హ్యూస్ మృతికి సంతాపాల వెల్లువ
అడిలైడ్ / న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతితో ప్రపంచ క్రీడా ప్రేమికులతో పాటు క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకుంటున్న క్రమంలో పాతికేళ్ల వయస్సులోనే అనూహ్య పరిస్థితిలో ప్రాణాలు వదిలిన హ్యూస్‌పై విశ్వవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. ఇది క్రికెట్‌కే దారుణమైన రోజుగా పలువురు అభివర్ణించారు. కొందరు తమ ఆవేదనను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పంచుకున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఎబాట్, ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐలతో పాటు ఇతర బోర్డులు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, భారత్, ఆసీస్ ఆటగాళ్లు, ఇతర జట్ల ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు, బాలీవుడ్ నటులు ఇలా ప్రతీ ఒక్కరు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తమ ఆటగాడి మృతికి నివాళి ఘటిస్తూ ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆసీస్ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.
‘ఫిలిప్ మరణంతో మేమంతా షాక్‌కు గురయ్యాం. మొత్తం క్రికెట్ ప్రపంచం తరఫున అతడి కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’
- ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్
‘మరో రెండు రోజుల్లో పుట్టిన రోజును జరుపుకోవాల్సిన హ్యూస్ మృతి ఆవేదన కలిగించింది. క్రికెట్ సమాజంలో చెరగని ముద్ర వేస్తూ వెళ్లిపోయిన అతడి కుటుంబానికి మా సానుభూతి’
- బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్
‘ఫిలిప్ మరణ వార్త విని షాకయ్యాను. క్రికెట్‌కు ఇది విచారకరమైన రోజు. అతడి కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు నా సంతాపం తెలుపుతున్నాను’
- సచిన్ టెండూల్కర్
‘తొలి టెస్టును రద్దు చేస్తే బావుంటుంది’
‘హ్యూస్ మరణంతో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆటపై వంద శాతం మనస్సును పెట్టలేరనేది నా అభిప్రాయం. ఇది నిజంగా చాలా కష్టకాలం. ఇరు జట్ల మధ్య తొలి టెస్టుకు కేవలం వారం రోజుల సమయం ఉంది. అయితే ఎవరూ కూడా ఇప్పుడు ఆడే స్థితిలో లేరనిపిస్తోంది. అందుకే ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలా? లేదా? అనే విషయాన్ని ఇరు బోర్డులు ఓసారి పరిశీలించాల్సి ఉంది’
- సునీల్ గవాస్కర్
‘క్రీడలో విషాదం అనే మాట తరచుగా వాడుతున్నా ఇది మాత్రం నిజ జీవిత విషాదం. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇది ఊహించని దెబ్బ. అతడి తల్లిదండ్రులు, తోబుట్టువులకు మా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది’
- సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్
దిగ్భ్రాంతి... విషాదం...
Published Fri, Nov 28 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement
Advertisement