ దేహం కోసం మాక్స్‌విలే ఎదురుచూస్తోందని ప్రాథమిక పాఠశాల టీచర్, క్రికెటర్ తల్లి విర్జినీయా స్నేహితురాలు నోర్మా చెప్పింది. ‘గ్రామంలోని ప్రతి ఒక్కరికి రాబోయే రోజులు చాలా భారంగా గడుస్తాయి. మాక్స్‌విలే అందరి దృష్టిలో పడటం ఇది రెండోసారి.
 
 1964లో రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుడు ఫ్రాంక్ ప్యాట్రిడ్జ్ వీసీ అంత్యక్రియల్లో చాలా మంది పెద్దవాళ్లు పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడు అలాంటి వాతావరణమే ఇక్కడ నెలకొంది’ అని నోర్మా వ్యాఖ్యానించింది. గ్రామానికి గుర్తింపు తెచ్చిన హ్యూస్ అంటే అక్కడి వారు ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. చిన్నప్పుడు హ్యూస్‌కు బౌలింగ్ యంత్రాన్ని కొనిపెట్టిన మాక్స్‌విల్లే ఎక్స్ సర్వీస్‌మెన్ క్లబ్ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement