క్రికెటే ప్రాణం అనుకున్నాడు!
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు క్రికెటే శ్వాస. క్రికెటే ప్రాణం అనుకున్నాడు. క్రికెట్ తోడిదే జీవితం అనుకున్నాడు. చివరకు మరణంలోనూ క్రికెట్‌నే శ్వాసించాడు. మైదానంలో అడుగు పెట్టే ప్రొఫెషనల్ ఆటగాళ్లందరికీ ఆటే జీవితకాలపు సహచరి. అందుకే పాతికేళ్ల వయసులోనే ప్రపంచం గర్వపడేస్థాయి ఆటగాడయ్యాడు. మొదటి టెస్టులోనే రాణించి సెహభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాతి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాది వహ్వా అనిపించుకున్నాడు. అగ్రశ్రేణి క్రికెటర్లంతా ఎవడీ కుర్రాడు అని అబ్బుర పడేలా ఆటలో లీనమైపోయాడు.
రెండు రోజుల క్రితం న్యూ సౌత్ వేల్స్ జట్టుతో షెఫిన్ షీల్డ్ మ్యాచ్‌లోనూ హ్యూస్ అదరగొట్టేలాగే ఆడాడు. 60 పై చిలుకు పరుగులు చేసి మరో సెంచరీ వైపు చూస్తున్నాడు. అంతలో న్యూ సౌత్ వేల్స్ బౌలర్ సీన్ అబాట్ విసిరిన ఓ బౌన్సర్‌ను హుక్ చేద్దామనుకున్న హ్యూస్ అంచనా తప్పింది. బంతి నేరుగా తలకు మెడకు మధ్య సున్నితమైన భాగాన్ని వేగంగా వచ్చి తాకింది. అంతే హ్యూస్ కుప్ప కూలిపోయాడు. వెంటనే హెలికాప్టర్‌పై హ్యూస్‌ను సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌కు తరలించారు. తలకు సర్జరీ చేయాలని వైద్యులు తేల్చారు. హ్యూస్ అప్పటికే కోమాలోకి వెళ్లిపోయాడు. చికిత్స పొందుతూ హ్యూస్ ఈ రోజు తుది శ్వాస విడిచాడు.
కెరీర్లో ఇప్పటి వరకు 26 టెస్టులు ఆడిన హ్యూస్ వచ్చే నెల 4 నుంచి ఆరంభం కానున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మొదటి టెస్ట్‌కు ఆసీస్ జట్టులో స్థానం పొందాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. హ్యూస్కు గాయం అయ్యిందని తెలియగానే ప్రపంచ క్రీడా ప్రముఖులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. హ్యూస్ త్వరగా కోలుకోవాలని బ్రియన్ లారా వంటి దిగ్గజాలంతా ప్రార్ధించారు. క్రికెట్ ఆస్ట్రేలియా అంతా హ్యూస్ కోలుకోవాలని ప్రార్ధనలు చేసింది. అందరి ఆకాంక్షలు, ప్రార్ధనలూ ఫలించి హ్యూస్ ప్రాణం పోసుకుని లేచి వస్తాడని అందరూ కలలు కన్నారు. కానీ చివరి బంతి వరకూ క్రమశిక్షణతో ఆడే అలవాటున్న హ్యూస్, ఆసుపత్రిలోనే చివరి శ్వాస విడిచాడు.
గతంలో భారత బ్యాట్స్ మన్ రామన్ లంబా కూడా ఇలాగే క్రికెట్ మైదానంలోనే తలకు గాయమై ప్రాణాలు విడిచాడు. కాకపోతే రామన్ లంబా సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తూ తలకు గాయమై మరణించాడు. ఇపుడు హ్యూస్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. హ్యూస్, రామన్ లంబాలు తుది శ్వాస వరకు క్రికెట్‌నే ప్రేమించారు. క్రికెటే జీవితం అనుకున్నారు. క్రికెట్ అంటే అంత పిచ్చి వారికి. ఆట అంటే అంత అభిమానం వారికి. ఆ ఆటతోనే అంతిమ యాత్రకూ సిద్ధమయ్యారు.
**