క్రికెట్ 'గాయాలు'
సిడ్నీ:క్రికెట్ లో గాయాలు కావడం సర్వసాధారణమే అయినా.. కొన్నిసందర్భాల్లో క్రికెటర్లు మృత్యువుతో సాహసం చేస్తుంటారు. నాటి నుంచి నేటి వరకూ క్రికెటర్లను 'గాయాలు' బాధిస్తూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ ను అప్పుడప్పుడూ మరణాలు షాక్ కు గురి చేస్తుంటాయి. తాజాగా ఆసీస్ క్రికెటర్ హ్యూస్ తలకు తీవ్రంగా గాయం కావడంతో మృత్యువుతో రెండు రోజులు పోరాడి అసువులు బాసాడు. గతంలో కొంతమంది క్రికెటర్లు మృతి చెందగా, మరి కొందరు క్రికెట్ తీవ్ర గాయాలతో ఆట నుంచి వైదొలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
*1959 లో అబ్దుల్ అజీజ్.. 19 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతూ బాల్ తన ఛాతికి బలంగా తగలడంతో కుప్పకూలిపోయాడు. చివరకు ఆస్పత్రిలో మరణించాడు.
*1960లో వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫ్రిత్ వేసిన బౌన్సర్ భారత క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ తలకు తగలడంతో ఆరు రోజులు కోమాలు ఉన్నాడు. ఆ మ్యాచ్ అనంతరం నారీ కాంట్రాక్టర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
*1975 లో న్యూజిలాండ్ ఆటగాడు ఈవెన్ ఛాట్ ఫీల్డ్ కు ఇంగ్లండ్ పేసర్ పీటర్ లీవర్ వేసిన బంతి తగలడంతో అతనికి నాలుకకు తీవ్రగాయమైంది. అనంతరం అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
*1986లో వెస్టిండీస్ స్పీడ్ స్టార్ మైకేల్ మార్షల్ వేసిన బంతి ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్ ముక్కుకు తగిలి అతనికి తీవ్ర గాయమయ్యింది.
*భారత ఆటగాడు రమణ్ లాంబా షార్ట్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా బంగ్లాదేశ్ ఆటగాడు మెహ్రబ్ హుస్సేన్ కొట్టిన షాట్ కు కుప్పకూలిపోయాడు. మూడు రోజుల కోమాలో ఉన్న అనంతరం లాంబా మృతి చెందాడు.