సిడ్నీ: ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతితో పలు మ్యాచ్ లు పాక్షికంగా రద్దయ్యాయి. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా ఎలెవన్ తో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో తొలి రోజును రద్దు వేస్తున్నట్లు జట్టు మేనేజ్ మెంట్ స్సష్టం చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ ను ఒక రోజు పాటు రద్దు చేస్తున్నట్లు టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్, డైరెక్టర్ రవిశాస్త్రిలు ఆటగాళ్లకు తెలిపారు. దీంతో రేపు ఆరంభం కావాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ శనివారానికి వాయిదా పడింది. ఇదిలా ఉండగా పాకిస్థాస్, న్యూజిలాండ్ ల మధ్య జరిగే చివరి టెస్టు కూడా ఒక రోజు పాటు రద్దుచేశారు.షెడ్యూల్ ప్రకారం పాక్-కివీస్ ల మ్యాచ్ శుక్రవారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది. ఇరు బోర్డుల అంగీకారంతో ఆ టెస్ట్ మ్యాచ్ లో ఒక రోజు మ్యాచ్ ను రద్దు చేశారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈరోజు తుదిశ్వాస విడిచాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ హ్యూస్ మంగళవారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.