కుప్పంలో కొత్త నాటకం.. టీడీపీ సానుభూతి డ్రామా | TDP Sympathy Drama In Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో కొత్త నాటకం.. టీడీపీ సానుభూతి డ్రామా

Published Thu, Nov 11 2021 4:40 PM | Last Updated on Thu, Nov 11 2021 5:19 PM

TDP Sympathy Drama In Kuppam - Sakshi

కార్యాలయంలోకి చొచ్చుకొస్తున్న టీడీపీ శ్రేణులు(ఫైల్‌)

సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్‌: కుప్పంలో టీడీపీ కొత్త నాటకానికి తెరలేపింది. మున్సిపల్‌ కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులతో దాడి చేయించి వైఎస్సార్‌ సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. తద్వారా సానుభూతి పొంది మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నింది. ఎంతచేసినా ఓటర్ల నుంచి స్పందన కనిపించలేదు. దీనికితోడు పార్టీలో 30 ఏళ్లుగా కీలకంగా ఉన్న ముగ్గురు నాయకులు చేసిన అవినీతి, అక్రమాలు శాపంగా మారడంతో టీడీపీ కేడర్‌ డీలాపడిపోయింది. 

చదవండి: తిరుపతిలో కుండపోత వర్షం

ఆ రోజు ఏం జరిగిందంటే 
నామినేషన్ల ఉపసంహరణ రోజు సోమవారం రాత్రి 14వ వార్డు టీడీపీ అభ్యర్థులు ప్రకాష్, తిరుమగన్‌ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మునుస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. తమ అభ్యర్థి ఎవ్వరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదంటూ పథకం ప్రకారం సుమారు 150 మంది మున్సిపల్‌ కార్యాలయం గేట్లను తోసుకుని లోనికి వచ్చారు. అద్దాలు ధ్వంసం చేశారు. కమిషనర్‌ను నోటికి వచ్చినట్టు దూషించడంతోపాటు బెదిరింపులకు దిగారు. ‘వచ్చేది మా ప్రభుత్వం. మేం చెప్పినట్టు వినకపోతే నడిరోడ్డుపైనే నిలబెట్టి నరుకుతాం. రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నా కుప్పానికి తీసుకొచ్చి రోడ్డుపై తన్నుకుంటూ పోతాం’ అంటూ హెచ్చరించారు.

క్రిమినల్‌ కేసులు నమోదు 
తనపై దాడికి యత్నించిన టీడీపీ నాయకులపై కుప్పం మున్సిపల్‌ కమిషనర్‌ చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఐపీసీ సెక్షన్‌ కింద 143, 147, 353, 427 రెడ్‌ విత్‌ 149, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు కేసులు నమోదు చేశారు. తమకు అన్యాయం జరిగితే శాంతియుతంగా నిరసన తెలపాలని, దౌర్జన్యాలు, దాడులకు తెగపడడం తగదని హితవుపలికారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు కుప్పం వదలి వెళ్లాలని హెచ్చరించారు. అయినా టీడీపీ నేతలు లెక్కచేయకుండా కుప్పం హోటల్‌లో బసచేశారు. వారిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరు, పలమనేరులో వారి నివాసాల వద్ద విడిచిపెట్టారు.

వెంటాడుతున్న ఓటమి భయం 
మున్సిపల్‌ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. 30 ఏళ్లుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్, పీఎస్‌ మునిరత్నం అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసినా చంద్రబాబు ఏ రోజూ పట్టించుకోలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఓటర్లు వైఎస్సార్‌ సీపీ వైపు ఉన్నారని గుర్తించి తటస్తంగా ఉండిపోయారు. ప్రచారంలో పాల్గొనకుండా నివాసానికే పరిమితమయ్యారు.

ఆ ఫలితాలొస్తే కుప్పంలో టీడీపీ ఖాళీ
మూడు నెలల క్రితం వెలువడిన స్థానిక సంస్థల ఫలితాల్లో టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్సార్‌ సీపీ బద్ధలు కొట్టింది. శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం జెడ్పీటీసీలతో పాటు ఎంపీపీ స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 68 ఎంపీటీసీ స్థానాల్లోనూ 62 కైవసం చేసుకుంది. 89 సర్పంచ్‌ స్థానాల్లో 74 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఈ ఫలితాలు కుప్పంలోని టీడీపీని అథఃపాతాళానికి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడులైన మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. 25 వార్డుల్లో ఒక వార్డును ఏకగ్రీవం చేసుకున్న వైఎస్సార్‌ సీపీ మిగిలిన స్థానాల్లోనూ ఆ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతోంది. మున్సిపల్‌ ఫలితాల్లో కుప్పం స్థానాన్ని పోగొట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందేనని అధికార పార్టీ నాయకులు ధీమాగా చెబుతుండడం టీడీపీ నాయకులకు నిద్రపట్టనివ్వడంలేదు.

డ్రామాను రక్తికట్టించే యత్నం 
కుప్పం ఓటర్ల నుంచి సానుభూతి పొందేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు కొందరు గ్రూపుగా ఏర్పడి వైఎస్సార్‌ సీపీపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. టీడీపీ అనుకూల పత్రికలు, మీడియా ద్వారా బూతద్దంలో చూపిస్తున్నా ఓటర్ల నుంచి సానుభూతి లభించలేదు. ‘‘30 ఏళ్లుగా చంద్రబాబు ఏమీ చేయలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో ప్రతి కుటుంబానికీ లబ్ధికలిగించడంతో ఓటర్లు సీఎం వైఎస్‌ జగన్‌వైపే ఉన్నారు’’ అని గుర్తించిన టీడీపీ నాయకులు చీప్‌ట్రిక్స్‌ ప్లే చేయడానికి ప్రయత్నం ముమ్మరం చేశారు. టీడీపీ నేతలపై క్రిమినల్‌ కేసులు ఉన్నా పోలీసులు అరెస్టు చేయకుండా గౌరవంగా వారి ఇళ్ల వద్ద విడిచిపెట్టి రావడాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చలో కుప్పం పేరుతో మరికొంత మంది టీడీపీ గూండాలను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement